ETV Bharat / state

ఆర్థిక సంఘం నిధుల విషయంలో జగన్‌ సర్కార్‌కు కేంద్రం ఝలక్‌

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 5, 2024, 2:28 PM IST

Central Actions on Financial Union Funds Diversion
Central Actions on Financial Union Funds Diversion

Central Actions on Financial Union Funds Diversion : ఏపీలోని జగన్‌ ప్రభుత్వానికి కేంద్రం ఝలక్‌ ఇచ్చింది. ఆర్థిక సంఘం నిధులను సొంత అవసరాలకు ఇష్టానుసారం మళ్లించడానికి వీళ్లేకుండా చెక్‌ పెట్టింది. స్థానిక సంస్థలకు ఇచ్చే ఆర్థిక సంఘం నిధులపై రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ లేకుండా పట్టణ స్థానిక సంస్థల బ్యాంకు ఖాతాలకే నేరుగా జమ చేసేలా చర్యలు తీసుకుంటోంది.

Central Actions on Financial Union Funds Diversion : పట్టణ స్థానిక సంస్థల పీడీ ఖాతాల్లోని ఆర్థిక సంఘం నిధులను ఏపీ ప్రభుత్వం సొంత అవసరాలకు వాడుకోకుండా కేంద్రం చెక్‌ పెట్టింది. పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల పేరిట ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు తెరిపించింది. వాటిలో నిధులు జమ చేసి పబ్లిక్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ పోర్టల్‌కు మ్యాపింగ్‌ చేయిస్తోంది. ఆర్థిక సంఘం మార్గదర్శకాలకు లోబడి చేయించే పనులకు బ్యాంకు ఖాతాల్లోని నిధులను ఇకపై పట్టణ స్థానిక సంస్థలే నేరుగా వినియోగించుకునేలా చేస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీఎఫ్​ఎమ్​ఎస్​(CFMS)కి బిల్లులు అప్‌లోడ్‌ చేయడం, ఎప్పుడు నిధులిస్తే అప్పుడే పట్టణ స్థానిక సంస్థలు తీసుకోవడం వంటి నిరంకుశ విధానానికి చెల్లుచీటీ పాడుతోంది. రాష్ట్రంలోని పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఏటా దాదాపు వెయ్యి కోట్లకు పైగా ఆర్థిక సంఘం నిధులు కేటాయిస్తోంది. వీటిని రాష్ట్ర ప్రభుత్వం తన అవసరాలకు వాడుకుంటోంది.

సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ నియంత్రణలోని పట్టణ స్థానిక సంస్థల పీడీ ఖాతాల్లోనే ఆర్థిక సంఘం నిధులనూ రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తోంది. ఖాతాల్లో నిధులున్నట్లు ఆన్‌లైన్‌లో కనిపిస్తున్నా పూర్తి చేసిన పనులకు ఆర్థిక శాఖ నిధులు వెంటనే విడుదల చేయదు. నిధులు అందుబాటులో ఉన్నప్పుడే స్థానిక సంస్థలకు విదిలిస్తోంది. దీంతో ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులకు సంబంధించి ఎప్పుడూ 150 కోట్ల నుంచి 200 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉంటున్నాయి.

వైఎస్సార్సీపీకి మరో షాక్​ - మంత్రి గుమ్మనూరు జయరాం రాజీనామా

చాలాచోట్ల పనులకు టెండర్లు పిలిచినా గుత్తేదారులు ముందుకు రాకపోవడానికి ఇదే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. పంచాయతీలకు ఇస్తున్న ఆర్థిక సంఘం నిధులను విద్యుత్తు ఛార్జీల బకాయిలకు మళ్లించడంపై కేంద్ర ప్రభుత్వం స్పందించి వాటిలో రాష్ట్ర ప్రభుత్వ జోక్యాన్ని కట్టడి చేసింది. పంచాయతీల పేరిట బ్యాంకు ఖాతాలు తెరిపించి వాటికే నిధులు జమయ్యేలా చర్యలు తీసుకుంది. 2023-24లో విడుదలైన నిధులు ఈ ఖాతాలకే జమయ్యాయి.

ఇప్పుడు పట్టణ స్థానిక సంస్థల్లోనూ అదే విధానం అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల పేర్లతో తెరిపించిన బ్యాంకు ఖాతాలకు రాష్ట్ర ప్రభుత్వం 530 కోట్ల ఆర్థిక సంఘం నిధులను రెండు రోజుల క్రితం జమ చేసింది. ఇవి 2022-23లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులే.

తాజా చర్యలతో ఈ నిధులపై రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ ఉండదు. బ్యాంకు ఖాతాలను పీఎఫ్​ఎమ్​ఎస్​(PFMS) పోర్టల్‌కు మ్యాపింగ్‌ చేయడంతో పనుల నిర్వహణ, నిధుల వ్యయంపై కేంద్ర ప్రభుత్వమే నేరుగా పర్యవేక్షించనుంది. రెండేళ్ల క్రితమే కేంద్రం ఇలాంటి చర్యలు తీసుకుని ఉంటే ఆర్థిక సంఘం నిధులతో పట్టణ స్థానిక సంస్థల్లో అనేక అభివృద్ధి పనులు చేసే అవకాశం ఉండేదన్న వాదన వినిపిస్తోంది.

పీకే వ్యాఖ్యలతో జగన్​ ఉక్కిరిబిక్కిరి! - వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఓటమి భయం

వచ్చే ఎన్నికల్లో జగన్ ఏం చేసినా గెలవడు - ప్రశాంత్‌ కిశోర్‌ సంచలన వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.