ETV Bharat / state

మేడిగడ్డలో పని పూర్తైనా తొలగించని కాఫర్‌ డ్యాం - విజిలెన్స్‌ విచారణలో ఆసక్తికర విషయాలు

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 2, 2024, 9:54 AM IST

Medigadda Barrage Damage Issue Updates : మేడిగడ్డపై విజిలెన్స్‌ దర్యాప్తులో ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. ఆనకట్ట పని సమయంలో నీటిని మళ్లించేందుకు కాఫర్‌ డ్యాంను గుత్తేదారు సంస్థ నిర్మించింది. పనులు పూర్తైన అనంతరం దానిని తొలగించలేదు. కానీ తొలగించినట్లు ఎం.బుక్‌లో నమోదు చేశారు. ఫలితంగా వరద సమయంలో ఇనుప షీట్‌ పైల్స్‌, ఇసుక అడ్డుపడినట్లు రిమోట్‌ సెన్సింగ్‌ సాయంతో విజిలెన్స్‌ గుర్తించింది.

Medigadda Barrage Damage
Medigadda Barrage Damage

Medigadda Barrage Damage Issue Updates : కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విజిలెన్స్‌ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మేడిగడ్డ ఆనకట్టలో ఒప్పందం ప్రకారం చేయాల్సిన కొన్ని పనులను గుత్తేదారు సంస్థ చేయకుండానే వదిలేసినట్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నిర్ధారించింది. ఇలా వదిలేసిన పనులకు బిల్లులు చేసుకున్నారన్న అనుమానం వ్యక్తం చేసింది. ఈ మేరకు వివరాలు సేకరించే పనిలో నిమగ్నమైంది.

Vigilance Inquiry on Medigadda Barrage : ప్రత్యేకించి మేడిగడ్డ బ్యారేజీ పని సమయంలో నీటిని మళ్లించేందుకు నిర్మించిన కాఫర్‌ డ్యాం (మట్టికట్ట)ను ఒప్పందం ప్రకారం తొలగించలేదని, ఎం.బుక్‌లో మాత్రం తొలగించినట్లు రికార్డు చేశారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఫలితంగా దీనికి వినియోగించిన ఇసుక, మట్టి, షీట్‌ పైల్స్‌ వరద సమయంలో కొట్టుకుపోయి ఆనకట్ట వద్ద అడ్డుపడటంతో నీటి ప్రవాహంలో మార్పు వచ్చినట్లు విజిలెన్స్‌ (Vigilance Inquiry on Medigadda) భావిస్తోంది. నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ ద్వారా సేకరించిన వివరాల మేరకు ఈ విషయాన్ని నిర్ధారించుకుంది.

కాళేశ్వరం 3 బ్యారేజీల్లోని నీళ్లన్నీ ఖాళీ చేయాల్సిందే! : నీటిపారుదల శాఖ

కాఫర్‌ డ్యాంను అలాగే వదిలేయడం వల్ల దానిలో వినియోగించిన ఇసుక, మట్టి ఆనకట్ట దిగువకు వచ్చి మేట వేసిందని, దీన్ని తొలగించడానికి మళ్లీ గుత్తేదారుకు అదనంగా చెల్లించినట్లు విజిలెన్స్‌ అధికారులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. భారీ వరద వచ్చినపుడు కాఫర్‌ డ్యాం క్రమంగా కొట్టుకుపోతే ఎలా ఉంటుంది, ఒక్కసారిగా మొత్తం కొట్టుకుపోయి బ్యారేజీని తగిలి ఉంటే దాని ప్రభావం ఎలా ఉంటుందో విశ్లేషిస్తున్నారు. ఇనుప షీట్‌పైల్స్‌ బ్యారేజీ దగ్గర పడి ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు.

Medigadda Barrage Issue Updates : మేడిగడ్డ బ్యారేజీకి (Medigadda Barrage) ఎగువన ఇసుకను 88 మీటర్ల వద్ద లెవెల్‌ చేయాలని, కానీ అలా చేయకుండా వదిలేయడం వల్ల గుట్టలుగా పేరుకున్న ఇసుక కూడా నీటి ప్రవాహంపై ప్రభావం చూపి ఉండవచ్చన్న కోణంలోనూ విజిలెన్స్ అధికారులు విశ్లేషణ చేస్తున్నారు. మరోవైపు ప్రాజెక్టు నాణ్యతను నిర్ధారించుకునేందుకు కోర్‌ కటింగ్‌ (నిర్మాణ నమూనాల సేకరణ) చేయించారు. దీనివల్ల సిమెంట్, ఇసుక, కంకర నిర్ణీత ప్రమాణాల మేరకు కలిపారా, స్టీలు తగినంతగా వాడారా తదితర వివరాలన్నీ తెలుస్తాయి. ఆనకట్టలోని పలు ప్రాంతాల్లో చేసిన కోర్‌ కటింగ్‌ నమూనాలను పరీక్ష కోసం అధికారులు లేబొరేటరీకి పంపారు.

మేడిగడ్డ బ్యారేజీలో మరిన్ని సమస్యలు - విజిలెన్స్ అధ్యయనంలో గుర్తింపు

రూ.2,000ల కోట్లు పెరిగిన వ్యయం : మరోవైపు మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ వ్యయం కూడా భారీగా పెరిగింది. అంచనాల్లో పేర్కొన్న పనులు, వాటి విలువ, చేసిన పని, విలువ తదితర వివరాలను విజిలెన్స్‌ అధికారులు సేకరించారు. ఈ ఆనకట్ట నిర్మాణానికి 2016 మార్చి 1న రూ.2591 కోట్లకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బ్యారేజీ, గేట్ల నిర్మాణం, బ్యారేజీకి రెండువైపులా గైడ్‌ బండ్స్‌ నిర్మించడానికి ఈ మొత్తం ఖర్చవుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. తర్వాత రెండు నెలలకే ఆనకట్ట నిర్మాణ వ్యయం రూ.3260 కోట్లుగా పేర్కొంటూ 2016 మే 19న సర్కార్ మరో ఉత్తర్వు ఇచ్చింది. 2021 సెప్టెంబరు 6న మళ్లీ ఈ మొత్తాన్ని సవరించి రూ.4613 కోట్లుగా పేర్కొంటూ ఆదేశాలు జారీ చేసింది. కానీ పని ప్రారంభించి పూర్తయ్యేలోగా వ్యయం రూ.2022 కోట్లు పెరగడం ఇందులో గమనార్హం. దీనిపై కూడా విజిలెన్స్‌ లోతుగా దర్యాప్తు చేస్తోంది.

కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వానికి చేరిన కాగ్‌ రిపోర్డ్

మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలపై పర్యావరణ నిపుణుల హెచ్చరిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.