ETV Bharat / state

BJP 9 Questions to YSRCP: నాలుగేళ్ల వైసీపీ పాలనపై బీజేపీ 9 ప్రశ్నలు.. సమాధానాలు చెప్పాలని డిమాండ్​

author img

By

Published : Jul 31, 2023, 5:45 PM IST

BJP 9 questions to ysrcp on the four year governance: నాలుగేళ్ల వైసీపీ పాలనపై బీజేపీ రాష్ట్ర శాఖ తొమ్మిది ప్రశ్నలు సంధించి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేసింది. రాష్ట్ర మంత్రులు, వైసీపీ నేతలు దిగుజారుడు వ్యాఖ్యలు మానుకుని బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరింది. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధనరెడ్డి అన్నారు. తమ ప్రశ్నలపై తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి 24 గంటల్లో శ్వేత్రపత్రం విడుదల చేస్తామని చెప్పి 48 గంటలైనా ఇంకా ఆ పని చేయలేకపోయారని ఎద్దేవా చేశారు.

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధనరెడ్డి
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధనరెడ్డి

BJP 9 Questions to YSRCP: విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వానికి తొమ్మిది ప్రశ్నలకు సంధించారు. బాలల అక్రమ రవాణాలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో ఉందని.. ఈ వైఫల్యానికి సమాధానం ఏంటి? అని ప్రశ్నించారు. తలసరి ఆదాయంలో దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌ ఎందుకు వెనుకబడిందని? వ్యవసాయం, ఆక్వా, ఉద్యానరంగం ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రంలో తలసరి ఆదాయం ఎందుకు పెరగలేదని నిలదీశారు. జలజీవన్‌ మిషన్‌ పథకాన్ని రాష్ట్రంలో ఎందుకు వినియోగించుకోలేదని? ఈ పథకానికి అయ్యే ఖర్చులో కేంద్రం ఇచ్చే ఆర్థిక సాయాన్ని ఎందుకు ఉపయోగించుకోలేదు? ఎందుకు ప్రజలకు మంచినీటిని అందించలేకపోయారని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం పేదల కోసం కేటాయించిన 25 లక్షల ఇళ్లను ఎందుకు నిర్మించి ఇవ్వలేకపోయారని.. ఇళ్ల స్థలాల్లో వచ్చే కమీషన్‌ కోసం 30 లక్షల ఇళ్ల స్థలాలను సేకరించారని... ఇళ్లు నిర్మిస్తే కమీషన్‌ రాదనే ఆ పని చేయలేదా? అనే సందేహాన్ని వెలిబుచ్చారు. రాష్ట్రంలో పేదలకు అందించే వైద్య సదుపాయాల విషయంలో ఎందుకు విఫలమయ్యారని..? పట్టణ, గ్రామీణ వైద్య, ఆరోగ్యకేంద్రాలు, జిల్లా ఆసుపత్రులు, జనరల్‌ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు, వైద్య పరీక్షలు, మందులు సరిగా అందుబాటులో లేవని.. వైద్యులు, వైద్య సిబ్బంది ఖాళీలు ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. ప్యానల్‌లో ఉన్న 80 శాతం కార్పొరేట్‌ ఆసుపత్రులు ఎందుకు ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేయడం లేదని.. వారికి బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని నిలదీశారు.

విశాఖలో భూకబ్జాల సంగతేంటి..? ఉన్నత విద్యను నిర్ల్యక్షం చేస్తున్నారని.. పీజీ విద్యార్థులకు ఉపకార వేతనాలు దూరం చేశారని.. డిగ్రీలో తెలుగును రద్దు చేసి.. ఆంగ్ల భాషకే ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వోద్యోగాలను ఎందుకు భర్తీ చేయడం లేదని..? వర్సిటీల్లో ఉపన్యాసకులు, కళాశాలల్లో అధ్యాపకులు, పాఠశాలల్లో టీచర్ల ఖాళీలతోపాటు 2.50 లక్షల బ్యాక్‌లాగ్‌ పోస్టులను ఎందుకు భర్తీ చేయలేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఛిద్రమైన రహదారులను ఎందుకు పునర్నిర్మించలేదని.. వైసీపీ మంత్రులు కారుయాత్ర చేస్తే రోడ్ల పరిస్థితి తెలుస్తుందన్నారు. తిరుపతిలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు చేసిన ద్రోహంపై, గుంటూరులో అమరావతి రైతులకు చేసిన అన్యాయంపై, పంచాయతీ నిధుల మళ్లింపుపై, రైతులకు రాయితీలు ఇవ్వకపోవడంపై, రాజమండ్రిలో అక్వా ఉత్పత్తుతులకు సహకారం ఇవ్వకపోవడం, విశాఖలో భూకబ్జాలు, దిగజారిన శాంతిభద్రతలు, పారిశ్రామిక అభివృద్ధి గురించి తమ పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రస్తావిస్తూ పలు ప్రశ్నలు సంధించారని.. అమెను విమర్శించే ముందు మంత్రులు ఆయా శాఖలకు ఏం పనులు చేశారో, ఎంత వరకు అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

విజయసాయిరెడ్డి విశాఖ అభివృద్ధికి ఏం చేశారు? రోజా పర్యాటక శాఖ అభివృద్ధికి ఏం చేశారు? గుడివాడ అమర్నాథ్ ఎన్ని కొత్త పరిశ్రమలు తెచ్చారు? ఎంత మందికి ఉపాధి కల్పించారని ప్రశ్నించారు. కోళ్ల గురించి ఎక్కువ అవగాహన ఉన్న అమర్నాథ్ కోళ్ల పరిశ్రమ పెట్టుకోవాలని సూచించారు. బొత్స సత్యనారాయణ ఎంత మంది పీజీ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చారు? 4 ఏళ్లలో డీఎస్సీ ద్వారా ఎందుకు భర్తీ చేయలేదో బదులివ్వాలన్నారు. గృహనిర్మాణంలో 1000 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగంపై ఏం సమాధానం చెబుతారు? విడదల రజని వైద్యఆరోగ్య వ్యవస్థను ఎంతగా బలోపేతం చేశారో చెప్పాలని కోరారు. ఎయిమ్స్‌కు కనీసం నీటిని అందించలేకపోయారని.. ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా ఏటా ఇచ్చే రూ.400 కోట్ల నిధులతో ఒక్కో మనిషికి రూ.5 లక్షల విలువైన వైద్య సదుపాయం లభిస్తుంటే ఎందుకు దాని గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.

కేంద్ర నిధులు తప్ప అభివృద్ధి ఏదీ.. వైద్య కేంద్రాలు, పంచాయతీ భవనాలు, స్కూలు భవనాలు, ఆర్‌బీహెచ్‌లు, రహదారులు, పర్యాటక కేంద్రాలకు కేంద్రం ఇచ్చే నిధులతో తప్ప రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదన్నారు. తమ సమాధానం చెప్పేందుకు ఎక్కడి వస్తారో ఎప్పుడు వస్తారో చెప్పాలని.. సమాధానం చెప్పకుంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. మంత్రులు, వైసీపీ నేతల భాషను ప్రజలు ఛీ కొడుతున్నారని.. 2024 లో బీజేపీ రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.