ETV Bharat / bharat

మధ్యతరగతికి గూడు- యథాతథంగా పన్నులు- తాయిలాలు లేకుండా మధ్యంతర బడ్జెట్

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 1, 2024, 3:33 PM IST

Budget 2024 Total Details In Telugu : త్వరలో లోక్​సభ ఎన్నికలు జరరగనున్న నేపథ్యంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్​ను ప్రవేశపెట్టారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. మొత్తం రూ.47.65లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పించారు. అత్యధికంగా రక్షణ శాఖకు రూ.6.2 లక్షల కోట్లు కేటాయించారు. తాయిలాలు లేకుండా పద్దును ప్రవేశపెట్టారు. గడిచిన పదేళ్లలో మోదీ ప్రభుత్వం విజయాలు, పేద, మధ్యతరగతి ఆవాసం కల్పించడం, వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వం లక్ష్యాలను ప్రధానంగా ప్రస్తావించారు. ఆదాయ పన్నుపై వర్గాలకు ఊరట లభించే ప్రకటనలేవీ ఈ బడ్జెట్​లో లేవు. వివిధ పథకాలు, శాఖలకు కేటాయింపుల వివరాలు మీకోసం.

Budget 2024 Total Details In Telugu
Budget 2024 Total Details In Telugu

Budget 2024 Total Details In Telugu : మోదీ సర్కారు హయాంలో పదేళ్ల ప్రగతిని ప్రస్తావిస్తూనే వచ్చే 25 ఏళ్లలో సాధించాల్సిన అభివృద్ధికి బాటలు వేస్తూ కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక ఏడాదికి మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఎన్నికల తాయిలాలకు ఏలాంటి చోటు లేకుండానే పద్దును ప్రకటించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, పేద, మధ్యతరగతి సొంతింటి కల నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. మొత్తం 47లక్షల 65వేల 768 కోట్ల రూపాయల అంచనాలతో బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పించారు. అత్యధికంగా రక్షణ రంగానికి 6లక్షల 20వేల కోట్లు కేటాయించారు.

Budget 2024 Total Details In Telugu
ఆదాయం - ఖర్చుల వివరాలు

నెక్స్ట్ జనరేషన్‌ రిఫామ్స్‌
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ పద్దును తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం, మరోసారి వికసిత్‌ భారత్‌ మంత్రం జపించింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి వికసిత భారత్‌ లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు వివరించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, అందుకు వ్యూహాలను ఆవిష్కరిస్తూ బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పించారు. వచ్చే ఐదేళ్లలో వేగవంతమైన అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా నెక్స్ట్ జనరేషన్‌ రిఫామ్స్‌ తీసుకొస్తున్నట్లు మంత్రి వివరించారు.

గేమ్​ ఛేంజర్ IMEC
ఈ 25 ఏళ్లను అమృత్‌ కాలంగా భావిస్తుండగా, ఇటీవల ప్రకటించిన భారత్‌-పశ్చిమాసియా-ఐరోపా ఆర్థిక కారిడార్‌ దేశ ప్రగతి గతిని మారుస్తుందని నిర్మల తెలిపారు. మొత్తం రూ.47.65 లక్షల కోట్ల (రూ.47,65,768) రూపాయల అంచనాలతో బడ్జెట్‌ ప్రకటించిన ఆర్థిక మంత్రి విత్త లోటు 5.1 శాతంగా ఉంటుందని తెలిపారు. మూలధన వ్యయం 11 శాతంగా ఉంటుందని చెప్పిన మంత్రి ఇది 11లక్షల 11 వేల కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. అభివృద్ధి భారత్‌ లక్ష్యంలో భాగంగా రాష్ట్రాలకు రూ.75వేల కోట్లు వడ్డీలేని రుణాల గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రత్యక్ష, పరోక్ష పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు లేవన్న మంత్రి ఎగుమతి, దిగుమతి సుంకాల్లోనూ ఎలాంటి మార్పులు చేయలేదు. బడ్జెట్‌లో రక్షణశాఖకు రూ.6.2లక్షల కోట్లు కేటాయింపులు చేశారు.

