ETV Bharat / bharat

సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు బ్రెయిన్‌ సర్జరీ- ఫోన్​ చేసి ప్రధాని మోదీ పరామర్శ

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 20, 2024, 7:40 PM IST

Updated : Mar 20, 2024, 10:12 PM IST

Sadhguru Brain Surgery
Sadhguru Brain Surgery

Sadhguru Brain Surgery : ఇషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైనట్లు దిల్లీ అపోలో వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యంతో కోలుకుంటున్నారని వెల్లడించారు. మరోవైపు, సద్గురుకు ప్రధాని మోదీ ఫోన్ చేసి పరామర్శించారు.

Sadhguru Brain Surgery : ప్రముఖ ఆధ్యాత్మిక గురు, ఇషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు జగ్గీ వాసుదేవ్‌ మెదడు శస్త్రచికిత్స విజయవంతమైంది. ఈ విషయాన్ని దిల్లీ అపోలో వైద్యులు ప్రకటించారు. మెదడులో భారీగా వాపు రావటం సహా తీవ్ర రక్తస్రావం కావటం వల్ల అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఆయన కోలుకుంటున్నట్లు వెల్లడించారు.

ఈనెల 17వ తేదీన జగ్గీ వాసుదేవ్‌కు మెదడు శస్త్రచికిత్స నిర్వహించినట్లు దిల్లీ అపోలో న్యూరాలజిస్ట్ డాక్టర్ వినిత్ సూరి తెలిపారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు చెప్పారు. సద్గురు ఆరోగ్య పరిస్థితి వైద్యుల అంచనాలకు మించి మెరుగుపడుతుందని చెప్పారు. ఈ మేరకు సద్గురు శస్త్ర చికిత్సకు సంబంధించి వినిత్ సూరి మాట్లాడిన వీడియోను అపోలో సంస్థ షేర్ చేసింది.

వైద్యుల సమాచారం ప్రకారం, జగ్గీ వాసుదేవ్‌ గత నాలుగు వారాలుగా తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నారు. నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ ఆయన రోజువారీ సామాజిక కార్యకలాపాలను కొనసాగించారు. మార్చి 8వ తేదీన ఉత్సాహంగా మహా శివరాత్రి కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. మార్చి 15 నాటికి తలనొప్పి మరింత తీవ్రమైంది. అప్పుడు ఆయన అపోలో ఆస్పత్రి సీనియర్ కన్సల్టెంట్, న్యూరాలజిస్ట్ డాక్టర్ వినిత్​ సూరిని ఫోన్‌లో సంప్రదించారు. ఆయన వెంటనే MRI స్కాన్ చేయించుకోమని సలహా ఇచ్చారు. స్కానింగ్​లో జగ్గీ మెదడులో రక్తస్రావం అయినట్లు వెల్లడైంది.

మందులను వాడుతూ, నొప్పితోనే మార్చి 15,16 తేదీల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత సీటీ స్కాన్ తీయగా మెదడు వాపు మరింత ఎక్కువైనట్లు నిర్ధరణ అయింది. దీంతో వెంటనే శస్త్ర చికిత్స చేయాలని నిర్ణయించారు వైద్యులు. ఆదివారం ఉదయం ఆస్పత్రిలో చేరారు సద్గురు. డాక్టర్ వినిత్ సూరి, డాక్టర్ ప్రణవ్ కుమార్, డాక్టర్ సుధీర్ త్యాగి, డాక్టర్ ఎస్ ఛటర్జీ బృందం మార్చి 17వ తేదీన ఆయనకు అత్యవసర మెదడు శస్త్రచికిత్స చేసింది. ప్రస్తుతం సద్గురు కోలుకుంటున్నారు.

తన కపాలాన్ని కోసి!
మరోవైపు శస్త్రచికిత్స తర్వాత జగ్గీ వాసుదేవ్‌ మాట్లాడిన ఓ వీడియోను ఇషా ఫౌండేషన్‌ విడుదల చేసింది. అపోలో ఆస్పత్రి న్యూరోసర్జన్లు తన కపాలాన్ని కోసి, ఏదో గుర్తించేందుకు ప్రయత్నించారని తెలిపారు. కానీ వారికి ఏమీ దొరకలేదని, మొత్తం ఖాళీగా ఉందన్నారు. ఆ తర్వాత తన తలకు ప్యాచ్‌ వేశారని జగ్గీ వాసుదేవ్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్యాచ్‌ వేసిన కపాలంతో దిల్లీలో ఉన్నట్లు పేర్కొన్న ఆయన, తన మెదడుకు ఎలాంటి డ్యామేజీ కాలేదన్నారు.

జగ్గీ వాసుదేవ్‌తో మాట్లాడిన ప్రధాని మోదీ
జగ్గీ వాసుదేవ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌ చేశారు. ఆయనతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని ప్రధాని తన ఎక్స్‌ ఖాతాలో వెల్లడించారు. జగ్గీవాసుదేవ్‌ ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్టు పెట్టారు.

ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు- హాజరైన ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌

గోమాతలకు అండగా.. రైతున్నలకు తోడుగా @ సమర్థ కామధేను గోశాల

Last Updated :Mar 20, 2024, 10:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.