ETV Bharat / business

మ్యూచువల్ ఫండ్ SIP​తో ఇన్వెస్ట్ చేయాలా? ఇవి తెలుసుకోండి! - Sip Investment Tips In Telugu

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 7, 2024, 5:57 PM IST

mutual fund sip plans in telugu
Sip Investment Tips In Telugu

Sip Investment Tips In Telugu : మీరు మ్యూచువల్​ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అదీ సిప్​ ద్వారా తక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నారా? అయితే ఇన్వెస్ట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం.

Sip Investment Tips In Telugu : స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గరిష్ఠ స్థాయికి చేరుతుండటం వల్ల ఇటీవల కాలంలో ఇందులో మదుపు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. మూడేళ్లుగా ఈక్విటీల్లోకి వస్తున్న పెట్టుబడులే ఇందుకు నిదర్శనం. నేరుగా షేర్లలో పెట్టుబడి పెట్టడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అందుకు ప్రత్యామ్నాయంగా మ్యూచువల్‌ ఫండ్లను ఎంచుకుంటే మంచిది. ఎందుకంటే నష్టభయం కూడా తక్కువగా ఉంటుంది. దీర్ఘకాలంలో సంపద సృష్టికి ఇవి ఒక మంచి మార్గమని ఉంటాయని చెప్పొచ్చు. క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌) ద్వారా తక్కువ మొత్తంతో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికీ ఇవి ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో సిప్‌ చేయాలనుకునే వారు పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలను తెలుసుకుందాం.

ఒకేసారి పెట్టుబడి పెట్టడం వల్ల మార్కెట్‌ హెచ్చుతగ్గుల వల్ల నష్టభయం ఉండొచ్చు. ఇందుకు భిన్నంగా నెలనెలా కొంత మొత్తాన్ని మదుపు చేస్తూ వెళ్లడం ద్వారా మార్కెట్‌ హెచ్చుతగ్గుల నుంచి సగటు ప్రయోజనాన్ని అందుకోవచ్చు. ఈ సూత్రం ఆధారంగానే సిప్‌ పనిచేస్తుంది. ముందు కొద్ది మొత్తంతో ప్రారంభించి, కాలం గడుస్తున్న కొద్దీ పెట్టుబడి మొత్తాన్ని పెంచుకోవచ్చు. తక్కువ నష్టభయంతో దీర్ఘకాలంలో అధిక మొత్తాన్ని జమ చేసేందుకు ఈ మార్గం ఉపయోగపడుతుంది. ఆదాయం, ఆర్థిక లక్ష్యాల ఆధారంగా మీరు అనుకున్నంత కాలంతో పాటు ప్రతి వారం, నెల, త్రైమాసికం లేదా ఆరు నెలలకోసారి నిర్ణీత మొత్తాన్ని మదుపు చేయొచ్చు.

ఆర్థిక లక్ష్యాల ఆధారంగా సిప్​ ఖాతాలు
సిప్‌ ప్రారంభించడానికి ముందు దీర్ఘకాలమా, స్వల్పకాలమా అనే స్పష్టత ఉండాలి. ఈ పెట్టుబడి ద్వారా మీరు ఏ లక్ష్యాన్ని సాధించాలని అనుకుంటున్నారు అనేది గుర్తించడం చాలా ముఖ్యం. ఇలా అన్ని లెక్కలు వేసుకున్నప్పుడే మీకు కావాల్సిన నిధి, పెట్టుబడి పెట్టాల్సిన మొత్తం, వ్యవధి విషయాల్లో కొంత అవగాహన వస్తుంది. కారు కొనడం, ఇల్లు కట్టడం, పిల్లల చదువులు, వివాహం మొదలైన ఆర్థిక లక్ష్యాలు ఉంటాయి. వీటిని సాధించేందుకు ఒకటే సిప్‌ సరిపోకపోవచ్చు. కాబట్టి, ఆర్థిక లక్ష్యాల సంఖ్యపై ఆధారపడి, మీ లక్ష్యాలను తీర్చుకునేందుకు ప్రతిదానికో ప్రత్యేక సిప్‌ను ప్రారంభించడం మంచిది.

పెరిగే ఖర్చులను తట్టుకునేలా ప్లాన్
ధరలు ఎప్పటికప్పుడు పెరిగిపోతున్నాయి. ఇలా పెరగడమే ద్రవ్యోల్బణం అంటారు. సగటున 6-7 శాతం వరకూ ఇది ఉంటోంది. పెట్టుబడి పెట్టేటప్పుడు ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు. సిప్‌ను ఎంచుకునేటప్పుడు ఇప్పటికే ఉన్న ద్రవ్యోల్బణంతోపాటు, రానున్న రోజుల్లో ఏ మేరకు ఉంటుందో తప్పనిసరిగా పరిశీలించాలి. మీరు ఇప్పుడు పెట్టుబడి పెట్టే లక్ష్యాలు భవిష్యత్‌లో మారిపోవచ్చు. అనుకోకుండా మీ అవసరాలను తీర్చేందుకు అధిక మొత్తంలో డబ్బు అవసరం కావచ్చు. చాలామంది అనేక పెట్టుబడి పథకాల్లో మదుపు చేస్తుంటారు. కానీ, లక్ష్య సాధనకు కావాల్సిన మొత్తం వారికి అందకపోవడం కనిపిస్తుంది. పెట్టుబడి వ్యవధిలో ద్రవ్యోల్బణాన్ని అంచనా వేయకపోవడం వల్లే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. అందుకే ఇలాంటి పొరపాటు అసలు చేయొద్దు. ఆర్థిక లక్ష్యం చేరుకునే నాటికి ఎంత మేరకు ద్రవ్యోల్బణం ఉంటుంది, దానివల్ల ఎంత అధికంగా కావాల్సి వస్తుందన్న లెక్కలు వేసుకోవాలి. దానికి అనుగుణంగా సిప్‌ మొత్తాన్ని నిర్ణయించుకోవాలి.

