ETV Bharat / bharat

వందేభారత్ స్థాయిలో రైలు బోగీలు- పెరగనున్న ఛార్జీలు! జనరల్​ కోచ్​ల పరిస్థితేంటి?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 1, 2024, 7:31 PM IST

Rail Coaches Convert Into Vande Bharat Standards : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్​లో రైల్వే శాఖకు సంబంధించి కీలక నిర్ణయాలు ప్రకటించారు. 40 వేల బోగీలను వందేభారత్​ ప్రమాణాలకు అనుగుణంగా మార్చేందుకు నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయం వల్ల సాధారణ ప్రజలకు కలిగే ప్రయోజనాలేమిటి? పేద, మధ్యతరగతి వారికి ఏమైనా ఇబ్బందుల ఎదురువతాయా?

Rail Bogies Convert Into Vande Bharat Standards
Rail Bogies Convert Into Vande Bharat Standards

Rail Coaches Convert Into Vande Bharat Standards : సార్వత్రిక ఎన్నికలకు ముందు 2024-25 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్​ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్​లో ప్రవేశపెట్టారు. ఇందులో రైల్వే శాఖకు రూ.2.55 లక్షల కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా రైల్వే వ్యవస్థను మెరుగుపరిచేందుకు, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు 40 వేల సాధారణ బోగీలను వందే భారత్​ ప్రమాణాలకు అనుగుణంగా మార్చనున్నట్లు ప్రకటించారు

ప్రయాణికులకు సురక్షితమైన రైలు సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని గతంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా వందేభారత్​ వంటి సెమీ-హైస్పీడ్ రైళ్లను ఇప్పటికే రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. విడతల వారికి వీటిని దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న బోగీలను వందేభారత్​ ప్రమాణాలకు అనుగుణంగా మార్చడం వల్ల సాధారణ ప్రయాణికులకు కలిగే ప్రయోజనాలేమిటి? ఈ నిర్ణయం వల్ల పేద, మధ్యతరగతి వారికి ఇబ్బందులు వస్తాయా?

సురక్షిత ప్రయాణం
వందేభారత్​ సెమీ-హైస్పీడ్​ రైళ్లలో ప్రపంచ స్థాయి సౌకర్యాలను కల్పించారు. ప్రభుత్వం చెప్పినట్లు ఆ స్థాయిలో సాధారణ బోగీలను మార్చితే, ప్రజలు సౌకర్యంగా ప్రయాణాలు చేయగలుగుతారు. ప్రస్తుతం ఉన్న బోగీలతో పోల్చితే ప్రయాణికులు మరింత సురక్షితంగా తమ గమ్య స్థానాలకు చేరవచ్చు.

మెరుగైన ప్రయాణ అనుభూతి
వందేభారత్ వంటి బోగీల్లో అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి. వీటిలో సీట్ల కింద మొబైల్‌ ఛార్జింగ్‌ పాయింట్లు ఉంటాయి. టాయిలెట్​లో లైటింగ్‌ను మెరుగుపరిచారు. అంతేకాకుండా వాష్‌ బేషిన్‌ సైజ్‌లు పెంచారు. టాయిలెట్ హ్యాండిల్స్‌, వాటర్‌ ట్యాప్‌లు వంటి వాటిలో కూడా మార్పులు చేశారు. ప్రయాణ సమయంలో మరింత సౌకర్యవంతంగా ఉండే విధంగా సీటును రిక్లైన్​ చేసుకోవచ్చు. దివ్యాంగుల వీల్‌ఛైర్‌ కోసం ప్రత్యేక పాయింట్‌ను ఏర్పాటు చేసి అక్కడే వారికి సీటు కేటాయించారు. ప్రయాణికులకు మెరుగైన ఎయిర్‌ కండిషనింగ్ వ్యవస్థ కూడా ఉంది. ఇలాంటి ఆధునిక ఫీచర్లు కలిగిన బోగీల్లో మంచి ప్రయాణ అనుభూతి కలుగుతుంది.

అధిక ఛార్జీలు!
ప్రయాణికుల భద్రత, సౌకర్యం దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ స్థాయిలో ప్రమాణాలు పెంచితే టికెట్​ ఛార్జీలు కూడా అంతే స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. దీంతో పేద, దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి ప్రజలపై అధిక భారం పడే అవకాశం ఉంది. తద్వారా వారు జనరల్ బోగీల వైపే మొగ్గుచూపుతారని చెప్పవచ్చు.

జనరల్​ బోగీల ఉంటాయా?
ప్రస్తుతం ఉన్న రైళ్లలో జనరల్​ బోగీల్లో ప్రయాణికులు ఇరుకుగా, ఇబ్బంది కరంగా ప్రయాణం చేస్తున్నారని చెప్పవచ్చు. వీరిలో దాదాపు అందరూ పేద, మధ్యతరగతి వారే ఉంటారు. ఏసీ, స్లీపర్​ వంటి సర్వీసుల్లో వెళ్లే స్తోమత లేకే ఈ కేటగిరీలో ప్రయాణం చేస్తారు. ఇప్పుడున్న ధరల్లో, కొత్త బోగీల్లో ప్రయాణం చేయడం చాలా కష్టమని చెప్పవచ్చు. దీంతో ఈ కొత్త కోచ్​ల్లో సాధారణ బోగీలు ఉంటాయా? ఉంటే టికెట్​ ధరలు ఎలా ఉంటాయి? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

వేగం మాటేమిటి?
బోగీలను మార్చడం ద్వారా రైలు వేగం పెరగదు. ఒకవేళ ఇలాంటి బోగీలను సెమీ- హైస్పీడ్​తో వెళ్లే ఇంజిన్లకు తగిలించినా, ట్రాక్​లను అప్​గ్రేడ్​ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రారంభమైన వందేభారత్​ రైళ్లు నడిచే రూట్లలోనే ఈ ప్రక్రియం ఇంకా పూర్తి కాలేదు. ఇక 40 వేల కోచ్​లు తిరిగే రూట్లలో మార్చాలంటే సుదీర్ఘ సమయం వేచి చూడాల్సిందే. అయితే బోగీలకు అనుగుణంగా ఎక్కువ వేగంతో వెళ్లే ఇంజిన్లను కూడా మార్చుతారా లేదా అనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

రైల్వేకు కొత్త సొబగులు- వందేభారత్ ప్రమాణాలతో అన్ని బోగీలు

మధ్యతరగతికి గూడు- యథాతథంగా పన్నులు- తాయిలాలు లేకుండా మధ్యంతర బడ్జెట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.