ETV Bharat / health

అలర్ట్ : మీ చర్మంపై ఈ లక్షణాలు ఉన్నాయా? - అయితే అది "చికెన్ స్కిన్" కావొచ్చు! - Chicken Skin Symptoms

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 5, 2024, 4:56 PM IST

Keratosis Pilaris Causes
Keratosis Pilaris Causes

Keratosis Pilaris Causes : కొంతమందిని కాలంతో సంబంధం లేకుండా కొన్ని రకాల చర్మ సమస్యలు వేధిస్తుంటాయి. అయితే.. అందులో కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని రోజులకు వాటంతట అవే తగ్గిపోతాయి. కానీ.. కొందరిని కొన్ని చర్మ సమస్యలు జీవితాంతం వేధిస్తుంటాయి. అలాంటి వాటిలో "చికెన్ స్కిన్" ఒకటి. మరి.. దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు చూద్దాం.

Chicken Skin Symptoms and Causes : కెరటోసిస్ పిలారిస్​.. దీన్నే "చికెన్ స్కిన్" అని కూడా పిలుస్తారు. ఇది అన్ని వయసుల వారినీ ప్రభావితం చేసే చర్మ సమస్య. ఇది వస్తే.. చర్మంపై చిన్న కురుపులు, ఎరుపు లేదా గులాబీ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇవి ఎక్కువగా చేతి, ముఖం, తొడ, చెంప, వీపు పైభాగంలో కనిపిస్తాయి. ఇది అసహ్యంగా అనిపిస్తుంది. దురద కలిగిస్తుంది. అయితే.. ఇది వైద్యపరంగా అంత ప్రమాదకరం కానప్పటికీ, తరచుగా వేధిస్తూ ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరి ఈ చికెన్ స్కిన్ సమస్య తలెత్తడానికి కారణం ఏంటి? అన్నప్పుడు.. కచ్చితమైన కారణాన్ని ఇప్పటి వరకూ కనుగొనలేదు. కానీ.. చాలా మంది ఆరోగ్య నిపుణులు ఇది చర్మంపై కెరాటిన్ ఏర్పడటం వల్ల వస్తుందని నమ్ముతారు. ఎందుకంటే.. ఇది చర్మ రంధ్రాలను మూసుకుపోయేలా చేయడమే కాకుండా వెంట్రుకల కుదుళ్లు పెరగకుండా చేస్తుంది. దీని కారణంగా చర్మంపై చిన్న ఎర్రటి గడ్డలు ఏర్పడతాయంటున్నారు నిపుణులు.

ఒక అధ్యయనం ప్రకారం.. కెరాటోసిస్ పిలారిస్ చర్మ పరిస్థితి జన్యు మార్పుల వల్ల రావొచ్చని తేలింది. పొడి చర్మం ఉన్నవారికి ఈ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. అంతేకాకుండా.. తామర, మధుమేహం, కెరటోసిస్ పిలారిస్ కుటుంబ చరిత్ర కలిగిన వ్యక్తులకూ ఇది వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. 'అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ' ప్రకారం.. ఉబ్బసం, అలెర్జీలు, అధిక బరువు ఉన్నవారు కూడా ఈ వ్యాధి బారిన పడొచ్చట.

ఈ చర్మ సమస్యలను త్వరగా గుర్తించండి - లేదంటే ప్రాణాలకే ప్రమాదం!

కెరటోసిస్ పిలారిస్ గురించి.. న్యూజెర్సీ మిల్‌బర్న్‌లో ప్రముఖ చర్మవ్యాధి నిపుణుడైన డాక్టర్ అమీ ఫ్రీమాన్ కొన్ని ఆసక్తికర విషయాలు పేర్కొన్నారు. చికెన్ స్కిన్ గడ్డలు హానిచేయనివని, తరచుగా వాటంతట అవే తగ్గిపోతాయని చెప్పారు. కానీ కొంతమందిలో మాత్రం జీవితాంతం ఎదుర్కోవాల్సి రావొచ్చని చెప్పారు.

చికెన్ స్కిన్ నివారణ మార్గాలు : పొడి చర్మాన్ని నివారించుకోవడం ద్వారా.. ఈ చికెన్ స్కిన్​ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు డాక్టర్ అమీ ఫ్రీమాన్. అదేవిధంగా కెరాటోలిటిక్ ఏజెంట్లతో కూడిన మాయిశ్చరైజింగ్ లోషన్లు లభిస్తాయి. వాటిని ఉపయోగించడం ద్వారా కూడా చాలా వరకు ఉపశమనం పొందవచ్చంటున్నారు.

అయితే.. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. చికెన్ స్కిన్​తో ఇబ్బందిపడుతున్నవారు రాపిడితో కూడిన ఎక్స్‌ఫోలియేటర్‌తో గడ్డల మీద స్క్రబ్ చేయవద్దంటున్నారు నిపుణులు. అది చర్మానికి చికాకు కలిగించడమే కాకుండా వ్యాధిని మరింత తీవ్రతరం చేస్తుందని చెబుతున్నారు. అలాగే, గడ్డల వద్ద గోకడం లేదా గిల్లడం వంటివి చేయవద్దంటున్నారు. ఇలా చేస్తే ఇన్ఫెక్షన్లు సోకడం లేదా మచ్చలకు దారితీయవచ్చంటుున్నారు ఆరోగ్య నిపుణులు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

వేసవిలో చర్మం కమిలిపోతోందా? - ఈ ఫేస్ ప్యాక్​ ట్రై చేశారంటే మెరిసిపోతారంతే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.