ETV Bharat / state

ఉన్నత విద్యను ఉరి తీస్తున్న జగన్​ సర్కార్​

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 26, 2024, 8:31 AM IST

Andhra Pradesh Higher Education Institutions: చదువే ఆస్తి అంటారు. విద్యారంగాన్ని సంస్కరిస్తున్నామంటారు.పేదల పక్షపాతినంటారు. కానీ, పేద విద్యార్థులు చదువుకునే కళాశాలలను గాలికి వదిలేస్తారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థలను మూతబడేలా చేసి వాటి ఆస్తులను కొట్టేస్తారు. చివరికి పేద పిల్లలేమో ప్రైవేటు బాట జగనన్నకేమో డబ్బుల మూట అన్నట్లుంది రాష్ట్రంలో పరిస్థితి. ఏఐఎస్‌హెచ్‌ఈ ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఈచేదు నిజాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలో ఉన్నత విద్యలో స్థూల ప్రవేశాల నిష్పత్తి తగ్గినట్లు ఆ నివేదికలో తేలింది.

andhra_pradesh_higher_education_institutions
andhra_pradesh_higher_education_institutions

ఉన్నత విద్యను ఉరి తీస్తున్న జగన్​ సర్కార్​

Andhra Pradesh Higher Education Institutions: రాష్ట్రంలో ఉన్నత విద్య మిథ్యగా మారింది. పేదలకు చదువే ఆస్తి అని పదేపదే వల్లెవేసే సీఎం జగన్‌ పరోక్షంగా ఆయా వర్గాలకు ఉన్నత విద్యను దూరం చేసి కొరకరాని కొయ్యగా మారుస్తున్నారు. 2021 అక్టోబరు 25న ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలికిన సీఎం, ఆదిశగా ప్రయత్నాలు చేయలేదు. కొత్త వాటిని ఏర్పాటు చేయకపోగా ఉన్న వాటినీ ఎత్తేశారు.

ఎయిడెడ్‌లో ఉన్న వాటినీ మూసేసి వాటినే సంస్కరణలుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికే పోస్టుగ్రాడ్యుయేషన్‌ కోర్సులకు ప్రైవేటులో బోధన రుసుముల చెల్లింపును నిలిపివేసిన జగన్‌ పేద విద్యార్థుల ఉన్నత ఆశయాలపై నీళ్లుచల్లారు. రాష్ట్రంలో ఉన్నత విద్యలో స్థూల ప్రవేశాల నిష్పత్తి తగ్గినట్లు అఖిల భారత ఉన్నత విద్య సర్వే - ఏఐఎస్‌హెచ్‌ఈ ఇటీవల విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.

రాజకీయ క్రీడలో బలవుతున్న... విశ్వవిద్యాలయాలు

2020-21లో జీఈఆర్‌ 37.2శాతం ఉండగా 2021-22కు అది 36.5కు పడిపోయింది. అబ్బాయిల చేరికలు 0.6శాతం, అమ్మాయిల చేరికలు 0.8 శాతం తగ్గాయి. పక్కనున్న తెలంగాణలో జీఈఆర్‌ 40శాతం, తమిళనాడులో 47, కర్ణాటకలో 36.2శాతంగా ఉంది. 2021-22 లెక్కల ప్రకారం రాష్ట్రంలో ప్రతి వంద మంది అబ్బాయిలకు 93మంది అమ్మాయిలే ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. 2020-21లో ఈ నిష్పత్తి 94గా ఉంది.

నియోజకవర్గానికో కళాశాల మాట దేవుడెరుగు కొన్ని కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాల్లోనే ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదు. రాష్ట్రంలో మొత్తం 175 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 168 మాత్రమే ఉన్నాయి. కొన్ని పట్టణాలు, నగరాల్లో రెండు ఉండగా ఇంకొన్ని చోట్ల అసలు లేవు.

సీఎం జగన్‌ ఏలుబడిలో గాడి తప్పిన ఉన్నత విద్య.. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు!

