ETV Bharat / state

బంగారం ధరలకు రెక్కలు - అందుకు గల కారణాలేంటి? - Gold Rates in Telangana

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 3, 2024, 7:52 PM IST

Gold Prices High in Telangana
Gold Prices High in Telangana

Gold Prices High in Telangana : ‍‌‍‌ఈ నెలలో మా అక్క కూతురు పెళ్లి ఉంది వదిన 15తులాల బంగారం పెట్టేందుకు ఒప్పుకున్నారు. అవునా వదినా మా అన్న కూతురు వివాహానికి కూడా 10 తులాల పసిడి పెట్టాలని నిర్ణయించారు. నేను కూడా కానుకగా ఎంతో కొంత బంగారం పెట్టాలని అనుకుంటున్నాను. అవును అక్కా మీ కూతురు పెళ్లికి బంగారం కొన్నప్పుడు ఎంత ధర ఉంది. హా అప్పుడు రూ.50 వేలు ఉండేది. కానీ, నిన్నటి ధర ప్రకారం తులం బంగారం రూ.70వేలు దాటిందంటా. ఏంటి అంత ధరనా అంత రేటు ఉంటే అసలు బంగారం కొనగలమా అక్క. అవునవును ఇప్పుడున్న ధరలతో కొనడటం కంటే ఊరుకుంటే నయం. కొన్నా ఏ ఒక్క గ్రామో రెండు గ్రాములతో సరిపెట్టుకోవాలి. ఇదీ ఓ ముగ్గురు మహిళలు బంగారంపై చర్చిస్తున్న తీరు. కానీ, భవిష్యత్‌లో ఇలాంటి చర్చలు బహుషా ఉండవేమో. కారణం పట్టపగ్గాలు లేకుండా పెరుగుతోన్న బంగారం ధరలు. సోమవారం ఆల్‌టైం రికార్డుగా నమోదైన బంగారం ధర రూ.70,300 చేరింది. దీంతో కొనుగోళ్లు కూడా తగ్గాయి. ఇదిలా ఉంటే పెళ్లిళ్ల సీజన్‌లో పెరిగిన బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. మరెందుకిలా? ధరలు పెరుగుదలకు కారణం ఏంటి? రాబోయే కాలంలో ఈ ధరలు ఇంకా పెరుగుతాయా? లేక ధరలు తగ్గే అవకాశం ఉందా?

బంగారం ధరలకు రెక్కలు - అందుకు గల కారణాలేంటి?

Gold Prices High in Telangana : బంగారం! ఏ శుభకార్యానికైనా మొదటగా గుర్తొచ్చే విలువైన వస్తువు. మహిళల అందాలను పెంచేవి కూడా బంగారు ఆభరణాలే. దీనికి తోడు చాలా మంది బంగారంపై పెట్టుబడి పెట్టడానికి సైతం ఇష్టపడతారు. జన జీవనంలో ఇంతటి ప్రాశస్త్యం కలిగిన బంగారం క్రమంగా తన విలువను పెంచుకుంటూ సామాన్యులకు దూరమవుతుంది. పెరుగుతున్న బంగారం ధరలను చూస్తే ఇదే విషయం అవగతమవుతుంది.

అంతర్జాతీయ విఫణి ఆధారంగా పెరిగే బంగారం ధరలు(Telangana Gold Rates) దేశ ప్రజలకు ఓ రకంగా చుక్కలు చూపిస్తున్నాయనే చెప్పుకోవాలి. 2004 ఏప్రిల్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.5,800గా ఉంటే అదిప్పుడు రూ.71, 300కు చేరింది. 20 ఏళ్లలో ఇంతలా పెరిగిన ధరలు సోమవారం ఆల్‌టైం రికార్డు ధరలను నమోదు చేశాయి. గతేడాది ఏప్రిల్‌లో అక్షయ తృతీయ రోజున 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,400 ఉంది. ఏడాది వ్యవధిలో సుమారు రూ.9000 వరకు పెరిగింది.

