ETV Bharat / business

క్వైట్ ఫైరింగ్ - ఉద్యోగులను పొమ్మనలేక, పొగపెడుతున్న కంపెనీలు! - What Is Quiet Firing

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 22, 2024, 4:07 PM IST

What Is Quiet hiring
What Is Quiet Firing

What Is Quiet Firing : 'పొమ్మనకుండా పొగబెట్టడం' - ఈ సామెత తెలిసే ఉంటుంది. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు విధానాన్నే అనుసరిస్తున్నాయి. ఉద్యోగులను పొమ్మనలేక, పొగపెడుతున్నాయి. మరో విధంగా చెప్పాలంటే క్వైట్ ఫైరింగ్​ చేస్తున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం.

What Is Quiet Firing : ఉద్యోగులు తమ యజమానుల దృష్టిలో పడాలని, తమ పనిని అందరూ మెచ్చుకోవాలని, నిద్రహారాలు మరిచి కష్టపడి పని చేస్తుంటారు. కానీ ఇప్పుడు అవన్నీ మర్చిపోవాల్సిందే. మీ కృషికి ప్రసంశలు పొందడమనే విషయం గురించి మర్చిపోండి. ఇప్పుడు పలు బడా కంపెనీలు తమ ఉద్యోగుల కృషిని గుర్తించడం లేదు సరికదా, తిరిగి వారిని సైలెంట్​గా తొలగించేందుకు లోపాయికారీ విధానాలను అనుసరిస్తున్నాయి. ముఖ్యంగా క్వైట్​ ఫైరింగ్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. టెక్ రంగంలో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. ఆర్థిక అనిశ్చితులతో పాటు సాంకేతికంగా వచ్చిన అనేక మార్పులే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు.

క్వైట్ ఫైరింగ్ అంటే ఏమిటి?
ప్రస్తుతం చాలా బడా కంపెనీలు ఉద్యోగులను తీసివేసే విషయంలో పలు పద్ధతులను అనుసరిస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఉద్యోగులను నేరుగా తొలగిస్తుంటే, మరికొన్ని కంపెనీలు పరోక్షంగా ఉద్యోగులను వారికి వారే వైదొలిగేలా చేస్తున్నాయి. ఎలా అంటే, మీరు ఎంత కష్టపడి పనిచేసినా మీ కష్టాన్ని సంస్థ గుర్తించకపోవడం, మీ బాస్ లేదా టీమ్ లీడర్ మీ పట్ల దారుణమైన వైఖరి ప్రదర్శిస్తుంటారు. ఇది మిమ్మల్ని మరింత మానసిక ఒత్తిడికి గురిచేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మీరు జాబ్ మానేయ్యాలనే నిర్ణయానికి వస్తారు. ఇదే క్వైట్ ఫైరింగ్. అంటే పొమ్మనకుండా పొగబెడుతున్నాయి.

ఇంకా క్లియర్​గా చెప్పాలంటే, ఉద్యోగులను తొలించాలనుకున్నప్పుడు కంపెనీలు వారిని బాగా ఇబ్బందులకు గురిచేస్తాయి. నేరుగా పొమ్మని చెప్పలేక ఇలాంటి పద్దతులను అవలంభిస్తాయి. వసతులను తగ్గించడం, పనిలో ప్రాధాన్యం లేకుండా చేయడం, అధికంగా పనిభారం మోపడం, పనిగంటలు పెంచడం, ఏమాత్రం అవగాహనలేని పనిని అప్పగించడం లాంటివి చేస్తుంటారు. ఫలితంగా ఉద్యోగికి చికాకు, విసుగు వస్తుంది. దీంతో మానసికంగా ఒత్తిడికి లోనై ఉద్యోగం మానేసి వెళ్లాలనే పరిస్థితికి వస్తాడు. అలాంటి పరిస్థితులు కల్పించడమే క్వైట్ ఫైరింగ్.

ఒక్కోసారి ఉద్యోగులు చేసే ప్రతి పనిని బాస్​లు కానీ, టీమ్ లీడర్స్ కానీ విమర్శిస్తూనే ఉంటారు. ఉద్యోగులు చేస్తున్న ప్రతిపైనా నిఘా పెడతారు. ఏమాత్రం పొరపాటు చేసినా, పై అధికారులు స్పందించే తీరు చాలా కఠినంగా ఉంటుంది. ఉద్యోగులు సంఖ్యను ఎలాగైనా తగ్గించాలని కంపెనీ నుంచి వచ్చే ఒత్తిడి మేరకే ఇలాంటి చర్యలు చేపడుతుంటారు.

