నో చెప్పకపోతే మానసిక రోగాలు ఖాయం - ఇలా చెప్పేయండి! - BEST WAYS TO SAY NO

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 27, 2024, 4:03 PM IST

Updated : Mar 27, 2024, 5:05 PM IST

How to Say to NO

How to Say to NO : "నేటి జనరేషన్​కు నో చెప్పే ధైర్యం చచ్చిపోయింది" ఓ సినిమా డైలాగ్ ఇది. మరి నిజంగానే.. నో చెప్పడం అంత కష్టమా? NO చెప్ప లేకపోవడం వల్ల వచ్చే సమస్యలేంటి? ఫైనల్​గా నో ఎలా చెప్పాలి? అన్నది ఈ స్టోరీలో చూద్దాం.

Best Ways to Say NO : ఈ ప్రపంచంలో అత్యంత బరువైన పదాల్లో "NO" ఒకటి. ఈ ఒకే పదాన్ని పలకడానికి చాలా మంది నాలుక ధైర్యం చేయదు. గుండెల్లో గుబులు రేగుతుంది.. మనసులో భయం చొరబడుతుంది! ఇంతగా బెంబెేలెత్తించే ఈ రెండు అక్షరాలు చెప్పడానికి భయపడి.. YES అనే మూడు అక్షరాలను చెప్పేసి, నిత్యం బాధపడుతుంటారు జనం! మీరు కూడా ఇలాంటి పరిస్థితిలో ఉంటే.. వెంటనే మారాలని సూచిస్తున్నారు మానసిక నిపుణులు.

"ఆఫీసుకు వెళ్లేందుకు సురేష్ రెడీ అవుతాడు. అప్పటికే ఆలస్యమైందని హడావిడిగా ఇంటి నుంచి బయటకెళ్తాడు. సరిగ్గా అప్పుడే.. పక్కింటి పెద్దాయన పిలిచి ఏదో పని చెప్తాడు. సురేష్​లో తీవ్రమైన అంతర్మథనం.. బస్సు మిస్ అయ్యేలా ఉందనే టెన్షన్ ఓ వైపు.. చెప్పిన పని చేయకపోతే ఆ పెద్దాయన ఏమనుకుంటాడో అనే ఫీలింగ్ మరోవైపు. ఈ ఫీలింగ్స్ అన్నీ మనసులోనే దాచుకొని ఆయన చెప్పిన పని త్వరగా చేసి బస్టాప్​నకు వెళ్లాలని మరింత హడావిడిగా కదులుతాడు. చివరకు పరిగెత్తిపోయినా లాభం ఉండదు. బస్ వెళ్లిపోతుంది. మళ్లీ గంట తర్వాత వచ్చిన బస్సు పట్టుకొని ఆఫీసుకు వెళ్తాడు.. అక్కడ మేనేజర్​తో తిట్లు తింటాడు!" ఇదంతా.. జస్ట్ NO చెప్పలేకపోవడం వల్ల వచ్చిన సమస్య! ఈ ఒక్క విషయంలోనే కాదు.. సురేష్ నిత్యం ఇలాంటి పరిస్థితినే ఫేస్ చేస్తుంటాడు. ఈ సురేష్ మాత్రమే కాదు, మన చుట్టూ నిత్యం ఎంతో మంది ఇదే కండీషన్​లో నలిగిపోతుంటారు. ఈ దుస్థితి నుంచి బయటపడటానికి ఏకైక మార్గం "నో" చెప్పడమే అంటున్నారు మానసిక నిపుణులు.

మంచి విషయమే కానీ..

ఎదుటి వారికి సహాయం చేయడం మంచి లక్షణం. కానీ.. దానికీ ఓ పరిమితి ఉంటుందని గుర్తించాలి. వాళ్లు అడిగింది చేయకపోతే ఏమనుకుంటారో అనే భయంతో అన్నిటికీ ఓకే చెప్పేస్తూ పోతుంటారు. ఆ తర్వాత ఇబ్బందులు ఎదురువుతున్నప్పుడు.. అనవసరంగా YES చెప్పాను అనుకుంటూ.. తమను తామే నిందించుకుంటూ ఉంటారు. మనసులో కుమిలిపోతుంటారు. ఈ పరిస్థితి ఎక్కువైతే మానసిక ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు.

ముందు మీరు..

మీకు మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకోవాలని సూచిస్తున్నారు. కరోనా వచ్చిన రోగికి సహాయం చేయాలంటే.. మీరు ఆరోగ్యంగా ఉండాలి. అందుకోసం మాస్కులు ధరించాలి. డిస్టెన్స్ మెయింటెయిన్ చేయాలి. అలా కాకుండా.. వాళ్లతో దూరం పాటిస్తే ఏమనుకుంటారో అని ఇవేవీ లేకుండా కలిసిపోయారనుకోండి ఏమవుతుంది? మీరూ రోగిగా మారిపోతారు. ఈ సూత్రం జీవితానికి కూడా వర్తిస్తుంది. ఎదుటి వాళ్లకు సహాయం చేయాల్సివచ్చినప్పుడు.. అది మీరు మోయగలిగే బరువు అయితేనే ఎత్తుకోండి. మోయలేరని తెలిసి కూడా ఎత్తుకుంటే.. కుప్పకూలి పోవాల్సి వస్తుంది. సో.. ఎదుటివారు అడిగింది మీరు చేయలేనిదని అనిపిస్తే.. "నా వల్ల కాదు" అని చెప్పండి. ఇందులో మొహమాటం అవసరం లేదు.

  • అయితే.. NO ఎలా చెప్తున్నారనేది ముఖ్యం. పలా కారణం వల్ల నేను ఈ పని చేయలేను. దయచేసి తప్పుగా అనుకోకండి అని చెప్పండి.
  • వాళ్లు నొచ్చుకుంటారేమో అని మిమ్మల్ని మీరు కోల్పోవాల్సిన అవసరం లేదు అంటున్నారు నిపుణులు.
  • మీ ఇబ్బందిని క్లియర్​గా చెప్తే.. ఎదుటి వాళ్లు తప్పకుండా అర్థం చేసుకునే అవకాశం ఉంది.
  • వారు చెప్పిన పని చేయకపోయినంత మాత్రాన వారి దృష్టిలో చెడ్డవారేమీ కారు. దానివల్ల మీ బంధానికి వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు. మంచి వారు అర్థం చేసుకుంటారు.
  • ఎదుటి వారు చెప్పిన పని మీకు నచ్చకపోతే కుదరదు అని నిర్మొహమాటంగా చెప్పండి.
  • వాళ్లు ఏమనుకుంటారో అన్నది మీ చేతుల్లో లేదు. వాళ్ల ఆలోచనలను మీరు నియంత్రించ లేరు. కాబట్టి.. వదిలేసి మీ పని మీరు చేసుకోండి.
  • నో చెప్పడం అంటే.. మీరేదో తప్పు చేస్తున్నట్టు బాధపడాల్సిన పనిలేదు. అపరాధ భావంతో వివరణలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న వాస్తవ పరిస్థితిని చెబుతున్నారంతే.
Last Updated :Mar 27, 2024, 5:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.