Budget 2024 Total Details In Telugu
ఖర్చుల వివరాలు
Budget 2024 Total Details In Telugu
మూలధన వ్యయం, విదేశీ పెట్టుబడులు, మౌలిక వసతుల కేటాయింపులు

3కోట్ల ఇళ్ల నిర్మాణం
మధ్యతరగతి నూతన గృహ నిర్మాణ విధానం అందుబాటులోకి తెస్తున్నామని సీతారామన్​ చెప్పారు. పీఎం ఆవాస్‌ యోజన గ్రామీణ్‌ పథకంలో భాగంగా మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం లక్ష్యాన్ని త్వరలో చేరుకోనున్నామని చెప్పారు. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని రాబోయే ఐదేళ్లు కూడా ఈ పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో మరో రెండు కోట్ల ఇళ్లను నిర్మిస్తామని తెలిపారు.

Budget 2024 Total Details In Telugu
పీఎం ఆవాస్​ యోజన కేటాయింపులు

రైతులకు పెద్దపీట
పీఎం స్వనిధి ద్వారా ఇప్పటివరకు 78 లక్షల వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేశామని, దీని కింద మరో 2.3 లక్షల మందికి కొత్త రుణాలు ఇవ్వనున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. నానో యూరియా తర్వాత పంటలకు నానో డీఏపీ కింద ఎరువులు అందిస్తామని చెప్పారు. ఆయిల్‌ సీడ్స్‌ రంగంలో ఆత్మనిర్భరత సాధిస్తామని ఆశా భావం వ్యక్తం చేశారు.

ఆయుష్మాన్​ భారత్​ యోజన కింద అంగన్​వాడీలు
ఆయుష్మాన్‌ భారత్​ పథకాన్ని ఆశా వర్కర్లు, అంగన్​వాడీలకు వర్తింపజేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో 9 నుంచి 18 ఏళ్ల వయసున్న బాలికలు సర్వైకల్‌ క్యాన్సర్‌ బారిన పడకుండా చర్యలు తీసుకుంటామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దేశంలో మెడికల్‌ కాలేజీల కోసం కమిటీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

వందేభారత్​ ప్రమాణాలతో 40 వేల సాధారణ బోగీలు
ఈ బడ్జెట్​లో రైల్వే శాఖకు రూ.2.55 లక్షల కోట్లు కేటాయించారు. అలానే రైల్వేలపై కీలక ప్రకటనలు చేశారు. 40 వేల సాధారణ రైలు బోగీలను వందే భారత్ ప్రమాణాలతో మార్పు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మూడు కొత్త రైల్వే ఆర్థిక కారిడార్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రైలు మార్గాల్లో హైట్రాఫిక్‌, హైడెన్సిటీ కారిడార్లలో నూతన మౌలిక సదుపాయాలు మెరుగుపర్చనున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు.

కొత్త విమాన సర్వీసులు
విమానయాన రంగంలో 2, 3 తరగతి నగరాలకు కొత్త విమాన సర్వీసులు తీసుకొస్తామని చెప్పారు నిర్మల. మన విమానయాన సంస్థలు 1000 విమానాలకు పైగా ఆర్డర్‌ చేశాయని తెలిపారు. ఈ ఆర్డర్లే దేశ విమానయాన రంగ అభివృద్ధిని తెలియజేస్తున్నాయని అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ స్టేషన్స్, ప్రజా రవాణా కోసం ఎలక్ట్రిక్ బస్సులను ప్రోత్సహించాస్తామని తెలిపారు. పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను అందించడానికి బయో మ్యానుఫ్యాక్చరింగ్, బయో ఫౌండరీ పథకం కింద బయో డిగ్రేడబుల్ ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.

కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్
విద్యుత్‌ బిల్లుల నుంచి సామాన్య ప్రజలకు విముక్తి కల్పించడం కోసం కొత్త సోలార్‌ పథకం ప్రకటించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఈ పథకంలో భాగంగా కోటి గృహాలు ప్రతి నెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్​ పొందగలుగుతాయని చెప్పారు. ఈ పథకంలో భాగంగా ఇళ్లపై సౌర ఫలకాల వ్యవస్థ ఏర్పాటు చేసుకున్న వారికి ఏడాదికి రూ.15,000 నుంచి రూ.18,000 వరకు ఆదా అవుతుందని సీతారామన్ చెప్పారు.