వైఎస్సార్​సీపీ సర్కారు రాకముందు రాష్ట్రంలో మొత్తం 141 ఎయిడెడ్‌ కళాశాలలు ఉండగా ప్రస్తుతం 59 మాత్రమే మిగిలాయి. మరో ఆరు వాటి ఆస్తులతో సహా ప్రభుత్వ పరం అయ్యాయి. మిగతావి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌లో ఉన్న సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగించి, ప్రైవేటుగా మారిపోయాయి. ప్రైవేటులో చదివే వారికి బోధన రుసుములు చెల్లిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా, కళాశాలలు మాత్రం ఏదో ఒక పేరుతో విద్యార్థుల నుంచి సొమ్ము వసూలు చేస్తూనే ఉన్నాయి.

జిల్లా కేంద్రం అనకాపల్లిలో అసలు కళాశాలే లేదు. ఇంటర్మీడియట్‌ పూర్తయ్యాక విద్యార్థులు విశాఖపట్నం వెళ్లడమో లేదంటే ప్రైవేటులో చేరడమో చేస్తున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో డిగ్రీ కళాశాల లేదు. ఇక్కడ వైఎస్సార్​సీపీ ప్రభుత్వం రాకముందు ఎస్‌కేబీఆర్‌ ఎయిడెడ్‌ కళాశాల ఉండేది. జగన్‌ తీసుకున్న నిర్ణయంతో అది కాస్త ప్రైవేటుగా మారిపోయింది. రాజోలు, కొత్తపేటల్లో డిగ్రీ కళాశాలలున్నా అమ్మాయిలను పంపించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు.

BJP 9 Questions to YSRCP: నాలుగేళ్ల వైసీపీ పాలనపై బీజేపీ 9 ప్రశ్నలు.. సమాధానాలు చెప్పాలని డిమాండ్​

ప్రభుత్వం సకాలంలో రీయింబర్స్‌మెంట్‌ చేయకపోవడంతో అప్పులు చేసి మరీ ఫీజులు కట్టాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో గుంటూరు, బాపట్ల, చేబ్రోలు, రేపల్లె, వినుకొండ, మాచర్ల, నరసరావుపేటలో మాత్రమే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వాటిల్లో గుంటూరు, బాపట్లలో కేవలం మహిళా డిగ్రీ కళాశాలలే ఉన్నాయి.

ఆర్థిక భారం పేరుతో ఎయిడెడ్‌ను జగన్‌ సర్కారు చరిత్రలో కలిపేసింది. తక్కువ ఫీజుతో పేదలకు నాణ్యమైన విద్యను అందించే సంస్థలపై కక్షగట్టి మూసివేయించింది. వేల కోట్ల రూపాయలు విద్యకు ఖర్చు చేస్తున్నామని గొప్పలు చెప్పే జగన్‌ ప్రభుత్వం, ఎయిడెడ్‌ సంస్థలన్నింటికీ కలిపి 100కోట్ల రూపాయలు ఇచ్చేందుకు చేతులు రాలేదు. ఆస్తులతో సహా ప్రభుత్వానికి అప్పగించాలని లేదంటే సిబ్బందిని అప్పగించి, ప్రైవేటుగా నిర్వహించుకోవాలని ఎయిడెడ్‌ యాజమాన్యాలకు హుకుం జారీ చేశారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో అధికారులు ఒత్తిడి తీసుకువచ్చి, సిబ్బందిని వెనక్కి రప్పించారు.

No PG Admissions: ఉన్నత విద్యకు ‘ఉరి’.. పడిపోయిన పీజీ ప్రవేశాలు.. మాటలు తప్ప చేతలు చూపించని వైసీపీ సర్కారు

కొన్నింటిని నిర్వహించలేక ఆయా యాజమాన్యాలే ప్రభుత్వానికి అప్పగించాయి. దీనిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనలు చేపట్టడంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం ఎయిడెడ్‌లో కొనసాగాలంటే కొనసాగొచ్చని ఉత్తర్వులు ఇచ్చినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

సీఎం జగన్‌ అడ్డగోలు నిర్ణయంతో వందేళ్ల చరిత్ర ఉన్న నెల్లూరు వీఆర్‌ డిగ్రీ, జూనియర్‌ కళాశాలలు కనుమరుగయ్యాయి. నెల్లూరు జాయింట్‌ కలెక్టర్‌ సకాలంలో దస్త్రానికి అనుమతి తెలపకపోవడంతో న్యాయ విద్య కళాశాల అనుమతులకు ఇబ్బంది ఏర్పడింది. 52 ఏళ్లుగా కొనసాగిన కాకినాడ ఐడియల్‌ ఎయిడెడ్‌ కళాశాల మూతపడింది. డిగ్రీ కాలేజ్​లు 141 ఉంటే ఇప్పుడు మిగిలినవి 59 మాత్రమే ఉన్నాయి. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన పేద పిల్లలు ఉన్నత విద్యకు ప్రైవేటునే ఆశ్రయించాల్సి వస్తోంది.

