ETV Bharat / state

దంచికొడుతున్న ఎండలు - గిర్రుమంటోన్న కరెంట్ మీటర్ - Power Consumption In Telangana

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 10, 2024, 1:21 PM IST

Power Usage Increased in Telangana : తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో విద్యుత్ డిమాండ్ ఊహించని రీతిలో పెరిగిపోతోంది. హైదరాబాద్‌లో 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే అధికారులు అప్రత్తమయ్యారు. నిన్నటివరకు ట్రాన్స్‌ఫార్మర్ల పవర్‌ పెంపు పనులు చేపట్టగా ఇప్పుడిక డీటీఆర్‌లను మార్చేందుకు సిబ్బంది సిద్ధమవుతున్నారు.

Power Usage Increased in Telangana
Power Usage Increased in Telangana

Power Usage Increased in Telangana : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. హైదరాబాద్‌లో 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఇండ్లలోని ఏసీలు ఫ్యాన్లు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లకు విశ్రాంతి ఉండటం లేదు. గ్రేటర్‌లో మార్చి, ఏప్రిల్‌లో ఊహించిన దానికంటే ఎక్కువ విద్యుత్ డిమాండ్‌ (Power Demand Increased in Telangana)రావడంతో పలు ఉపకేంద్రాల్లోని 80 శాతం కంటే ఎక్కువ లోడ్‌ ఉన్న పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్ల (పీటీఆర్‌)ను ఎక్కువ సామర్థ్యం కలిగిన వాటితో మార్పిడి చేశారు.

Electricity Consumption Increased in Hyderabad : ఇప్పుడిక కాలనీల్లో ఉండే డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్ల (డీటీఆర్‌)ను మార్చబోతున్నారు. ఇందులో భాగంగా కరెంట్ వినియోగం అధికంగా ఉండే సమయంలో డీటీఆర్‌ల కచ్చితమైన లోడ్‌ను గుర్తించే మదింపు చేపట్టారు. టంగ్‌టెస్టర్‌ ద్వారా లోడ్‌ను గుర్తించి రికార్డు చేసే పనిని విద్యుత్ సిబ్బంది ఎక్కువగా రాత్రిపూట చేస్తున్నారు.

ఎండల నుంచి ఉపశమనానికి ఫ్యాన్లు, ఏసీల వాడకం - భారీగా పెరుగుతోన్న విద్యుత్ వినియోగం

ఒక్కో సర్కిల్‌లో ఒక్కోలా : విద్యుత్ గరిష్ఠ డిమాండ్‌ సాధారణంగా సాయంత్రం ఉంటుంది. ఈ సంవత్సరం పీక్‌ డిమాండ్‌ తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయి. ఒక్కో సర్కిల్‌లో ఒక్కో సమయంలో నమోదవుతున్నట్లు ఇంజినీర్లు గమనించారు.

  • ఐటీ కార్యాలయాలు, ఎత్తైన భవనాలు ఉన్న సైబర్‌సిటీ సర్కిల్‌లో ఈ నెల 5న రికార్డు స్థాయిలో 784.4 మెగావాట్ల డిమాండ్‌ నమోదైంది. గత సంవత్సరం ఏప్రిల్‌ 20న గరిష్ఠంగా నమోదైన 455 మెగావాట్ల కంటే చాలా ఎక్కువ. నార్సింగి, గచ్చిబౌలిలో వెంటనే పీటీఆర్‌ల సామర్థ్యాన్ని పెంచారు. ఈ సర్కిల్‌ పరిధిలో రాత్రి 11 నుంచి 12 మధ్య పీక్‌ లోడ్‌ ఉంటుంది.
  • రాజేంద్రనగర్‌ సర్కిల్‌లోనూ సాయంత్రం 5 గంటల మధ్య అత్యధిక లోడ్‌ రికార్డైందని అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 3న అత్యధికంగా 674 మెగావాట్ల డిమాండ్‌ నమోదైందని పేర్కొన్నారు. గత సంవత్సరం ఏప్రిల్‌ 16న గరిష్ఠ డిమాండ్‌ 649.9 మెగావాట్లుగా ఉందని వివరించారు.
  • సరూర్‌నగర్‌లో ఈ నెల 5న అత్యధికంగా 292.3 మెగావాట్లు నమోదైంది. క్రితం సంవత్సరం 6వ తేదీన 288 మెగావాట్లు రికార్డైంది. ఈ సర్కిల్‌లో సాధారణ వృద్ధినే ఉంది. నివాసకేంద్రాలు అధికంగా ఉండే ఈ సర్కిల్‌లో సాయంత్రం 7 నుంచి 9 గంటల మధ్య పీక్‌ డిమాండ్‌ ఉంటుంది.