కొత్తగా ఐదు సమీకృత ఆక్వా పార్కులు
పాడి రైతుల ప్రోత్సాహానికి ప్రత్యేక సమగ్ర కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్న మంత్రి, దేశంలో కొత్తగా ఐదు ఇంటిగ్రేటెడ్​ ఆక్వా పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. స్వయం సహాయక బృందాల్లో కోటి మంది మహిళలు లక్షాధికారులు అయ్యారని, 'లక్‌ పతీ దీదీ' టార్గెట్‌ను రెండు కోట్ల నుంచి మూడు కోట్లకు పెంచుతున్నట్లు తెలిపారు. పరిశోధన, సృజనాత్మకతకు రూ.లక్షల కోట్ల నిధి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మౌలిక వసతుల రంగం 11.1శాతం వృద్ధితో రూ.11.11 లక్షల కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

Budget 2024 Total Details In Telugu
వివిధ పథకాలకు కేటాయింపులు

రాష్ట్రాలకు కేంద్రం నుంచి జరిగే నిధుల బదిలీ 2024-25 ఆర్థిక అంచనాలు :

  • పన్నుల్లో రాష్ట్రాలకు - రూ.12,19,783 కోట్లు
  • జాతీయ విపత్తు నిర్వహణ నిధికి - రూ.11,474 కోట్లు
  • విదేశీ రుణ సదుపాయం ప్రాజక్టులకు గ్రాంటు కింద - రూ. 8వేల కోట్లు
  • విదేశీ రుణ సదుపాయం ప్రాజక్టులకు లోన్‌ కింద - రూ.33,900 కోట్లు
  • ఈశాన్య రాష్ట్రాల కౌన్సిల్‌ పథకాలకు - రూ.29 కోట్లు
  • 275(1) అధికరణం కింద చేపట్టే పథకాలకు - రూ.1300 కోట్లు
  • మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకు రుణంగా ప్రత్యేక సహాయం - రూ.1,30,000 కోట్లు
  • ప్రత్యేక సహాయం డిమాండ్‌ కింద రాష్ట్రాలకు బదిలీ - రూ.4వేల కోట్లు

ఆర్థిక సంఘం గ్రాంట్లు- రూ. 1,32,378 కోట్లు. వాటిలో,

  • పట్టణ స్థానిక సంస్థలకు- రూ.25,653 కోట్లు
  • గ్రామీణ స్థానిక సంస్థలకు- రూ.49,800 కోట్లు
  • ఆరోగ్య రంగానికి- రూ.6,004 కోట్లు
  • కొత్త నగరాల ఇంక్యుబేషన్ కోసం- రూ.500 కోట్లు
  • పురపాలికల్లో సర్వీసుల కోసం- రూ.250 కోట్లు
  • రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధికి- రూ. 20,550 కోట్లు
  • ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు నిధికి- రూ. 5,138 కోట్లు
  • రెవెన్యూ లోటు గ్రాంటుకు- రూ. 24,483 కోట్లు

ఇతర అంశాల్లో కేంద్రం నుంచి రాష్ట్రాలకు బదలాయించే నిధులు మొత్తం రూ. 6,81,400 కోట్లు. ఇందులో,

  • కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు- రూ.4,79,526 కోట్లు
  • కేంద్ర ప్రభుత్వ రంగ పథకాలు- రూ.58,938
  • వ్యయ విభాగం కింద- రూ.1,42,833 కోట్లు
  • మూలధన బదిలీ కింద- రూ.103 కోట్లు

శాఖల కేటాయింపులు

  • రైల్వేశాఖ - రూ.2.55 లక్షల కోట్లు
  • హోంశాఖ - రూ.2.3 లక్షల కోట్లు
  • వ్యవసాయం, రైతుల సంక్షేమానికి - రూ.1.27 లక్షల కోట్లు
  • గ్రామీణాభివృద్ధి శాఖకు - రూ.1.77 లక్షల కోట్లు
  • ఉపరితల రవాణా, జాతీయ రహదారులు - రూ.2.78 లక్షల కోట్లు
  • ఆహారం, ప్రజా పంపిణీ వ్యవస్థ - రూ.2.13 లక్షల కోట్లు
  • రసాయనాలు, ఎరువుల కోసం - రూ.1.68 లక్షల కోట్లు
  • కమ్యూనికేషన్‌ రంగం - రూ.1.37 లక్షల కోట్లు
  • గ్రామీణ ఉపాధి హామీ పథకం - రూ.86 వేల కోట్లు
  • ఆయుష్మాన్‌ భారత్ పథకానికి - రూ.7,500 కోట్లు
  • పారిశ్రామిక ప్రోత్సాహకాలు - రూ.6,200 కోట్లు
  • సోలార్‌ విద్యుత్‌ గ్రిడ్‌ - రూ.8,500 కోట్లు

'ఇది భారత్​ భవిష్యత్తును సృష్టించే బడ్జెట్- యువతకు లెక్కలేనన్ని అవకాశాలు'

రైల్వేకు కొత్త సొబగులు- వందేభారత్ ప్రమాణాలతో అన్ని బోగీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.