ETV Bharat / health

ఈ ఫుడ్స్​తో పోలిస్తే కోడిగుడ్డు నథింగ్ - ఫుల్​ ప్రొటీన్ - మీ కండరాలు యమా స్ట్రాంగ్ అవుతాయ్! - Best Muscle Building Foods

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 4, 2024, 1:34 PM IST

Best Muscle Building Foods
PROTEIN FOODS

Best Muscle Building Foods : మస్తు మజిల్స్​ పెంచి.. కండ బలాన్ని ప్రదర్శించాలని అందరూ కోరుకుంటారు. కానీ.. కొందరికి మాత్రమే అది సాధ్యమవుతుంది! ఎందుకంటే.. కండలు పెంచాలంటే కేవలం చెమట చిందిస్తే సరిపోదు.. మంచి ఫుడ్​ కూడా శరీరానికి ఎరువుగా వేయాలి. అప్పుడే కండలు రాటు దేలుతాయ్ అంటున్నారు నిపుణులు. ఇందుకోసమే.. కోడి గుడ్డుకన్నా ఎక్కువ ప్రొటీన్ లభించే ఫుడ్స్ గురించి సూచిస్తున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం.

Best Foods for Building Muscles : ప్రొటీన్ పుష్కలంగా ఉండే ఫుడ్స్​లో సోయాబీన్స్ ముందు వరుసలో ఉంటాయని చెప్పుకోవచ్చు. ఒక కప్పు వండిన సోయాబీన్స్​లో 28 గ్రాముల ప్రొటీన్ ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. సలాడ్​లు, స్నాక్స్​తో సహా అనేక రకాల వంటకాలను ప్రిపేర్ చేసుకోవడానికి సోయాబీన్స్ ఉపయోగించవచ్చు. అలాగే వీటిలో విటమిన్ కె, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

పప్పులు : వీటిలో కూడా ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. ఈ పప్పులు పరిమాణంలో చిన్నగా ఉన్నా పోషకాల పరంగా పెద్దమొత్తంలో కలిగి ఉంటాయి. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్​మెంట్ ఆఫ్ అగ్రికల్చర్(USDA) ప్రకారం.. వండిన ఒక కప్పు పప్పులో 18 గ్రాముల ప్రొటీన్‌ ఉంటుందట.

గుమ్మడికాయ గింజలు : ఈ గింజలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా వీటిలో ప్రొటీన్ కంటెంట్ సమృద్ధిగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ముప్పై గ్రాముల గుమ్మడికాయ గింజల నుంచి తొమ్మిది గ్రాముల ప్రొటీన్ లభిస్తుందని చెబుతున్నారు. అలాగే వీటిలో ఫైబర్‌, విటమిన్‌ ఏ, బీ, సీ, ఈ తోపాటు ఐరన్‌, కాల్షియం, జింక్, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి శక్తిని పెంచే ఖనిజాలు అధికమొత్తంలో ఉంటాయట.

పచ్చి బఠానీలు : దీనిలో కూడా ప్రొటీన్స్ ఎక్కువే. ఇవి తిన్నా కండరాలు బలంగా మారతాయంటున్నారు. 160 గ్రాములు ఉన్న ఒక కప్పు ఉడికించిన గ్రీన్​ పీస్​లో 8 గ్రాముల ప్రొటీన్ ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. అలాగే ఒక కప్పు పచ్చి బఠానీల నుంచి 9 గ్రాముల ఫైబర్ అందుతుంది. ఇది గుండె, జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

2020లో "అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్" అనే జర్నల్​లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. బరువు తగ్గడానికి, కండరాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులకు పచ్చి బఠానీలు మంచి ఎంపిక అని కనుగొంది. ఈ పరిశోధనలో న్యూయార్క్‌ కొలంబియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ ఆఫ్ న్యూట్రిషన్ డా. బ్రాడ్లీ స్టీవెన్స్ పాల్గొన్నారు. పచ్చి బఠానీలు తీసుకోవడం అందులోని మొక్కల ఆధారిత ప్రొటీన్ కండరాలను బలంగా మార్చుకోవడంలో చాలా బాగా సహాయపడుతుందని పేర్కొన్నారు.

ఇవి తింటే కరెంటు తీగలా సన్నగా మారిపోతారు! - ఏ ఆరోగ్య సమస్యా రాదు! - Low Calories Foods

గ్రీక్ యోగర్ట్ : ఇందులో ప్రోబయోటిక్స్​ నిండి ఉంటాయి. ముఖ్యంగా గ్రీకు యోగర్ట్​లో ప్రొటీన్లు, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో తయారుచేసుకునే పెరుగులో ఉండే ప్రొటీన్ కంటెంట్ కంటే దీనిలో రెండింతలు ఎక్కువగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. 170 గ్రాముల గ్రీక్ యోగర్ట్​లో 17 గ్రాముల ప్రొటీన్ ఉంటుందట.

చియా విత్తనాలు : చియా విత్తనాలలో ప్రొటీన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. 2 టేబుల్ స్పూన్ల చియా విత్తనాలలో సుమారు 5 గ్రాముల ప్రొటీన్ ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అదనంగా.. వీటిలో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ (ALA), ఫైబర్, కాల్షియం, ఐరన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయంటున్నారు నిపుణులు.

క్వినోవా : ఇది కూడా ఒక మంచి ప్రొటీన్ కంటెంట్ ఫుడ్. 185 గ్రాముల ఒక కప్పు ఉడికించిన క్వినోవాలో 8 గ్రాముల ప్రొటీన్ ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండేది పూర్తిగా మొక్కల ఆధారిత ప్రొటీన్. దీనిలో మన శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. అలాగే క్వినోవాలో ఫైబర్, ఐరన్, మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

డైలీ చిన్న ఎండు కొబ్బరి ముక్క తినండి - క్యాన్సర్, గుండె జబ్బులే కాదు ఈ సమస్యలూ మీ దరిచేరవు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.