ఆర్‌ఆర్‌ జోన్‌లో సామర్థ్యం పెంచిన డీటీఆర్‌లు (కేవీఏ) :

సర్కిల్ 100 నుంచి 160 160 నుంచి 315
సరూర్‌నగర్ 118 4
సైబర్‌సిటీ 106 6
రాజేంద్రనగర్‌ 94 5

ముందుస్తుగా అప్రమత్తం : గ్రేటర్‌ హైదరాబాద్‌లోని 9 సర్కిళ్ల పరిధిలో 1.47 లక్షల డీటీఆర్‌లు ఉన్నాయి. వేసవి కార్యాచరణ ప్రణాళికలో అధికలోడ్‌ ఉన్న కొన్నింటిని మార్చారు. డిమాండ్‌ నేపథ్యంలో ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయిలో లోడ్‌ పెరిగింది. వీటిని గుర్తించి మార్చకపోతే మే నెలలో సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ముందుస్తుగా లోడ్‌ మదింపును చేపట్టారు. ఏసీల వాడకం పెరగడం, నిరంతరాయ విద్యుత్ సరఫరా, అంతరాయం ఏర్పడితే వెంటనే మరమ్మతు చేయడం, వేసవి తాపంతో బోర్ల వాడకం పెరగడం, రంజాన్‌ మాసం ఇలా ఎన్నో అంశాలు మార్చి, ఏప్రిల్‌లో అనూహ్యంగా డిమాండ్‌ పెరగడానికి కారణాలని ఇంజినీర్లు అంటున్నారు. హైదరాబాద్ మొత్తానికి ఉపయోగించే కరెంట్‌ను ఇప్పుడు ఒక్క రంగారెడ్డి జోన్‌ పరిధిలోని సర్కిళ్లలో వినియోగిస్తున్నారు. వేసవి ప్రణాళిక వేసుకున్నా అంతకంటే ఎక్కువ డిమాండ్‌ ఈసారి కనిపించింది.

పనితీరులో అట్టడుగున తెలంగాణ డిస్కంలు​ - జాతీయ విద్యుత్ ఆర్థిక సంస్థ జాబితాలో సీ గ్రేడ్

డిమాండ్‌ ఏ స్థాయిలో పెరిగిందంటే :

  • రంగారెడ్డి జోన్‌ పరిధిలో నాలుగు సర్కిళ్లు ఉన్నాయి. వీటి పరిధిలో ఈ నెల 7న 47.20 మిలియన్‌ యూనిట్ల గరిష్ఠ వినియోగం నమోదైంది. గత సంవత్సరం ఇదే రోజున 32.69 మిలియన్‌ యూనిట్లు మాత్రమే. ఏకంగా వినియోగం 30.75 శాతం పెరిగింది.
  • డిమాండ్‌ పరంగా చూస్తే ఏప్రిల్‌ 5న 1984 మెగావాట్లు గరిష్ఠంగా రికార్డైంది. క్రితం సంవత్సరం 1437 మెగావాట్లు మాత్రమే. ఈస్థాయిలో డిమాండ్‌ పెరగడంతో ఇంజినీర్లు ఒకింత కంగారు పడ్డారు. ఓవర్‌లోడ్‌ సమస్యలు రాకుండా అప్రమత్తంగా ఉన్నారు. రెండు మెగావాట్లకు మించితే తట్టుకోవడం కష్టమే. అందుకే డీటీఆర్‌ల సామర్థ్యాన్ని పెంచే పనిని ప్రాధాన్యతగా తీసుకున్నారు.

మే నెల రికార్డులు మార్చిలోనే నమోదవుతున్నాయి - రాష్ట్రంలో భారీగా పెరిగిన విద్యుత్​ వినియోగం - power Consumption in Telangana

అప్పుడే పీక్​లో సమ్మర్ హీట్ - విద్యుత్ వినియోగంలో హైదరాబాద్​ ఆల్‌టైమ్‌ రికార్డ్ - Power Usage Increased In Hyderabad

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.