ETV Bharat / politics

రిజర్వేషన్లను ఎవరూ టచ్ చేయలేరని ప్రధాని మోదీయే స్పష్టం చేశారు : ఉత్తరాఖండ్​ సీఎం పుష్కర్​సింగ్ ధామి - Uttarakhand CM on Reservation

author img

By ETV Bharat Telangana Team

Published : May 6, 2024, 4:43 PM IST

uttarakhand cm on congress : తాను బతికున్నంత కాలం రిజ్వర్వేషన్ల జోలికి ఎవరూ వెళ్లరని ప్రధాని మంత్రే హామీ ఇస్తున్నారని, అంతకంటే గ్యారెంటీ ఇంకేం కావాలని ఉత్తరాఖండ్​ సీఎం పుష్కర్​సింగ్ ధామి అన్నారు. ఇవాళ ముషీరాబాద్​లో నిర్వహించిన బీజేపీ యువ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ విమర్శలు చేశారు.

Uttarakhand CM Pushkar Singh Dhami on Congress Guarantees
uttarakhand cm on congress (etv bharat)

Uttarakhand CM Pushkar Singh Dhami on Congress Guarantees : తాను బతికున్నన్ని రోజులు రిజర్వేషన్ల వ్యవస్థను ఎవరూ టచ్ చేయలేరని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారని, అంతకన్నా గ్యారెంటీ ఇంకేం కావాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్​ సింగ్ ధామి పేర్కొన్నారు. రిజర్వేషన్ల విషయంలో విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. వాటిని నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, బీఆర్​ఎస్​ నేతలు ఇద్దరూ తోడుదొంగలే అని విమర్శించారు. కాళేశ్వరం మీద విచారణ జరుగుతోందా? అని ప్రశ్నించారు.

ఇవాళ ముషీరాబాద్​లోని ఓ ఫంక్షన్ హాల్​లో బీజేవైఎం ఆధ్వర్యంలో జరిగిన బీజేపీ యువ సమ్మేళనం కార్యక్రమంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్​సింగ్ ధామి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామంటోందని, మహిళలకు రూ.2500 ఇస్తామని చెబుతున్నారని మరి ఇస్తున్నారా అని పుష్కర్​సింగ్ ధామి ప్రశ్నించారు. యువతకు నిరుద్యోగ భృతి రూ.4 వేలు ఇస్తామన్నారని, ఇచ్చారా? అని ఎద్దేవా చేశారు.

మూడోసారి మోదీని ప్రధానిని చేయాలి : కాంగ్రెస్​ ఇచ్చిన హామీలపై యువతీ, యువకులు ఆలోచన చేయాలి అని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్​సింగ్ ధామి సూచించారు. రాజకీయాల్లో బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కిషన్​రెడ్డి వంటి మంచివ్యక్తి దొరకరని, అందుకే ఆయన్ను గెలిపించి మోదీకి మద్దతు ఇవ్వండని పిలుపునిచ్చారు. మోదీని మూడోసారి ప్రధానమంత్రిని చేయాలని, కిషన్​రెడ్డిని మరోసారి ఎంపీగా గెలిపించాలి అని విజ్ఞప్తి చేశారు. పార్టీలో ఆయన​కు ఏ బాధ్యతలు అప్పగించినా ఆ బాధ్యతలను ఆయన సమర్థవంతంగా నిర్వహించారని కొనియాడారు. ఎన్నికల ప్రచారం కోసం వేర్వేరు రాష్ట్రాల్లో తాను పర్యటించానని, ఆ పరిస్థితులు చూస్తుంటే ప్రభుత్వం ఎవరిది ఏర్పడుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు.

దేశమంతా మోదీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని స్పష్టం చేస్తోందని పుష్కర్​సింగ్ ధామి ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటు వేయకపోతే ఏమవుతుందనే అలసత్వం ఏమాత్రం వద్దు అని, కచ్చితంగా ఓటింగ్ కేంద్రాలకు వెళ్లి కిషన్ రెడ్డికి ఓటేయండని విజ్ఞప్తి చేశారు. ఇతరులతో ఓటు వేయించండి అని యువతకు పిలుపునిచ్చారు. కారు గ్యారేజీలోకి పోయిందని, హస్తం పార్టీ పని అయిపోయిందని, కమల వికాసం కొనసాగుతోందని అన్నారు. దేశంలో ఉండే ప్రతి ఒక్కరికీ ఒకే చట్టం వర్తించాలని, అందుకే ఉమ్మడి పౌరస్మృతిని(యూసీసీ)ని తాము తీసుకొచ్చామని చెప్పారు. ఇప్పుడు దేశమంతా అమలు చేస్తున్నారన్నారు.

'రిజర్వేషన్లను ఎవరూ టచ్ చేయలేరని ప్రధాని మోదీయే స్పష్టం చేశారు. అంతకంటే గ్యారెంటీ ఏం కావాలి. కాంగ్రెస్​ హామీలు ఇచ్చింది కానీ అమలు చేస్తుందా ?. కాంగ్రెస్​ పని అయిపోయింది. దేశంలో కమలం వికసిస్తుంది. మరోసారి మోదీని ప్రధానమంత్రిని చేయాలి'- పుష్కర్​సింగ్ ధామి, ఉత్తరాఖండ్ సీఎం

రిజర్వేషన్లను ఎవరూ టచ్ చేయలేరని ప్రధాని మోదీయే స్పష్టం చేశారు : ఉత్తరాఖండ్​ సీఎం పుష్కర్​సింగ్ ధామి (etv Bharat)

'ప్రపంచం మొత్తం మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తోంది - మూడోసారి ప్రధాని అయ్యేందుకు మద్దతుగా నిలవండి' - Uttarakhand CM Campaign in State

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.