ETV Bharat / business

స్టాక్​ మార్కెట్లో లాభాలు సంపాదించాలా? వారెన్ బఫెట్ చెప్పిన ఈ 5 టిప్స్​ పాటించండి!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 13, 2024, 11:48 AM IST

Warren Buffett Investment Tips : మీరు భవిష్యత్ కోసం పెట్టుబడులు పెడదామని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడిదారుడు వారెన్ బఫెట్ చెప్పిన 5 ప్రధానమైన పెట్టుబడి సూత్రాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

warren buffett stock market tips
warren buffett investment tips

Warren Buffett Investment Tips : స్టాక్​ మార్కెట్లో వారెన్ బఫెట్ గురించి తెలియనివారు ఉండరంటే అది అతిశయోక్తి కాదు. అత్యంత విజయవంతమైన, గొప్ప పెట్టుబడిదారుడు అతను. పెట్టుబడులు పెట్టి, గొప్ప సంపదను సృష్టించాలని ఆశించే ప్రతి ఒక్కరికీ ఆయన ఆదర్శప్రాయం. అందుకే 93 ఏళ్ల వారెన్ బఫెట్ చెప్పిన 5 ప్రధానమైన పెట్టుబడి సూత్రాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. అవగాహన లేకుండా పెట్టుబడులు పెట్టకూడదు : అవగాహన లేని రంగాల్లో పెట్టుబడులు పెట్టడం పెద్ద రిస్క్ అవుతుందని వారెన్ బఫెట్ హెచ్చరిస్తూ ఉంటారు. నేడు చాలా మంది సరైన పరిజ్ఞానం లేకుండానే స్టాక్ మార్కెట్, క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ చేస్తున్నారు. దీనివల్ల భారీగా నష్టపోతున్నారు. అందుకే మనకు అర్థంకానీ వాటిలో, మనకు అనుభవం లేని వాటిలో పెట్టుబడులు పెట్టకూడదు.

చాలా మంది మంచి భూమ్​లో ఉన్న స్టాక్​లను కొనేస్తూ ఉంటారు. కానీ దాని ఫండమెంటల్స్ గురించి తెలుసుకోరు. టెక్నికల్ అనాలసిస్ చేయరు. పైగా ఎవరో చెప్పిన మాట విని, ఇన్వెస్ట్ చేసి, తరువాత భారీగా నష్టపోతుంటారు. కనుక మీరు ఏ రంగంలో పెట్టుబడులు పెట్టినా, దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అవసరమైతే నిపుణుల సలహాలు తీసుకోవాలి. వారెన్ బఫెట్ కూడా అదే చేస్తారు.

ఉదాహరణకు, 2016 వరకు వారెన్ బఫెట్​ టెక్​ స్టాక్స్​లో ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదు. ఎందుకంటే ఆయనకు టెక్నాలజీ గురించిగానీ, టెక్​ బిజినెస్​ గురించి గానీ ఏమీ తెలియదు. ఆ తరువాత వాటి గురించి ఆయన పూర్తిగా తెలుసుకున్నారు. ఇలాన అన్ని వివరాలు తెలుసుకున్నాకనే, ఆయన యాపిల్​ కంపెనీ స్టాక్స్ కొనుగోలు చేశారు. ఈ విధంగా మీరు కూడా పూర్తి అధ్యయనం చేసిన తరువాత మాత్రమే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలి.

2. భయం - అత్యాశ వద్దు!
స్టాక్​ మార్కెట్లో చాలా మంది అత్యాశాపరులు ఉంటారు. మరికొందరు మార్కెట్లో ఓ మాత్రం ఒడుదొడుకులు వచ్చినా భయపడిపోతుంటారు. ఈ రెండూ సరైనవి కావని వారెన్ బఫెట్ చెబుతుంటారు.

'మార్కెట్లో అందరూ అత్యాశతో ఉన్నప్పుడు మీరు పెట్టుబడి పెట్టడానికి భయపడాలి. అందరూ భయపడుతూ ఉన్నప్పుడు మీరు ధైర్యంగా, తెలివిగా పెట్టుబడులు పెట్టాలి' అని వారెన్ బఫెట్​ సూచిస్తుంటారు.