ఇదంతా ఎందుకు?
కంపెనీలు నష్టాల్లో కూరుకుపోయి ఉద్యోగులను తగ్గించుకోవాలని ప్లాన్ చేసుకున్నప్పుడు ఇలాంటి పద్దతులను అనుసరిస్తుంటాయి. అయితే నేరుగా లేఆఫ్ చేసే అవకాశం ఉంటుంది కదా? మరి ఈ క్వైట్ ఫైరింగ్ ఎందుకనే అనుమానం రావచ్చు. అలా చేయడానికి కొన్ని నిబంధనలు అడ్డువస్తాయి. నేరుగా ఉద్యోగిని తొలగిస్తే, కొన్ని రకాల పరిహారాలు చెల్లించాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఉన్న బకాయిలు మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. లీవ్స్, ఇంక్రీమెంట్స్ ఏమైనా మిగిలిపోయి ఉంటే వాటిని క్లెయిమ్స్ చేసుకునే హక్కు ఉద్యోగికి ఉంటుంది. లీగల్ గానూ సవాళ్లు ఎదురయ్యే ఛాన్స్ ఉంటుంది. వీటన్నింటి నుంచి తప్పించుకునేందుకు కంపెనీలు ఈ క్వైట్ ఫైరింగ్ పద్దతిని అనుసరిస్తాయి.

ఎలా గుర్తించాలి?
కొన్ని సంకేతాలను బట్టి ఒక ఉద్యోగి తనపై క్వైట్ ఫైరింగ్ జరుగుతుందని గుర్తించవచ్చు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఆపడం, పనిభారం పెంచడం, పనివేళ్లలో మార్పులు చేయడం, వసతులను తగ్గించడం, ప్రోత్సాహకాలను కుదించడం, బోనస్​లు ఆపేయడం, ఫీడ్ బ్యాక్ తీసుకోకపోవడం, కీలక నిర్ణయాల్లో భాగస్వాములు చేయకపోవడం, సెలవులు నిరాకరించడం - ఇలాంటి సంకేతాలన్నీ క్వైట్ ఫైరింగ్ జరుగుతుందని సూచించే సంకేతాలు.

తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు:
పైన పేర్కొన్న కొన్ని విషయాలను మీరు గుర్తించినంత మాత్రాన, కంపెనీ మిమ్మల్ని వదిలించుకునేందుకు ప్రయత్నిస్తుందన్న అభిప్రాయానికి రాకూడదు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఒకసారి మిమ్మల్ని మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. మీలో ఏమైనా లోపాలు ఉంటే సరిచేసుకోండి. మీ బాస్​తో మాట్లాడండి. సంస్థకు మీరొక అసెట్​గా మారేందుకు ప్రయత్నించండి. మీ వైపు ఎలాంటి పొరపాటు లేదని గుర్తిస్తే మాత్రం వెంటనే అప్రమత్తంగా ఉండేందుకు ప్రయత్నించడం మేలు. నిజానికి క్వైట్ ఫైరింగ్ అనేది కొత్త కాన్సెప్ట్ ఏమీ ఉండదు. ఇలాంటి పద్ధతులను ఎప్పటి నుంచో రహస్యంగా అమలు చేస్తూనే ఉన్నారు. కానీ ఈ మధ్య తొలగింపులు పెరగడం, దానికి తోడు కార్పొరేట్ కల్చర్​లో కొత్త ధోరణులు తోడవ్వడం వల్ల ఈ ట్రెండ్ మళ్లీ ప్రాచుర్యంలోకి వచ్చింది. అంతర్జాతీయ స్థాయి బడా సంస్థలు కూడా ఈ తరహా విధానాలను అలంభిస్తున్నాయని కొన్ని ప్రముఖ సర్వేలు వెల్లడిస్తున్నాయి.

క్వైట్ హైరింగ్ కూడా ఉంది :
క్వైట్ ఫైరింగ్ తరహాలోనే క్వైట్ హైరింగ్ అనే ట్రెండ్ కూడా ఆ మధ్య వెలుగులోకి వచ్చింది. కొత్త వారిని నియమించుకోకుండానే, కంపెనీలో ఉన్న, తమకు కావాల్సిన నైపుణ్యాలున్న వ్యక్తిని కనిపెట్టడానికి క్వైట్ హైరింగ్​ పద్ధతిని అనుసరిస్తున్నారు. సంస్థలోనే అంతర్గతంగా, ఇతర విభాగాల్లో ఉండే ఉద్యోగులను, ఖాళీగా ఉన్న స్థానాల్లో భర్తీచేయడమే క్వైట్ హైరింగ్​. ఉద్యోగుల కొరత ఉండి, టార్గెట్స్ అందుకునేందుకు గడువు సమీపిస్తున్న సమయంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

IPL మ్యాచ్ పవర్ ప్లే, స్ట్రాటెజిక్ టైమౌట్​- క్రికెట్ నేర్పే బిజినెస్​ పాఠాలివే! - Best Financial Lessons

బెస్ట్​ స్పోర్ట్స్​ బైక్​ కొనాలా? టాప్​-5 ఆప్షన్స్​ ఇవే? - Best Sports Bikes

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.