ETV Bharat / state

వైసీపీకి ప్రచారం - సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సస్పెన్షన్‌ - Venkatram Reddy

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 18, 2024, 9:14 PM IST

Updated : Apr 19, 2024, 7:16 AM IST

Venkatram Reddy
Venkatram Reddy

Secretariat Employees Union President Venkatram Reddy: సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిను ఈసీ ఆదేశాలతో సస్పెండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బద్వేలులో ఆర్టీసీ ఉద్యోగులతో భేటీలో వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేశారని వెంకట్రామిరెడ్డిపై అభియోగం నమోదైంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకట్రామిరెడ్డిపై ఈసీ ఆదేశాల మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

Secretariat Employees Union President Venkatram Reddy: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎన్నికల సంఘం సస్పెన్షన్‌ వేటు వేసింది. ఈసీ ఆదేశాలమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హెడ్‌క్వార్టర్స్‌ దాటి వెళ్లొద్దని ఈసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇటీవల వెంకట్రామిరెడ్డి కడప జిల్లా బద్వేలులో వైసీపీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులతో సమావేశమై అధికార పార్టీకి ఓటు వేయాలని ప్రచారం చేశారని ఆధారాలతో టీడీపీ నేతలు ఈసీ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కడప జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా వెంకట్రామిరెడ్డిపై ఎన్నికల సంఘం చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. వెంకట్రామిరెడ్డి పంచాయతీరాజ్‌ శాఖలో అసిస్టెంట్‌ సెక్రటరీగా పనిచేస్తున్నారు.

వెంకట్రామిరెడ్డిపై ఫిర్యాదు చేసిన వర్ల రామయ్య: ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి జగన్‌ తరుపున ఎన్నికల ప్రచారం చేస్తున్న ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిని వెంటనే సస్పెండ్‌ చేయాలని తెలుగుదేశం నేత వర్ల రామయ్య ఈటీవల ఈసీకి ఫిర్యాదు చేశారు. ప్రజల డబ్బును జీతంగా తీసుకుంటూ బహిరంగంగా వైసీపీ తరపున ఎన్నికల ప్రచారం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సివిల్‌ కాండక్ట్‌ రూల్స్‌ ప్రకారం రామిరెడ్డిని సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించాలన్నారు. జగన్‌ రాష్ట్రంలోని ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. దీనిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మీనాకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో వర్ల రామయ్య పేర్కొన్నారు. వర్ల ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. సమగ్రంగా విచారణ చేయాలంటూ దీనిపై కడప జిల్లా కలెక్టర్‌ను ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్ నివేదిక మేరకూ వెంకట్రామిరెడ్డిపై ఈసీ చర్యలు చేపట్టింది.

వైసీపీ ప్రచారంలో ఉద్యోగుల సంఘం నేత: ఆర్టీసీలోని వైఎస్‌ఆర్‌ ఉద్యోగుల సంఘం నేత ఒకరు తన పుట్టినరోజు వేడుక పేరిట కార్యక్రమం నిర్వహించి వైసీపీకి ఓటేయాలని ప్రచారం చేసినట్లు తెలుస్తోంది. గత నెల 30న ఇదంతా జరిగితే తాజాగా ఆర్టీసీ ఉద్యోగుల వాట్సప్‌ గ్రూపుల్లో ఈ విషయం చక్కర్లు కొడుతోంది. గుంటూరు-1 డిపోలో ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఎం.సుధాకర్‌బాబు జన్మదిన వేడుకలను గతనెల 30న గుంటూరు శివారులోని బుడంపాడు సమీపంలో నిర్వహించారు. ఈయన ప్రజా రవాణాశాఖ (పీటీడీ) వైఎస్‌ఆర్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నేతగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్‌ ప్రభుత్వానికి జాతీయ మీడియా, అంతర్‌రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా వ్యవహరిస్తున్న దేవులపల్లి అమర్‌ వైసీపీకి అనుకూలంగా రాసిన ‘మూడు దారులు’ అనే పుస్తకాన్ని సుధాకర్‌బాబు అక్కడికి వచ్చినవారందరికీ పంచారు. వైసీపీకి ఓటేసి మరోసారి ఈ ప్రభుత్వాన్ని గెలిపించాలని ఆయన కోరినట్లు ఆర్టీసీ ఉద్యోగుల వాట్సప్‌ గ్రూప్‌లో చక్కర్లు కొడుతోంది. పీటీడీ వైఎస్‌ఆర్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య సహా పలువురు గతనెల 31న వైయస్‌ఆర్‌ జిల్లాలోని పలు ఆర్టీసీ డిపోల్లో ప్రచారం చేయడం వెలుగులోకి రావడంతో చంద్రయ్య సహా 9 మందిపై ఆర్టీసీ అధికారులు సస్పెన్షన్‌ వేటు వేశారు. ఈ నేపథ్యంలో సుధాకర్‌బాబుపై కూడా చర్యలు ఉండవా అంటూ ఉద్యోగుల వాట్సప్‌ గ్రూపుల్లో చర్చ జరుగుతోంది.

వైసీపీ ప్రచారంలో ఆర్టీసీ డైరెక్టర్‌ : ఆర్టీసీ బోర్డు డైరెక్టర్‌గా ఉన్న చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన ఎ.రాజారెడ్డి ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి, వైసీపీని గెలిపించాలంటూ కరపత్రాలు ముద్రించి పంపిణీ చేస్తున్నారు. కరపత్రంపై మంత్రి పెద్దిరెడ్డి, పలువురు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల చిత్రాలను కూడా ముద్రించారు. కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పదవిలో కొనసాగుతూ ఇలా కరపత్రాన్ని తన పేరిట ముద్రించి, ఉద్యోగులకు పంచుతుండటం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలనే వాదన వినిపిస్తోంది.

Last Updated :Apr 19, 2024, 7:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.