ETV Bharat / international

'పనిష్మెంట్'ను​ మరింత పెంచిన చైనా- యుద్ధానికి సై అంటున్న తైవాన్​! - China Taiwan Conflict

author img

By ETV Bharat Telugu Team

Published : May 24, 2024, 3:38 PM IST

Updated : May 24, 2024, 3:51 PM IST

China Taiwan Conflict : చైనా, తైవాన్‌ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. తైవాన్‌ను మళ్లీ తమ నియంత్రణలోకి తీసుకురావాలని ఎప్పటి నుంచో సంకల్పించుకున్న చైనా ఆ దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కవ్వింపు చర్యలను మరింత పెంచింది. తైవాన్‌ కొత్త అధ్యక్షుడి స్వాతంత్ర్య అనుకూల ప్రసంగానికి వ్యతిరేకంగా మొదలుపెట్టిన సైనిక విన్యాసాలను రెండో రోజు కొనసాగించింది. అందుకు దీటుగా తైవాన్‌ కూడా ప్రతిస్పందిస్తోంది.

China Taiwan Conflict
China Taiwan Conflict (Associated Press)

China Taiwan Conflict : తైవాన్‌లో కొత్త నాయకత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆ ద్వీప దేశాన్ని కవ్విస్తున్న చైనా, ఆ చర్యలను మరింత ఉద్ధృతం చేసింది. డజన్ల కొద్దీ యుద్ధవిమానాలు, యుద్ధనౌకలను తైవాన్‌ తీరాలకు డ్రాగన్‌ పంపింది. 49 యుద్ధవిమానాలు, 19 నౌకాదళ నౌకలు, అలాగే కోస్టుగార్డు నౌకలను తాము గుర్తించినట్లు తైవాన్‌ రక్షణశాఖ వెల్లడించింది. సుమారు 35 యుద్ధవిమానాలు తైవాన్‌ జలసంధి మధ్యభాగంపై చక్కర్లు కొట్టినట్లు తెలిపింది.

తైవాన్‌లో చైనా వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో గురువారం కూడా తైవాన్‌ తీర ప్రాంతాల్లో చైనా భారీ సైనిక విన్యాసాలు నిర్వహించింది. స్వాతంత్ర్యం కావాలంటున్న వేర్పాటువాద శక్తులను శిక్షించేందుకు ఆ విన్యాసాలు చేపట్టినట్లు చైనా ప్రకటించింది. తైవాన్ నియంత్రణలో ఉన్న కిన్‌మెన్, మాట్సు ద్వీప సమూహాల్లో చైనా చట్టాలను అమలు చేసేందుకు, డ్రిల్‌ల నిర్వహణకు ఒక నౌకాదళాన్ని ఏర్పాటు చేసినట్లు చైనా తీర రక్షక దళం ఒక ప్రకటనలో తెలిపింది.

చైనా కవ్వింపు చర్యల నేపథ్యంలో తైవాన్‌ కూడా అప్రమత్తమైంది. యుద్ధవిమానాలు, రాడార్లు, నౌకలు, ఇతర ఆయుధ నిరోధక వ్యవస్థలతో గస్తీని కట్టుదిట్టం చేసింది. చైనా యుద్ధ విన్యాసాల నేపథ్యంలో టయోయువాన్‌లోని ఆర్మీ బేస్‌ను కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు లై చింగ్-తె సందర్శించారు. తైవాన్ సాయుధ దళాల కమాండర్-ఇన్-చీఫ్‌గా జాతీయ భద్రతను రక్షించేందుకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. చైనా అహేతుక రెచ్చగొట్టే చర్యల వల్ల ప్రాంతీయ స్థిరత్వం ప్రమాదంలో పడిందన్నారు.

'సైనిక బెదిరింపులు మానుకోవాలి'
తైవాన్ కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన లాయ్‌ చింగ్ తె, చైనా తన సైనిక బెదిరింపులు మానుకోవాలని ఇటీవల చేసిన ప్రసంగంలో సూచించారు. తైవాన్‌ను యథావిధిగా కొనసాగించేందుకు చైనా నాయకత్వంతో చర్చలు కొనసాగించాలనేది తమ అభిమతమని చెప్పారు. తద్వారా ఘర్షణలను నివారించవచ్చని చెప్పారు.

తైవాన్​ను భయపెట్టేందుకు ప్రయత్నం
లాయ్‌ చింగ్ తె ప్రసంగంపై చైనా కన్నెర్రజేసింది. తైవాన్​ను భయపెట్టేందుకు సైనిక విన్యాసాలకు గురువారం తెరతీసింది. చైనా సైన్యానికి చెందిన తూర్పు థియేటర్ కమాండ్ నేతృత్వంలో రెండు రోజలు పాటు సైనిక విన్యాసాలు చేపట్టింది. తైవాన్ జలసంధి, తైవాన్ ద్వీపానికి ఉత్తర, దక్షిణ, తూర్పుభాగాలతో పాటు కిన్మెన్, మాట్సు, డోంగిన్ ద్వీపాల చుట్టూ చైనా సైనిక కసరత్తులు చేపట్టింది. 'జాయింట్ స్వార్డ్-2024ఏ' అనే కోడ్ పేరుతో సైన్యం, నావికాదళం, వైమానిక దళం సంయుక్తంగా కసరత్తు చేస్తున్నట్లు చైనా సైనిక ప్రతినిధి లీ షీ వివరించారు. "స్వాతంత్య్రం కోరుతున్న వేర్పాటువాద శక్తులకు ఇది బలమైన శిక్ష. మమ్మల్ని రెచ్చగొడుతూ, మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకొనే బాహ్య శక్తులకు ఇది మా తీవ్ర హెచ్చరిక" అని లీ షీ పేర్కొన్నారు.

విరిగిపడిన కొండచరియలు- నిద్రలోనే 100మందికి పైగా మృతి- గ్రామమంతా ధ్వంసం! - papua new guinea landslide

'పోస్ట్​ స్టడీ వర్క్​ ఆఫర్​ కొనసాగిస్తున్నాం'- బ్రిటన్​ వెళ్లే విద్యార్థులకు గుడ్​ న్యూస్​ - UK Graduate Route Visa

Last Updated : May 24, 2024, 3:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.