ETV Bharat / sports

ఆంధ్రా క్రికెట్ జట్టుకు హనుమ విహారి గుడ్ బై - ఆ రాజకీయ నేత కుమారుడే కారణం!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 26, 2024, 4:30 PM IST

Updated : Feb 26, 2024, 5:59 PM IST

Hanuma Vihari Left Andhra Team: టీమ్ఇండియా యంగ్ ప్లేయర్ హనుమ విహారి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రంజీలో ఇకపై ఆంధ్రా టీమ్​కు ఆడేది లేదని స్పష్టం చేశాడు.

Hanuma Vihari Left Andhra Team
Hanuma Vihari Left Andhra Team

Hanuma Vihari Left Andhra Team: టీమ్ఇండియా యంగ్ ప్లేయర్ హనుమ విహారి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రంజీ ట్రోఫీలో ఇకపై ఆంధ్రా జట్టుకు ప్రాతినిధ్యం వహించేది లేదని తేల్చి చేప్పాడు. 2024 రంజీ ట్రోఫీలో క్వార్టర్ ఫైనల్స్​లో ఆంధ్రా జట్టు ఓడిన తర్వాత విహారి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించాడు.

'2024 రంజీలో బంగాల్​తో మ్యాచ్​లో ఆంధ్రా జట్టుకు నేను కెప్టెన్​గా వ్యవహరించాను. ఆటలో భాగంగానే నేను ఆ మ్యాచ్​లో ఓ ప్లేయర్ (17వ ఆటగాడు)​పై అరిచాను. అతడు తన తండ్రికి నాపై ఫిర్యాదు చేశాడు. ఆయన ఓ రాజకీయ నాయకుడు. నాపై చర్యలు తీసుకోవాలని ఆయన అసోసియేషన్​ను కోరాడు. ఆ మ్యాచ్​లో 410 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి జట్టను గెలిపించినప్పటికీ, కెప్టెన్సీ నుంచి వైదొలగాలని అసోసియేషన్ నన్ను కోరింది. ఆట పరంగా నా తప్పు లేకున్నా కెప్టెన్సీకి రాజీనామా చేయమనడం బాధేసింది. జట్టుపై ఉన్న గౌరవంతోనే నేను ఇప్పటివరకు టోర్నీలో ఆడాను. నాకు టీమ్​ అంటే ఎంతో ప్రేమ. ప్రతి సీజన్​లో మేము మెరుగుపడుతూ ఎదుగుతున్నాం. కానీ, అసోసియేషన్​కు మేం ఎదగడం ఇష్టం లేనట్లుంది' అని విహారి సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.

'నేను ఆ ప్లేయర్​ను వ్యక్తిగతంగా ఏమీ అనలేదు. అయితే గత ఏడేళ్లలో ఐదుసార్లు జట్టును నాకౌట్​ చేర్చి, టీమ్ఇండియాకు 16 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించిన వాళ్ల (విహారి)కంటే అసోసియేషన్​కు ఆ ప్లేయర్ (రాజకీయ నాయకుడి కుమారుడు)​ ఎక్కువైపోయాడు. అసోసియేషన్ చెప్పినట్లు ప్లేయర్ నడుచుకోవాలని, వారివల్లే మేం ఇక్కడ ఉన్నామని భావిస్తున్నారు' అని విహారి పేర్కొన్నాడు.

ఇక గతేడాది రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్​లో తను గాయపడినప్పటికీ ఎడమ చేతితో బ్యాటింగ్ చేసిన సందర్భాన్ని విహారి గుర్తు చేసుకున్నాడు. జట్టు కోసం ఎంతో చేసినప్పటికీ అసోసియేషన్ ఇలా వ్యవహరించడం నచ్చలేదని విహారి అన్నాడు. ఆత్మ గౌరవాన్ని చంపుకొని జట్టులో కొనసాగలేనని విహారి చెప్పాడు. అయితే తొలుత వ్యక్తిగత కారణాల వల్ల కెప్టెన్సీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని చెప్పిన విహారి, తాజాగా అసోసియేషన్​ కోరడం వల్లే సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నానని ఆరోపించడంతో ఈ విషయం క్రీడావర్గాల్లో చర్చనీయాంశమైంది.

విహారి కెప్టెన్​గా కొనసాగాలి: అయితే ఈ వివాదంపై ఆంధ్రా క్రికెట్ టీమ్ సభ్యులు అసోసియేషన్​కు ఓ లేఖ రాశారు. 'బంగాల్​తో మ్యాచ్​లో హనుమ విహారి తప్పేం లేదు. ఆటలో అవన్నీ కామన్. కానీ, సదరు ప్లేయర్ దీన్ని పర్సనల్​గా తీసుకున్నాడు. దీనికి టీమ్​మేట్స్​, సపోర్టింగ్ స్టాఫ్ అంతా సాక్ష్యం. విహారియే జట్టు కెప్టెన్​గా కొనసాగాలని మేం కోరుతున్నాం. మాకు అతడితో ఎలాంటి సమస్య లేదు. విహారి కెప్టెన్సీలో జట్టు అద్భుతంగా రాణించింది. అతడి నాయకత్వంలో జట్టు ఏడుసార్లు నాకౌట్​కు అర్హత సాధించింది. ఈ రంజీలో కూడా అతడి కెప్టెన్సీలో తొలి మ్యాచ్ గెలిచాం. విహారియే రంజీలో ఆంధ్రాకు సారథ్యం వహించాలని టీమ్ సభ్యులు కోరుకుంటున్నారు' అని టీమ్​మేట్స్ లెటర్​లో పేర్కొన్నారు.

అది నేనే!: అయితే విహారి మందలించిన వ్యక్తిని తానేనంటూ పృథ్విరాజ్‌ (రాజకీయ నాయకుడి కుమారుడు) ఇన్‌స్టాలో పోస్టు పెట్టాడు. 'మీరు కామెంట్ బాక్స్​లో వెతుకున్న వ్యక్తిని నేనే. మీరు విన్నదంతా అబద్ధం. బంగాల్‌తో మ్యాచ్​లో ఏం జరిగిందో జట్టు సభ్యులందరికీ తెలుసు. వ్యక్తిగత విమర్శలు, బూతులు తిట్టడం సరైంది కాదు. 'నువ్వు ఇంతకుమించి ఏమీ పీకలేవు సో కాల్డ్‌ ఛాంపియన్‌'' అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. చివరగా 'సానుభూతి కోసం ఈ ఆటలు ఆడుతున్నావు' అంటూ పృథ్విరాజ్‌ తీవ్రంగా స్పందించాడు.

టీమ్​ఇండియా మిడిల్​ ఆర్డర్​లో కొత్త శకం

'మూడో టెస్టుకు కోహ్లీ.. వారిద్దరూ వేచి చూడాల్సిందే'

Last Updated : Feb 26, 2024, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.