ETV Bharat / sports

టీమ్​ఇండియాను ఊరిస్తోంది అదొక్కటే - ఈ సారైనా చేజిక్కేనా?

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 10, 2024, 6:23 PM IST

టీమ్​ఇండియాను ఊరిస్తోంది అదొక్కటే - ఈ సారైనా చేజిక్కేనా?
టీమ్​ఇండియాను ఊరిస్తోంది అదొక్కటే - ఈ సారైనా చేజిక్కేనా?

WTC 2023 - 25 Points Table TeamIndia : తాజాగా ఇంగ్లాండ్ సిరీస్​ విజయంతో మరోసారి డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్​లో అగ్రస్థానాన్ని మరింత పటిష్ఠంగా మార్చుకున్న భారత జట్టు వరుసగా మూడోసారి ఫైనల్‌ చేరే దిశగా సాగుతోంది. ఈ డబ్ల్యూటీసీలో ఫైనల్​ చేరేందుకు మిగతా జట్లతో పోలిస్తే అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. ఈ సారి మనోళ్ల దూకుడు చూస్తుంటే డబ్ల్యూటీసీ టైటిల్‌ చేజిక్కించుకునేలా కనిపిస్తున్నారు. ఆ వివరాలు.

WTC 2023 - 25 Points Table TeamIndia : సుదీర్ఘ ఫార్మాట్​లో టీమ్ ​ఇండియా ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇంటా బయట టెస్టుల్లో ప్రత్యర్థి జట్లపై మంచిగా రాణిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతమైన ప్రదర్శనతో పెత్తనం చెలాయిస్తోంది. తాజాగా బజ్‌బాల్‌తో భయపెడుతున్న బలమైన ఇంగ్లాండ్‌ టీమ్​ను కూడా ఓడించేసింది. సొంతగడ్డపై జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌ను 4-1 తేడాతో చిత్తుచేసింది. అలా ద్వైపాక్షిక సిరీసుల్లో తన స్టామినో ఏంటో చూపిస్తున్న టీమ్‌ఇండియాను ఒక్కటి మాత్రం ఊరిస్తోంది. అదే ప్రతిష్టాత్మక వరల్డ్​ టెస్టు ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌. అయితే ఇప్పుడు తాజా సిరీస్​ విజయంతో మరోసారి డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్​లో అగ్రస్థానాన్ని మరింత పటిష్ఠంగా మార్చుకున్న భారత జట్టు వరుసగా మూడోసారి ఫైనల్‌ చేరే దిశగా సాగుతోంది. ఈ డబ్ల్యూటీసీలో ఫైనల్​ చేరేందుకు మిగతా జట్లతో పోలిస్తే అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది.

అగ్రస్థానంలో భారత్ : డబ్ల్యూటీసీ 2023- 25 సైకిల్​లో ద్వైపాక్షిక సిరీస్‌లు అన్నీ ముగిసే సమయానికి పాయింట్స్​ టేబుల్​లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన టీమ్స్​ ఈ టైటిల్​ కోసం పోటీపడతాయి. అయితే ప్రస్తుతానికి ఈ డబ్ల్యూటీసీ చక్కంలో టీమ్​ ఇండియా 9 మ్యాచులు ఆడి 6 విజయాలు సాధించింది. ఓ డ్రా కూడా నమోదు చేసింది. రెండు మ్యాచుల్లో ఓడింది. దీంతో మొత్తం 68.51 పాయింట్ల శాతం ఉంది. రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌ 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, రెండు ఓటములను అందుకుంది. అలా 60 పాయింట్ల శాతంతో నిలిచింది. మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా 11 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, మూడు ఓటములు, ఓ డ్రా నమోదు చేసి 59.09 పాయింట్ల శాతాన్ని అందుకుంది. న్యూజిలాండ్​, ఆస్ట్రేలియాతో పోలిస్తే పాయింట్ల పరంగా భారత్​ మెరుగ్గా ఉంది.