Gold Rates Details : బంగారం ధర అనూహ్యంగా పెరిగింది. హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం సోమవారం రూ.71,300 చేరింది. 22 క్యారెట్ల ఆర్నమెంట్‌ బంగారం ధర రూ.64 వేలకు పైగా ఉంది. రూ.70,300 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర ఒక్క రోజులోనే వెయ్యి రూపాయలు పెరిగి ఆల్‌ టైం రికార్డు స్థాయి(Gold All Time Record)కి చేరింది. మార్చి 7న రూ.65వేలు పలికిన 24 క్యారెట్ల బంగారం ధర ఏప్రిల్‌ ఒకటి నాటికి రూ.71వేలకు చేరింది.

అంతకుముందు మార్చి 1న 24క్యారెట్ల ధర రూ.62,800 ఉండగా వారం రోజ్లుల్లోనే అది రూ.65వేలకు పెరిగింది. అంటే వారం రోజుల్లోనే రూ.1500లకు పైగా పెరిగింది. అదే మార్చి 9 నాటికి రూ.66,240లకు ఎగబాకింది. ఇలా రోజురోజుకు పెరుగుకుంటూ పోతున్న గోల్డ్‌ రేట్ ఇప్పుడు రూ.71వేలకు చేరింది. ఎప్పుడు లేనంతగా ఇటీవలి కాలంలోనే అనూహ్యంగా పెరిగిన బంగారం ధరలు 45రోజుల్లోనే 15శాతానికి పైగా పెరిగినట్లు బంగారం వర్తకులు అంటున్నారు. ఈ పెరుగుదలతో బంగారం కొనుగోళ్లు కూడా తగ్గినట్లు వారు చెబుతున్నారు.

పెరిగిన డాలర్‌ మారకపు విలువ : అంతర్జాతీయ మార్కెట్ల ఆధారంగానే బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. ప్రధానంగా ఈ ఏడాదిలో వడ్డీరేట్లు తగ్గిస్తామని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ప్రకటించడం, రూపాయితో పోలిస్తే డాలర్‌ మారకపు విలువ బాగా పెరగడంతో ఇటీవల కాలంలో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. వారం వ్యవధిలోనే అంతర్జాతీయంగా ఔన్సు(Ounce) అంటే 31.10 గ్రాములు బంగారం ధర రూ.2,165 డాలర్ల నుంచి రూ.2,255 డాలర్లకు పెరగడం గమనార్హం. మరోవైపు భారత కరెన్సీ రూపాయి మారకం విలువ మరింత పడిపోయి రూ.83లకు వద్ద అమ్ముడవుతోంది.

అమెరికాలో వడ్డీరేట్లు తగ్గితే బంగారంపై పెట్టుబడులు పెడతారు. ఈ ఏడాదిలో వడ్డీరేట్లు తగ్గిస్తామని అమెరికా కేంద్ర బ్యాంక్‌ ప్రకటించినందున, పసిడిపైకి మదుపర్ల దృష్టి మళ్లుతోంది. ధరలు అమాంతం పెరిగిపోవడంతో బంగారం ప్రియులు నిరాశ చెందుతున్నారు. దీంతో కొనుగోళ్లు మందగించాయి. పలువురు తాము కొనుగోలు చేయాలనుకున్న మొత్తంలో 50 నుంచి 60 శాతమే కొంటున్నారు. ధరలు కొంత తగ్గాక, మిగిలిన బంగారం కొంటామని చెబుతున్నారు. సాధారణంగా ఈ సీజన్‌లో జరిగే విక్రయాల్లో 40శాతం వ్యాపారం తగ్గింది. అయితే, ధర ఎక్కడి దాకా పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అన్నది అంచనా వేయడం కష్టంగా ఉందని నిపుణులు చెబుతున్నారు.