అనువైన పథకంలో పెట్టుబడి
మార్కెట్లో ఎన్నో మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఈక్విటీ, డెట్‌, హైబ్రిడ్‌ ఇలా రకరకాల విభాగాలూ ఉన్నాయి. మీ నష్టభయం భరించే సామర్థ్యం, రాబడి అంచనాలు, ఆర్థిక లక్ష్యాలు, వ్యవధి ఇలా పలు అంశాలను పరిశీలించాకే తగిన మ్యూచువల్‌ ఫండ్‌ను ఎంచుకోవాలి. ఉదాహరణకు నష్టం వచ్చినా ఇబ్బంది లేదు, అధిక రాబడిని వస్తే చాలని అనుకుంటే మాత్రం దీర్ఘకాలిక వ్యవధికి ఈక్విటీ పెట్టుబడులను ఎంచుకోవచ్చు. తక్కువ నష్టభయం ఉండాలి అనుకుంటే డెట్‌ పథకాలు అందుబాటులో ఉంటాయి. కాస్త మధ్యస్థంగా నష్టభయం ఉండాలి అనుకున్నప్పుడు హైబ్రిడ్‌ ఫండ్లు ఎంచుకోవాలి.

సరైన పథకం, మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీ రెండు చాలా ముఖ్యం. మార్కెట్లో అనేక మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీలు విభిన్నమైన పెట్టుబడి పథకాలను అందిస్తున్నాయి. అన్ని పథకాలకూ ఆకర్షణీయమైన రాబడిని అందించే సామర్థ్యం ఉండకపోవచ్చు. సరైన మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీని ఎంచుకునేందుకు కంపెనీ చరిత్ర, పెట్టుబడి వ్యయం, పథకం గత పనితీరు, అధిక రాబడిని సాధించగల ఫండ్‌ మేనేజర్‌ సామర్థ్యం మొదలైన అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి.

పలు విధాలుగా పెట్టుబడి
పెట్టుబడుల్లో వైవిధ్యం ఉండేలా చూసుకోవడం ఎప్పుడూ మంచి మదుపు వ్యూహం. నష్టభయం భరించే సామర్థ్యం, రాబడి అంచనాల ప్రకారం పలు రకాల పథకాలను ఎంచుకోవాలి. వయసు, ఆర్థిక బాధ్యతలు, పెట్టుబడి వ్యవధి, ఆదాయం, బాధ్యతలు తదితర అంశాలు పెట్టుబడిదారుడి నష్టభయాన్ని ప్రభావితం చేస్తాయి. వైవిధ్యమైన పెట్టుబడులు నష్టాలను తగ్గించడంలో సహాయం చేస్తాయి. ఈ వైవిధ్యం సాధించేందుకు రకరకాల పథకాలు, ఫండ్‌ కంపెనీలలో మీ పెట్టుబడులు ఉండేలా చూసుకోవాలి. అదే సమయంలో మితిమీరిన వైవిధ్యం పెట్టుబడులపై రాబడిని తగ్గిస్తుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

చెక్​ చేస్తూ ఉండాలి
మదుపు చేస్తూ ఉండటం, మర్చిపోవడం సంపద సృష్టికి ఇది ఒక మార్గం. అంతమాత్రాన ఆ పథకాలను పూర్తిగా పట్టించుకోకుండా ఉండాలని కాదు. మీ పెట్టుబడి పనితీరును క్రమం తప్పకుండా సమీక్షిస్తూ ఉండాలి. ఒక్కోసారి ఆ పథకం పనితీరు అంతగా బాగుండకపోవచ్చు. పెట్టుబడిని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుంటేనే ఈ విషయాన్ని తెలుసుకునేందుకు వీలవుతుంది. ఆశించిన రాబడి వస్తేనే లక్ష్యాలను సాధించగలం. పనితీరు బాగాలేని పథకాల నుంచి పెట్టుబడి పెడితే, వాటని వెనక్కి తీసుకోవాలి. మెరుగైన రాబడి అవకాశాలను అందించే పథకాల్లోకి మార్చుకోవాలి. సిప్‌ దీర్ఘకాలంలో రూపాయి సగటు ప్రయోజనాన్ని అనుమతిస్తుంది. కాబట్టి, మీరు ఎంత ఎక్కువ కాలం మార్కెట్లో కొనసాగితే అంత లాభాన్ని అందుకునేందుకు వీలవుతుంది.

సొంతంగా వ్యాపారం చేయాలా? మీకు సూట్​ అయ్యే లోన్​ ఇదే! - Types Of Business Loans In India

గవర్నమెంట్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయాలా? ఈ స్కీమ్ గురించి తెలుసుకోండి! - RBI Retail Direct Scheme

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.