ETV Bharat / health

ప్రొస్టేట్ క్యాన్సర్​ ముప్పును ఇలా అడ్డుకోండి - రీసెర్చ్ రిపోర్ట్!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 7, 2024, 2:36 PM IST

Prostate Cancer : క్యాన్సర్.. ఈ పేరు వింటనే ప్రస్తుతం జనాలు హడలిపోతున్నారు. అందులో ముఖ్యంగా మగవారిని ప్రొస్టేట్ క్యాన్సర్ ఆందోళనకు గురిచేస్తోంది. దీన్ని ఎలా అడ్డుకోవాలి అనే విషయమై.. ఇటీవల జరిపిన ఓ అధ్యయనం తన నివేదికను వెల్లడించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Prostate Cancer
Prostate Cancer can be Reduced with Fitness

Prostate Cancer can be Reduced with Fitness : ప్రస్తుతం ఎక్కువ మందిని భయపెడుతున్న జబ్బు.. క్యాన్సర్. దీనిలో రకరకాలు ఉంటాయి. అయితే.. మగవారిని బెంబేలెత్తిస్తున్న క్యాన్సర్ ప్రొస్టేట్. ఒకప్పుడు ఈ క్యాన్సర్ వృద్ధుల్లో మాత్రమే కనిపించేది. కానీ, జీవనశైలి మార్పులు, ఆహారపు అలవాట్లు, ఊబకాయం.. కారణంగా చిన్నవయసులోనే ప్రొస్టేట్ క్యాన్సర్ వస్తోంది. ఇది మిగతా క్యాన్సర్లలా పెద్దగా లక్షణాలు చూపించదు. దాంతో చాలా మంది దీనిని సరైన సమయంలో గుర్తించలేక ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.

అందుకే.. దీన్ని ముందుగా అడ్డుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం డైలీ వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. వ్యాయామంతో మంచి ఫిట్​నెస్ సాధిస్తే.. ఈ క్యాన్సర్(Cancer)​ రాకుండా కాపాడుకోవచ్చని ఇటీవల ఓ అధ్యయనంలో తేల్చింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రొస్టేట్ క్యాన్సర్ ఎలా వస్తుందంటే..

మగవారిలో మూత్రాశయం కింద చిన్న వాల్​నట్ ఆకారంలో ప్రొస్టేట్ గ్రంథి ఉంటుంది. ఇది స్పెర్మ్ పోషణ, రవాణాలో సహాయపడే సెమినల్ ద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ గ్రంథిలోని కణాలు ఆగకుండా పెరగడం ప్రొస్టేట్ క్యాన్సర్‌కు దారితీస్తుంది. వృద్ధాప్యం లేదా జన్యుపర సమస్యల వల్ల ఈ పరిస్థితి వస్తుంది.

వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్ ఇంటర్నేషనల్ ప్రకారం.. పురుషులలో వచ్చే రెండో అత్యంత సాధారణం సమస్య ప్రొస్టేట్ క్యాన్సర్. ఇది మొత్తం మీద నాలుగవ సాధారణ క్యాన్సర్. 2020లో 1.4 మిలియన్లకు పైగా ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. అయితే.. ఈ క్యాన్సర్​ ముప్పును తగ్గించడంలో వ్యాయామం చాలా బాగా పనిచేస్తుందని ఇటీవల బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో తేలింది.

ఈ అధ్యయనం ప్రకారం.. పురుషులు తమ ఫిట్‌నెస్ స్థాయిని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే.. ఇది ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. ముఖ్యంగా.. కార్డియోరెస్పిరేటరీ ఫిట్‌నెస్‌ను మూడు శాతం లేదా అంతకంటే ఎక్కువగా మెరుగుపరుచుకోవడం వల్ల వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని దాదాపు 35 శాతం వరకు తగ్గించుకోవచ్చని ఈ అధ్యయనంలో వెల్లడైంది.

బీ అలర్ట్​ - ఈ ఆహారాలను ఎక్కువగా ఉడికిస్తున్నారా? - క్యాన్సర్​ వచ్చే అవకాశం!

ఈ అధ్యయనంలో పరిశోధకులు మొత్తం 1,81,673 మందిలో 57,652 మందిపై కొన్ని ఫిట్​నెస్ పరీక్షలు జరిపారు. ఈ ఫిట్​నెస్​ పరీక్షల ద్వారా.. వారు వ్యాయామం చేసేటప్పుడు ఎంత ఆక్సిజన్​ను ఉపయోగించారో తేల్చారు. తద్వారా.. ఎవరైతే ఎక్కువ ఆక్సిజన్ తీసుకున్నారో వారు మెరుగైన ఫిట్నెస్ స్థాయిలను కలిగి ఉన్నట్టు గుర్తించారు.

7 సంవత్సరాల కాలంలో సగటున 592 మంది పురుషులు ప్రొస్టేట్ క్యాన్సర్‌ బారిన పడుతున్నారని, 46 మంది ఈ వ్యాధితో మరణించారని ఈ అధ్యయనం కనుగొంది. అయితే.. ఫిట్​ నెస్ లోపించిన వారే ఎక్కువగా ఈ క్యాన్సర్ బారిన పడ్డారని తేలింది. కాబట్టి.. ఈ క్యాన్సర్ ముప్పు తగ్గించుకోవడానికి డైలీ వ్యాయామం చేస్తూ బరువును కంట్రోల్​లో ఉంచుకోవాలంటున్నారు నిపుణులు. అదేవిధంగా వీలైనంతవరకు ధూమపానానికి దూరంగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు.

మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? - అయితే కడుపు క్యాన్సర్ కావొచ్చు!

దగ్గుతున్నప్పుడు ఛాతి, భుజాల దగ్గర నొప్పిగా ఉందా? ఇది క్యాన్సర్‌ సంకేతం కావచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.