Lokesh Padayatra: వైసీపీ ప్రభుత్వంలో పేదవాడికి ఉన్నత విద్య అందని ద్రాక్ష: లోకేశ్

నాలుగున్నరేళ్లలో 75 వేలమంది పిల్లలు ఎయిడెడ్‌ నుంచి ప్రైవేటుకు వెళ్లిపోయారు. ప్రభుత్వ ఒత్తిడితో చాలా ఎయిడెడ్‌ కళాశాలలు తమ సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగించాయి. అలా 850 మంది సర్కారు సర్వీసులోకి వెళ్లిపోయారు. విద్యార్థుల ఆందోళనలతో మళ్లీ ఎయిడెడ్‌లోకి వెళ్లేందుకు అవకాశం ఇవ్వడంతో కొందరు తిరిగి వెళ్లారు. వీఆర్‌లకు చెందిన 18మంది ఎయిడెడ్‌ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసి, వాటిని ప్రభుత్వం మూసివేయించింది.

గుంటూరులోని హిందూ కళాశాలలో 21మంది ఉండగా 18మంది వెనక్కి వచ్చారు. ఏసీ కాలేజ్​కు సంబంధించి 8మంది ప్రభుత్వంలో ఉండగా వారు వెనక్కి వచ్చిన కూడా యాజమాన్యం అందులో ముగ్గుర్ని చేర్చుకోలేదు. కొన్నిచోట్ల ప్రైవేటు వారితో తరగతులు నిర్వహిస్తున్నారు.

Jawahar Fires on Jagan డీఎస్సీలు వేయరు.. ఉన్న వారిని సర్దుబాటు చేస్తూ.. ఉన్నత విద్య లక్ష్యాలు ఎలా సాధ్యం!

ఎయిడెడ్‌ విద్యా సంస్థలకు వందలాది ఎకరాల భూములున్నాయి. వాటి విలువ కొన్ని కోట్లలో ఉంటుంది. ఎలాగైనా వాటిని దక్కించుకోవాలనే దుర్భుద్ధితోనే సర్కారు ఎయిడెడ్‌కు చరమగీతం పాడే ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. నెల్లూరులోని వీఆర్‌ డిగ్రీ కళశాల, జూనియర్‌ కళాశాలకు సిటీలో సుమారు 15 ఎకరాల స్థలం ఉంది. అందులోని భవనాలతో కలిపి దాని విలువ 900కోట్లు. గతంలో ఎయిడెడ్‌లో కొనసాగిన మచిలీపట్నంలోని హిందూ కళాశాల సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగించి ప్రైవేటుగా మారిపోయింది. నిర్వహణ కష్టంగా మారడంతో కొంత భూమి అమ్మాలని యాజమాన్యం ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల్లోనూ కొత్త కోర్సులు పెట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. చాలా కళాశాలల్లో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా సబ్జెక్టులను పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వం సింగిల్‌ మేజర్‌ సబ్జెక్టు విధానం తీసుకొచ్చింది. కొత్త కోర్సులను ఈ విధానంలో ప్రారంభించడానికి అనుమతి ఇవ్వడం లేదు.

ఎయిడెడ్‌లో ఏ కోర్సులు ఉంటే వాటినే కొనసాగించాలని ఏదైనా కొత్తది పెట్టాలనుకుంటే మాత్రం అన్‌ఎయిడెడ్‌లో నిర్వహించుకోవాలని సర్కారు సూచిస్తోంది.విద్యార్థుల ప్రవేశాల కోసం కొన్ని కళాశాలలు అదే బాట పట్టాయి. వీటిల్లో చేరే వారిపై ఏదో విధంగా ఫీజుల భారం పడుతోంది.
Education Migrants: ఉన్నత విద్యను గాలికొదిలేసిన ప్రభుత్వం.. పైచదువుల కోసం పొరుగురాష్ట్రాల బాటలో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.