ETV Bharat / health

దగ్గుతున్నప్పుడు ఛాతి, భుజాల దగ్గర నొప్పిగా ఉందా? ఇది క్యాన్సర్‌ సంకేతం కావచ్చు!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 27, 2024, 4:29 PM IST

Symptoms Of Lung Cancer : మీకు దగ్గుతున్నప్పుడు ఛాతిలో నొప్పిగా ఉందా? అలసట, ఆకలి లేకపోవడం వంటి ఇతర లక్షణాలు కనిపిస్తున్నాయా? ఇవి ఎక్కువ కాలం కొనసాగితే క్యాన్సర్‌కు సంకేతమేనని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Symptoms Of Lung Cancer
Symptoms Of Lung Cancer

Symptoms Of Lung Cancer : అన్నం తినకుండా కొన్ని రోజుల వరకు ఉండగలం.. నీళ్లు తాగకుండా కూడా కొంత సేపు ఉండవచ్చు. కానీ.. ఊపిరి తీసుకోక పోతే మాత్రం నిమిషాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం. మన శరీరానికి గాలి అంతగా అవసరం. ఆ గాలిని పంప్ చేసే అత్యంత ముఖ్యమైన భాగాలుగా ఊపిరితిత్తులు ఉన్నాయి. కానీ.. మారుతున్న జీవనశైలి, కాలుష్యం, పొగ తాగడం వంటి అలవాట్ల వల్ల నేడు చాలా మంది లంగ్ క్యాన్సర్‌ బారిన పడుతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా రొమ్ము, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ తరవాత ఎక్కువ మంది చనిపోయేది ఊపిరితిత్తుల క్యాన్సర్‌తోనే అని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ క్యాన్సర్‌ బారిన పడ్డ వారికి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందితోపాటు మరికొన్ని లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు. మరి.. లంగ్‌ క్యాన్సర్‌ రావడానికి కారణాలు ఏంటి ? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

లంగ్ క్యాన్సర్ బారిన పడ్డ వారిలో దగ్గుతున్నప్పుడు ఛాతి భాగంలో నొప్పి కలుగుతుందని యూకేకు చెందిన క్యాన్సర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ వెల్లడించింది. అలాగే భుజాలు కూడా నొప్పిగా ఉంటాయని పరిశోధకులు తెలిపారు. ముఖ్యంగా.. కఫం సమస్యలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి, లంగ్‌ క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని సూచిస్తున్నారు. లేకపోతే ఇది ప్రాణాంతకం కావచ్చని హెచ్చరిస్తున్నారు.

లంగ్ క్యాన్సర్‌ను గుర్తించడానికి మరికొన్ని లక్షణాలు..

  • తరచూ అలసటకు గురికావడం
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
  • వేగంగా బరువు తగ్గడం
  • లంగ్‌ ఇన్ఫెక్షన్లు రావడం
  • కొందరిలో గొంతు బొంగురుపోవడం
  • విపరీతమైన దగ్గు
  • ఆకలి లేకపోవడం
  • తీవ్రమైన భుజాల నొప్పులు

లంగ్‌ క్యాన్సర్ ఎందుకు వస్తుంది ?

  • ప్రధానంగా లంగ్‌ క్యాన్సర్‌కు కారణం సిగరెట్‌, చుట్టలు, బీడీలు తాగడమని నిపుణులు చెబుతున్నారు.
  • అలాగే పొగాకు ఉత్పత్తులను తినడం, నమలటం కూడా కారణమని అంటున్నారు.
  • ఇంకా రోజు రోజుకూ పెరుగుతున్న వాతావరణ కాలుష్యం వంటివి కూడా లంగ్‌ క్యాన్సర్‌కు కారణమవుతున్నాయట.
  • కొంతమందికి ఈ క్యాన్సర్‌.. జన్యువుల వల్ల కూడా రావొచ్చని నిపుణులంటున్నారు.
  • తల్లిదండ్రులు, రక్తసంబంధికుల్లో ఎవరికైనా ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ఉంటే పరీక్షలు చేసుకోవడం మంచిదని చెబుతున్నారు.

లంగ్‌ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ?

  • పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.
  • ఎక్కువగా వాహనాల రద్దీ ఉండే ప్రాంతాల్లో ప్రయాణం చేస్తే మాస్క్‌ వంటివి ధరించాలి.
  • అలాగే మంచి జీవనశైలిని అలవాటు చేసుకోవాలి.
  • ఇంకా తాజా పండ్లు, కూరగాయలను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి.
  • అలాగే ప్రతిరోజు వ్యాయామం చేయాలి. ముఖ్యంగా అధిక బరువుతో బాధపడుతున్న వారు వెయిట్‌ లాస్‌ అవ్వడంపై దృష్టి పెట్టాలి.
  • ముఖ్యంగా మూడు వారాల కంటే ఎక్కువ కాలం పాటు దగ్గు, కఫం, ఛాతిలో నొప్పిగా ఉన్న లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

అలర్ట్ - ఈ లక్షణాలు మీ పాదాలపై కనిపిస్తే.. షుగర్‌ ఎక్కువగా ఉన్నట్టే!

మెదడు మొద్దుబారితే ప్రమాదం - ఇలా చేస్తే ఫుల్ యాక్టివ్​ అయిపోతుంది!

మీ అరికాళ్లలో మంటగా ఉందా? - కారణం అదే కావొచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.