ETV Bharat / state

BJP Purandeshwari: దొంగ ఓట్లతో గెలవాలనుకోవడం దుర్మార్గం.. ఆగస్టు 10న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన: పురందేశ్వరి

author img

By

Published : Jul 25, 2023, 3:24 PM IST

Updated : Jul 25, 2023, 5:45 PM IST

BJP state president Purandeshwari: దొంగ ఓట్లతో ఎన్నికల్లో గెలవాలని చూడటం దుర్మార్గం.. రాష్ట్రంలో దొంగ ఓట్లపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం.. దొంగ ఓట్ల అంశంపై వచ్చే నెల10న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. గుంటూరులోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పురందేశ్వరి.. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి కేంద్రం కట్టుబడి ఉందని, పొత్తుల విషయం అగ్రనాయకత్వం నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి

BJP state president Purandeshwari: దొంగ ఓట్లతో ఎన్నికల్లో గెలవాలని చూడటం దుర్మార్గం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. రాష్ట్రంలో దొంగ ఓట్లపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని ఆమె తెలిపారు. దొంగ ఓట్ల అంశంపై వచ్చే నెల10న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని పురందేశ్వరి వెల్లడించారు. సర్పంచ్‌ల సమస్యలపైనా ఆందోళన చేయనున్నట్లు ఆమె తెలిపారు. గుంటూరులోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పురందేశ్వరి.. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి కేంద్రం కట్టుబడి ఉందని, పొత్తుల విషయం అగ్రనాయకత్వం నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో దాడులు పెరిగిపోయాయి... రాష్ట్రంలో దౌర్జన్యాలు, దాడులు పెరిగాయని, ఎస్సీ మహిళపై అత్యాచారం జరిగితే న్యాయం జరిగే పరిస్థితి లేదని పురందేశ్వరి మండిపడ్డారు. విద్యార్థిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి హత్య చేసినా పట్టించుకున్న నాథుడే లేడని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎస్సీ, బీసీలపై దాడులు నిత్యకృత్యమయ్యాయని తెలిపారు. అధికార పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా ఇసుక మైనింగ్ చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ పాలనలో రాష్ట్రానికి కొత్తగా ఒక పరిశ్రమైనా వచ్చిందా? అని ప్రశ్నించిన పురందేశ్వరి.. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య వర్సిటీ పేరు మార్పుతో ఏం సాధించారని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైద్యసీట్ల అమ్మకానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. ఆర్ 5 జోన్‌లో పేదలు, రైతులు.. ఇద్దరికీ న్యాయం జరగాలని అన్నారు.

మత్స్యకారులకు సాయమేదీ.. సుదీర్ఘ తీరరేఖను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవట్లేదన్న పురందేశ్వరి.. తీర ప్రాంతాల్లో నివసించే మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. మత్స్యకారులకు ప్రభుత్వం సహకారం అందించడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో పర్యాటక రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయని.. సుదూర తీరప్రాంతం అయినందున ఓషియన్‌ టెక్నాలజీ స్థాపించామని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాలు అవసరమని గుర్తు చేస్తూ.. విజయవాడ నుంచి మచిలీపట్నం మధ్య రూ.1470 కోట్లతో వంతెన పూర్తవుతోందని వెల్లడించారు. అమరావతిని రాజధానిగా గుర్తించి గుంటూరు, తెనాలికి గ్రీన్‌ ఎలైన్‌మెంట్‌ మంజూరైందని, గిద్దలూరు నుంచి వినుకొండ వరకు రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. నెల్లూరు నుంచి కృష్ణపట్నం వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణం సహా, అమరావతిలో టూరిజానికి రూ.70 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

ఏపీకి సంపూర్ణ సహకారం... ఏపీకి కేంద్రం ఏమీ చేయలేదని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్న పురందేశ్వరి.. కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందిస్తోందని.. ఏపీకి అత్యధిక ఇళ్లు కేంద్రం కేటాయించిందని తెలిపారు. ఒక్కో ఇంటికి రూ.లక్షా 80 వేలు కేంద్రం ఇస్తోందని, రాష్ట్రంలో ఇళ్లపై వైసీపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలు మంజూరు చేసి ప్రారంభించామని చెప్పారు. ఎన్నో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఏపీలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలకు సగం నిధులు కేంద్రం ఇస్తోందని పురందేశ్వరి తెలిపారు. గురజాల వైద్య కళాశాల పనులు చివరి దశకు చేరాయని, విజయవాడ బైపాస్ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో జాతీయ రహదారులు, అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. రైల్వే అనుసంధానంతో పాటు కొత్త లైన్ల నిర్మాణం, డబ్లింగ్, విద్యుదీకరణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. అమరావతిని స్మార్ట్ సిటీగా ప్రకటించి రూ.2 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించామని పురందేశ్వరి వెల్లడించారు.

Last Updated : Jul 25, 2023, 5:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.