1930లో రూ.18లకే తులం బంగారం : భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా ఇళ్లలో జరిగే శుభకార్యాల్లో బంగారం ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది. ఆడ, మగ, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా బంగారు నగలు ధరిస్తారు. కానీ, ప్రస్తుతం బంగారం ధర పైపైకి దూసుకెళుతోంది. బంగారం ధరలు మాట్లాడుతున్నప్పుడల్లా ఒకప్పుడు బంగారపు ధరలను గుర్తు చేసుకుంటున్నారు బంగారం ప్రియులు. ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.62 వేలకు పైగా ఉండగా ఒకప్పుడు తులం బంగారం ధర రూ.18లు మాత్రమే ఉండేది అని మాట్లాడుకుంటున్నారు.

పూర్వం చాలా తక్కువ ధరకే బంగారం లభించేదని గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ధరల పెరుగుదలను ఓ సారి పరిశీలిస్తే 1930లో రూ.18, 1940లో రూ.36, 1950లో రూ.99, 1960లో రూ.111, 1970లో రూ.184, 1980లో రూ.1330 ఉండగా 2010లో రూ.18,500, 2020లో రూ.48,600లకు చేరుకుంది. బంగారమే కాదు వెండి సైతం అమాంతం పెరిగిపోతోంది. ఇది కూడా బంగారం రేట్లు పెరిగిన ప్రతిసారీ పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

పడిపోయిన బంగారం కొనుగోళ్లు : ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న అతిపెద్ద మార్కెట్లలో భారత్ కూడా ఒకటి. సాధారణంగా భారత్‌లో వార్షిక బంగారం డిమాండ్‌ సుమారు 50 శాతం పెళ్లిళ్ల నుంచే వస్తుంది. దీంతో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో బంగారం ధరలు వీటిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పెళ్లిళ్ల పేరుతో తులాల మేర కొనుగోలు చేసే బంగారాన్ని ఇప్పుడు తక్కువ మోతాదులో కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీంతో బంగారం కొనుగోళ్లు పడిపోతున్నాయని వర్తకులు చెబుతున్నారు.

ఉదాహరణకు 10 గ్రాముల కొనుగోలు చేయాలనుకునే వారు 5 గ్రాములతో సరిపెట్టుకుంటున్నారని వ్యాపారులు చెబుతున్నారు. మిగతా బంగారాన్ని ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయాలనే ఆలోచనలో కస్టమర్లు ఉన్నట్లు బంగారం వ్యాపారులు చెబుతున్నారు. దీంతో జ్యూవెల్లరీ డిమాండ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక పెట్టుబడిగా బంగారాన్ని కొనుగోలు చేయాలనుకున్న వారు కొద్ది రోజులు వేచి ఉండటం మంచిదని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ధర కొంతమేర స్థిరీకరించుకున్నాక కొనుగోలు చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

మార్కెట్‌ను అంచనా వేయడం మంచిది : ఇంతలా బంగారం ధరలు పెరిగిపోతుండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. చిన్న మెుత్తంలో బంగారాన్ని కొనుగోలు చేసే వారికైతే ఈ ధరలు చాలా ఆందోళన కలిగించే అంశమని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ ధరలతో అసలు బంగారం కొంటామా లేదా అనే భావన వారిలో మొదలైంది. కొంతమంది పెట్టుబడి దారులు మాత్రం మరింతగా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తూ కొనుగోళ్లకు సిద్ధమవుతున్నారు. ఏదేమైనప్పటికీ భవిష్యత్‌లో బంగారం ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా అనేది ఇప్పట్లో అంచనా వేయలేని పరిస్థితి. కావున మార్కెట్‌ను అంచనా వేస్తూ పోవడం తప్ప చేసేదేమీ లేదు.

బంగారం రేటు మరింత తగ్గుతుందా? ఇప్పుడు కొనడమే బెటరా?

క్రెడిట్ కార్డుతో బంగారం కొనుగోలు చేస్తే లాభమా? నష్టమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.