ఉదాహరణకు, 2008లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడింది. దీనితో చాలా మంది భయపడి తమ స్టాక్​లను అమ్మేశారు. దీనితో బ్లూ-చిప్ స్టాక్స్ అన్నీ చాలా తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చాయి. ఈ అవకాశాన్ని వారెన్ బఫెట్ సద్వినియోగం చేసుకున్నారు. తక్కువ ధరలో లభిస్తున్న బ్లూచిప్ స్టాక్స్​ను భారీ సంఖ్యలో కొనుగోలు చేశారు. ఆర్థిక మాంద్యం తగ్గిన తరువాత (2013లో) ఇవే ఆయనకు భారీ లాభాలను ఆర్జించిపెట్టాయి. ఒక అంచనా ప్రకారం ఆయన ఏకంగా 10 బిలియన్ డాలర్లు(రూ.83 వేల కోట్ల)కు పైగా లాభం సంపాదించారు.

చాలా మంది బాగా లాభాల్లో ఉన్న స్టాక్స్​ను కొనుగోలు చేస్తుంటారు. మరికొందరు అందరూ కొంటున్న స్టాక్స్​ను కొంటుంటూరు. నిజానికి వాటి గురించి ఏమాత్రం అవగాహన లేకపోయినా, అత్యాశతో అత్యధిక ధరల వద్ద కొంటారు. తరువాత నష్టపోయి బాధపడతారు. కనుక పెట్టుబడుల విషయంలో అత్యాశ పనికిరాదు.

3. మీకంటూ ఒక రోజు వస్తుంది!
స్టాక్​ మార్కెట్లో ఒడుదొడుకులు సహజం. కనుక మీదైన సమయం కోసం వేచి చూడాలి. అప్పటి వరకు మీ డబ్బులను జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి. చాలా మంది స్టాక్స్​ బాగా లాభాల్లో ఉన్నప్పుడు వాటిని కొంటారు. కానీ ఇది సరైన విధానం కాదు. మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నప్పుడు, చాలా మంది భయపడి ఫండమెంటల్స్ బాగా ఉన్న బ్లూచిప్ స్టాక్స్​ను కూడా అమ్మేస్తుంటారు. అలాంటప్పుడు అవి చాలా తక్కువ ధరకే లభిస్తాయి. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, మీరు దాచుకున్న సొమ్ముతో వాటిని పెద్ద సంఖ్యలో కొనేయాలి. మార్కెట్లు మళ్లీ పుంజుకున్నప్పుడు ఇవే మీకు సిరులు కురిపిస్తాయి.

దీనికో పెట్టుబడి పాఠం కూడా ఉంది. మీ దగ్గర ఎక్కువ నిమ్మకాయలు ఉన్నాయని అనుకోండి. వాటిన్నింటినీ పిండి నిమ్మరసం తాగేయకండి. కొన్ని నిమ్మకాయలతో జామ్​, మరికొన్నింటితో ఊరగాయ తయారు చేసుకోండి. మిగిలిన వాటిని మార్కెట్లో అమ్మేయండి. దీని వల్ల మీకు వర్తమానంలో లాభం వస్తుంది. అన్​సీజన్​లోనూ మంచి రాబడి వస్తుంది.

4. చీప్ కంపెనీ స్టాక్స్ కొనకండి!
అద్భుతమైన ధరకు సరమైన కంపెనీ స్టాక్ కొనుగోలు చేయడం కంటే, తక్కువ ధరకు మంచి కంపెనీ స్టాక్స్ కొనుగోలు చేయడం చాలా మంచిదని వారెన్ బఫెట్ సూచించారు.

వారెన్ బఫెట్ గురువు, వాల్యూ ఇన్వెస్టింగ్ పితామహుడు అయిన బెంజిమిన్​ గ్రాహం ప్రకారం, 'చీప్​ కంపెనీ స్టాక్స్ ఎప్పుడూ కొనకూడదు. దీని వల్ల భవిష్యత్​లో గొప్ప రాబడులు ఏవీ రావు'. దీనినే వారెన్ బఫెట్​ కూడా పాటిస్తున్నారు.

5. అప్పు చేసి పెట్టుబడులు పెట్టవద్దు!
చాలా మంది అప్పులు చేసిమరీ స్టాక్​ మార్కెట్లో పెట్టుబడులు పెడుతుంటారు. ఇది ఏ మాత్రం మంచిది కాదని వారెన్ బఫెట్ హెచ్చరించారు. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో తీవ్రమైన ఒడుదొడుకులు సహజం. అందువల్ల అప్పు చేసి షేర్స్ కొంటే, మొత్తానికే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఇది జీవితాలను నాశనం చేస్తుంది.

ఈ పోస్టాఫీస్ స్కీమ్​లో ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బులు డబుల్​!

రూ.1 లక్ష బడ్జెట్లో మంచి స్కూటీ కొనాలా? అయితే ఈ టాప్​-10 మోడల్స్​పై ఓ లుక్కేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.