Sunita Fire on AP CM Jagan : మీరు ముఖ్యమంత్రి కావడానికి ఎంతో త్యాగం చేసిన వివేకానందరెడ్డి చనిపోయినా ఎందుకు అంత ద్వేషంతో ఆయనపై మాట్లాడుతున్నారని ఏపీ సీఎం జగన్‌ను సునీత ప్రశ్నించారు. ఈరోజు పులివెందుల బహిరంగ సభలో జగన్ మాట్లాడిన మాటలు చూస్తుంటే వివేకానంద రెడ్డి పైన తీవ్రస్థాయిలో ఈర్ష్య ఉన్నట్లు కనిపించాయని పేర్కొన్నారు. పులివెందులలో మీడియాతో మాట్లాడిన సునీత ఐదేళ్లుగా ఒక్క మంచి మాట కూడా మాట్లాడని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అతనిపైన ద్వేషం ఎందుకు కక్కుతున్నారని ప్రశ్నించారు.
వివేకాని చంపించిన నిందితులకు టికెట్ ఇవ్వకూడదని డిమాండ్ చేస్తుంటే వారిని పక్కన పెట్టుకొని మాట్లాడడం సబబేనా అని సునీత ప్రశ్నించారు. సీబీఐ చెప్పిన అంశాలను తాము మాట్లాడుతుంటే పదేపదే ఆయన వ్యక్తిత్వాన్ని అవమానించే విధంగా జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలోనే మాట్లాడడం మంచిదేనా అని ప్రశ్నించారు. వివేకానంద రెడ్డి లాంటి మంచి మనిషి గురించి కుటుంబ సభ్యుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అంత ఘోరంగా అంత అసూయతో మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని ఆమె ప్రశ్నించారు.
ఆయన ఏం పాపం చేశారని : ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని, వివేకానంద రెడ్డి ఏం పాపం చేశారని ఆయన గురించి అంత హీనంగా మాట్లాడుతున్నారని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్‌కు న్యాయవ్యవస్థ అన్నా, సీబీఐ అన్నా నమ్మకం లేదని వైఎస్ వివేకా కూతురు సునీత అన్నారు. తన తండ్రి హత్యపై మాట్లాడవద్దంటూ కోర్టు ఆర్డర్ తెచ్చిన వాళ్లే మాట్లాడుతున్నారని జగన్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్‌కు ఏ వ్యవస్థపై నమ్మకం ఉందో చెప్పాలని అంటూ తప్పు చేసుంటే తనకైనా, తన భర్తకైనా శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు.
పులివెందులలో మీడియాతో మాట్లాడిన సునీత పులివెందులలో ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై స్పందించారు. జగన్ చేసిన వ్యాఖ్యల్లో వివేకాపై ద్వేషం కనిపిస్తోందని, ఏం పాపం చేశారని వివేకాపై మీకు ఇంత ద్వేషం అని ప్రశ్నించారు. మీ కోసం త్యాగం చేశారు. అందుకే వివేకాపై ద్వేషమా? అని ఆమె నిలదీశారు. ఏపీ సీఎం జగన్‌పై జరిగిన రాయి దాడిపైనా సునీత స్పందించారు.
ఏపీ సీఎం జగన్ ఎక్కువ రోజులు బ్యాండేజ్ ఉంచుకోకూడదని, బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంచుకుంటే సెప్టిక్ అవుతుందని సునీత చెప్పారు. వైద్యులు జగన్‌కు సరైన సలహా ఇవ్వలేదన్న ఆమె, గాలి తగిలితేనే గాయం త్వరగా మానుతుందని, బ్యాండేజ్ తీసేయాలని ఒక డాక్టర్‌గా జగన్‌కు సలహా ఇస్తున్నా అని చెప్పారు.
నేను బయటకు వెళ్లాక నరికి చంపినా ఆశ్చర్యపడనక్కర్లేదు : సునీత - YS Vivekananda Reddy murder Case