Power Supply and Demand States in India : రాష్ట్రంలో విద్యుత్ వినియోగం, డిమాండ్ అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఈ సంవత్సరం మార్చిలో 9,009 మిలియన్ యూనిట్ల వినియోగంతో తెలంగాణ దేశంలో 6వ స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర (18,795 మి.యూ.), గుజరాత్ (12,948), తమిళనాడు (11,929), ఉత్తర్‌ప్రదేశ్ (10,507), కర్ణాటక (10,018) వరుసగా తొలి 5 స్థానాల్లో ఉన్నాయి. ఏపీలో 7,358 మి.యూ. విద్యుత్ వినియోగించారు. ఆంధ్రప్రదేశ్తో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, బిహార్, ఒడిశా, పశ్చిమబెంగాల్, పంజాబ్ తదితర రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రం ముందు స్థానంలో ఉందని ఈ మేరకు కేంద్ర విద్యుత్ మండలి (సీఈఏ) తాజా నివేదికలో వెల్లడించింది.
తెలంగాణలో రోజువారీ విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ఎలా అంటే ఇప్పుడు 2023 మే 1న ఒక రోజు మొత్తం వినియోగం 136.89 మి.యూ. ఉంటే 2024లో అదే రోజున (మే 1న) అది 222.58 మిలియన్ యూనిట్ల వినియోగం పెరిగింది. ఈ స్థాయిలో వినియోగం ఉన్నా పలు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో నిరంతర నాణ్యమైన కరెంటు సరఫరా అవుతోంది. ఉదాహరణకు ఉత్తర్‌ప్రదేశ్‌లో గత మార్చిలో 10,538 మి.యూ. అవసరం ఏర్పడగా అంతకన్నా 31 మి.యూ. తక్కువగా సరఫరా చేసినట్లు సీఈఏ తెలిపింది. అలాగే ఝార్ఖండ్‌లో 25 తమిళనాడు ఒక మిలియన్ యూనిట్, దేశమంతా కలిపి చూస్తే 75 మి.యూ. తక్కువగా సరఫరా చేసినట్లు వివరించింది. తెలంగాణలో మాత్రం 9,009 మి.యూ.లు అవసరమైతే వంద శాతం సరఫరా అయినట్లు వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో దేశంలో విద్యుత్ డిమాండ్, వినియోగం, రాష్ట్రాలవారీ గణాంకాలను సీఈఏ నివేదికలో పేర్కొంది.
తెలంగాణలో మార్చి 14న అత్యధికంగా 15,623 మెగావాట్ల డిమాండ్ నమోదైనట్లు విద్యుత్ డిపార్ట్మెంట్ తెలిపింది. దేశం మొత్తంగా మార్చిలో ఒక రోజు నమోదైన అత్యధిక డిమాండ్ 2.21 లక్షల మెగావాట్లకు పైగా నమోదైంది. దేశంలో అన్ని రకాల విద్యుత్ కేంద్రాల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం దాదాపు 4.42 లక్షల మెగావాట్లు ఉన్నందున కొరత లేకుండా నిరంతర సరఫరాకు చేయగలుగుతున్నారు. కానీ ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో అవసరమైనంత కరెంటు సరఫరా చేయలేక అప్పుడప్పుడు కోతలు చేస్తున్నారు. గరిష్ఠ డిమాండ్‌లో మహారాష్ట్ర 28,735 మెగావాట్లు, గుజరాత్ 21,843 మె.వా, ఉత్తర్‌ప్రదేశ్ 21,243, తమిళనాడు 19,054, కర్ణాటక 17,220 తొలి 5 స్థానాల్లో ఉన్నాయి.
తెలంగాణలో మార్చిలో నమోదైన గరిష్ఠ విద్యుత్ డిమాండ్ (15,623)తో పోలిస్తే ఉత్తర్‌ప్రదేశ్ (21,243)లో ఏకంగా 5,620 మెగావాట్లు (36 శాతం) అదనపు డిమాండ్ అవ్వాగా, కానీ మార్చి నెల మొత్తంగా చూస్తే అక్కడి వినియోగం (10,507 మి.యూ.) తెలంగాణ (9,009) కంటే 1,498 మి.యూ. (16.62 శాతం) మాత్రమే ఎక్కువ. 24 గంటలూ నాణ్యమైన కరెంటు సరఫరా రాష్ట్రమంతా సక్రమంగా జరుగుతుంటేనే వినియోగం కూడా బాగా పెరుగుతుంది. దేశంలో పెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్ కన్నా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడుల్లో అధికంగా కరెంటు వినియోగం నమోదైంది.
2023-24లో మొత్తం 17.50 లక్షల బిలియన్ యూనిట్ల (బి.యూ.) కరెంటును దేశంలో ఉత్పత్తి చేయాలని లక్ష్యాన్ని పెట్టుకోగా 17.38 లక్షల బి.యూ. ఉత్పత్తి చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. దేశంలో 2022-23 నాటికి వార్షిక తలసరి వినియోగం 1,331 యూనిట్లు కాగా ఒక యూనిట్ కరెంటు సరఫరాకు సగటు వ్యయం 2021 మార్చి నాటికి రూ.6.19కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం అది రూ.7.14 వరకూ ఉందని వివరించింది.
దంచికొడుతున్న ఎండలు - గిర్రుమంటోన్న కరెంట్ మీటర్ - Power Consumption In Telangana