ETV Bharat / health

ఈ ఫుడ్స్​ తింటున్నారా? - అయితే మైగ్రేన్‌ ముప్పు పొంచి ఉన్నట్టే!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 20, 2024, 1:01 PM IST

Migraine Trigger Foods : మనం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం. కానీ, ప్రస్తుత రోజుల్లో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది వివిధ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో మైగ్రేన్ తలనొప్పి ఒకటి. ముఖ్యంగా కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Foods
Migraine

These Foods That Can Trigger Migraines : ప్రస్తుత రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య మైగ్రేన్ తలనొప్పి. దీనితో బాధపడేవారికి సాధారణ తలనొప్పికి మించి ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా ఒకవైపు మాత్రమే తీవ్రమైన తలనొప్పి, వాంతులు, వికారం, కాంతిని చూడలేకపోవడం వంటి లక్షణాలు ఎదుర్కొంటుంటారు. అయితే ఇది రావడానికి మారిన జీవనశైలి, నిద్రలేమి, ఒత్తిడి, జన్యువుల్లో మార్పులు వంటివి మాత్రమే కాకుండా మనకున్న ఆహారపు అలవాట్లూ కారణమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మైగ్రేన్(Migraine)​ను ప్రేరేపించే ఆహారాలు కొన్ని ఉన్నాయని.. వాటిని తినడం ద్వారా మైగ్రేన్ తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

మద్యం : 2018లో యూరోపియన్ జర్నల్ ఆఫ్ న్యూరాలజీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఆల్కహాల్​ తీసుకున్న వారిలో మైగ్రేన్​ అవకాశం ఎక్కువని, ముఖ్యంగా రెడ్ వైన్ తీసుకున్న వారిలో ఈ సమస్య అధికమని స్పష్టమైంది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల బాడీలో డీహైడ్రేషన్ ఏర్పడుతుందని.. అది తలనొప్పికి ప్రధాన కారణంగా మారుతుందని పేర్కొన్నారు.

కెఫెన్ : 2021లో న్యూట్రియెంట్స్ జర్నల్​లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం మితిమీరిన కెఫెన్ వినియోగం మైగ్రేన్‌లకు దారితీయవచ్చని తేలింది. అలాగే ఆకస్మికంగా కెఫెన్ ఉపసంహరణ కూడా మైగ్రేన్ దాడులను ప్రేరేపిస్తుందని వెల్లడైంది. కాబట్టి కెఫెన్ ఎక్కువగా ఉండే వాటిని పరిమితి మించకుండా చూసుకోవాలని, వీలైతే పూర్తిగా దూరంగా ఉండడం మంచిది అంటున్నారు నిపుణులు.

ప్రాసెస్ చేసిన మాంసాలు : ప్రస్తుతం చాలా మంది ప్రాసెస్​ చేసిన ఆహారాలను తింటున్నారు. అయితే మైగ్రేన్​ రావడానికి ఇది కూడా ఒక కారణమని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ ఆహరాలలో ఉండే నైట్రేట్స్.. రక్తంలోకి నైట్రిక్ ఆక్సైడ్​ను రిలీజ్ చేస్తాయి. అది మెదడులోని రక్త నాళాలకు విస్తరిస్తుంది. ఫలితంగా మైగ్రేన్​లు వచ్చే అవకాశం ఉంటుంది.

చాక్లెట్ : అమెరికన్ మైగ్రేన్ ఫౌండేషన్ ప్రకారం.. ఆల్కహాల్ తర్వాత మైగ్రేన్​ను ప్రేరేపించే అత్యంత సాధారణ ఫుడ్ చాక్లెట్. వీటిలో కెఫెన్​తో పాటు మైగ్రేన్​ నొప్పిని పెంచే బీటా-ఫెనిలేథైలమైన్ అనే రసాయనం కూడా ఉంటుంది.

ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు : ఉప్పు ఎక్కువగా ఉండే ఫుడ్స్​లో సోడియం ఎక్కువ స్థాయిలో ఉంటుంది. ఫలితంగా వీటిని తీసుకుంటే రక్తపోటు పెరుగుతుంది. అది తలనొప్పి, మైగ్రేన్లకు దారి తీస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

మైగ్రెయిన్​తో బాధపడుతున్నారా? ఈ చిట్కాలు పాటించండి!

చీజ్​ : ఇది కూడా మైగ్రేన్​లను ప్రేరేపిస్తుందని అంటున్నారు. ముఖ్యంగా Gorgonzola, Camembert, Cheddar వంటి చీజ్‌లలో టైరమైన్ అనే పదార్ధం ఉంటుంది. వీటిని ఎంత ఎక్కువ కాలం స్టోర్ చేస్తే వాటిలో టైరమైన్ కంటెంట్ అంత ఎక్కువగా ఉంటుంది. ఈ టైరమైన్ రక్త నాళాలను విస్తరించడం ద్వారా తలనొప్పికి కారణమవుతుందని చెబుతున్నారు నిపుణులు.

ఊరగాయ, పులియబెట్టిన ఆహారాలు : చీజ్​ల మాదిరిగానే ఊరగాయ, పులియబెట్టిన ఆహారాలు అధిక మొత్తంలో టైరమైన్​ను కలిగి ఉంటాయి. ఒక అధ్యయనంలో టైరమైన్ ఉండే ఆహారాలు తినే వ్యక్తులలో తినని వారి కంటే ఎక్కువగా మైగ్రేన్​లు వచ్చే అవకాశం ఉన్నట్లు కనుగొన్నారు.

కృత్రిమ స్వీటెనర్లు : మార్కెట్​లో లభించే చాలా ఫుడ్ ఐటమ్​లలో ఆర్టిఫిషియల్ స్వీటెనర్లు ఉపయోగిస్తారు. ఇవి ఆహార పదార్థాలను తీపిని అందిస్తాయి. కానీ, ఇందులో ఉండే అస్పర్టమ్ అనే రసాయనం మైగ్రేన్​ను ప్రేరేపించే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవేకాకుండా మోనోసోడియం గ్లుటామేట్ ఉన్న ఆహారాలు, ఐస్​క్రీం, స్లష్ వంటి ఫ్రోజెన్ ఫుడ్స్ కూడా మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండడం మంచిదని చెబుతున్నారు.

ఏళ్లనాటి మైగ్రేన్ బాధలు - ఇలా తిండితోనే తగ్గించుకోవచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.