ఆ టఫ్ ఛాలెంజ్​ను దాటితే : ఇకపోతే ఈ చక్రంలో టీమ్ ఇండియా ఇప్పటికే వెస్టిండీస్​పై 2 టెస్టులు, దక్షిణాఫ్రికాపై 2 మ్యాచులతో కూడిన సిరీస్​ , ఇంగ్లాండ్​పై 5 మ్యాచులతో కూడిన సిరీస్‌లు ఆడింది. ఇంకా బంగ్లాదేశ్​తో 2 మ్యాచులు కూడిన సిరీస్​ , న్యూజిలాండ్​తో 3 మ్యాచులు కూడిన సిరీస్​, ఆస్ట్రేలియాతో 5 మ్యాచులు కూడిన సిరీస్‌లు ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో సిరీస్‌లను టీమ్​ ఇండియా సొంతగడ్డపైనే ఆడనుంది. ఇది పెద్దగా ఇబ్బంది కాదనే చెప్పాలి. అవసరమైతే క్లీన్‌స్వీప్‌ కూడా చేయగలదు. కానీ ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా టూర్​లోనే టీమ్​ ఇండియాకు టఫ్​ ఛాలెంజ్​ ఎదురయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వరుసగా రెండు సార్లు ఆస్ట్రేలియాలో భారత్‌ టెస్టు సిరీస్‌లు గెలిచింది. దీంతో ఈ సారి ఎలాగైనా టీమ్​ ఇండియాను ఓడించాలని ఆ జట్టు గట్టి పటుదలతో ఉంది. అలానే కమిన్స్‌ కెప్టెన్సీలో బలంగా కూడా తయారైంది. కాబట్టి భారత్​ ఆస్ట్రేలియా పరీక్షను దాటితే కచ్చితంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరే అవకాశం ఉంటుంది.

కాగా, ఈ డబ్ల్యూటీసీ సైకిల్‌లో ఒక్కో విజయానికి 12 పాయింట్లు, డ్రాకు 4 పాయింట్లు, టై అయితే 6 పాయింట్లు వస్తాయి. మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్‌ అయితే పాయింట్లలో కోత కూడా విధిస్తారు. సౌతాఫ్రికా సిరీస్‌లో ఓ మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్‌ కారణంగా టీమ్​ ఇండియాకు 2 పాయింట్లు కోత కూడా పడింది.

కుర్ర ప్లేయర్స్ జోరుగా : ప్రస్తుతం టీమ్​ ఇండియా బలంగానే కనిపిస్తోంది. ఇంగ్లాండ్‌తో రీసెంట్​గా ముగిసిన సిరీస్​లో కోహ్లీ, కేఎల్‌ రాహుల్, షమి, శ్రేయస్‌ అయ్యర్‌ లాంటి కీ ప్లేయర్స్ మిస్​ అయినా యంగ్ ప్లేయర్స్​ అద్భుతంగా రాణించారు. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ 16 ఇన్నింగ్స్‌ల్లో 68.53 యావరేజ్​తో 1,028 పరుగులతో ఈ డబ్ల్యూటీసీ చక్రంలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్​గా కొనసాగుతున్నాడు.

బౌలింగ్‌లో అశ్విన్‌ 15 ఇన్నింగ్స్‌ల్లో 42 వికెట్లు తీసి టీమ్ ఇండియా తరపున టాప్‌ బౌలర్‌గా నిలిచాడు. బుమ్రా 6 మ్యాచ్‌ల్లోనే 31 వికెట్లు తీశాడు.

ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో రోహిత్, శుభ్‌మన్‌ గిల్​ కూడా రెండేసి శతకాలు చేసి జోరు మీదున్నారు వీళ్లంతా ఇదే జోరు కొనసాగిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్​కు టీమ్​ ఇండియా కచ్చితంగా అర్హత సాధిస్తుంది. 2025 జూన్‌లో లార్డ్స్‌ వేదికగా ఇది జరగనుంది. కాగా, 2021, 2023 డబ్ల్యూటీసీ ఫైనల్​లో భారత్‌ వరుసగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై ఓడిపోయింది.

మూడు ఫార్మాట్లలో టీమ్ఇండియానే నెం.1- ర్యాంకింగ్స్​లో భారత్ డామినేషన్​

'అది నేను డిసైడ్ చెయ్యను'- అయ్యర్, ఇషాన్ ఫ్యూచర్​ కెరీర్​పై ద్రవిడ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.