ETV Bharat / bharat

'నన్ను తిట్టడమే కాంగ్రెస్ సోలో అజెండా- అందుకే అందరూ ఆ పార్టీని వీడుతున్నారు'

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 16, 2024, 12:42 PM IST

PM Modi on Congress : కాంగ్రెస్ పాలనలో దేశంలో కుంభకోణాలు, బాంబు పేలుళ్ల గురించే చర్చ ఉండేదని, ఇప్పుడు దేశం ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తనను విమర్శించడం తప్ప కాంగ్రెస్​కు ఏ అజెండా లేదని విమర్శించారు. కుటుంబ రాజకీయమనే విష వలయంలో కాంగ్రెస్ చిక్కుకుందని, అందుకే ఆ పార్టీ నుంచి అంతా వెళ్లిపోతున్నారని ఆరోపించారు.

pm-modi-on-congress
pm-modi-on-congress

PM Modi on Congress : కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏకైక అజెండా తనను తిట్టడమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. దేశం గురించి కూడా ఆలోచించకుండా తనను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. ఈ క్రమంలో సమాజాన్ని విభజించే అంశాలనూ వ్యాప్తి చేస్తుందని అన్నారు. కుటుంబ రాజకీయమనే విష వలయంలో కాంగ్రెస్ చిక్కుకుందని, అందుకే ఆ పార్టీ నుంచి అంతా బయటకు వెళ్తున్నారని చెప్పారు.

'నా అతిపెద్ద కులాలు అవే'
'వికసిత్ భారత్ వికసిత్ రాజస్థాన్' కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన మోదీ కాంగ్రెస్​పై విమర్శలు గుప్పించారు. అవినీతితో కూడిన కాంగ్రెస్ పాలనలో దేశం అనుకున్న లక్ష్యాలు సాధించలేకపోయిందని, ప్రస్తుతం సగర్వంగా ముందుకెళ్తోందని మోదీ చెప్పుకొచ్చారు. భారత్​ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు యువత, మహిళలు, రైతులు, పేదలను బలోపేతం చేస్తున్నట్లు మోదీ చెప్పారు. ఈ నాలుగు వర్గాలే తన దృష్టిలో అతిపెద్ద కులాలు అని చెప్పుకొచ్చారు.

"స్వాతంత్ర్యం తర్వాత మనకు ఇప్పుడు స్వర్ణయుగం వచ్చింది. గతంలో ఉన్న అసంతృప్తిని వదిలే సమయం మనకు పదేళ్ల క్రితం లభించింది. ఇప్పుడు భారత్ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తోంది. 2014కు ముందు దేశంలో స్కామ్​లు, బాంబు పేలుళ్ల గురించే చర్చ వినిపించేది. తమకు, దేశానికి ఏమవుతుందో అనే ఆందోళన దేశ ప్రజల్లో ఉండేది. దూరదృష్టితో ఆలోచించకపోవడం కాంగ్రెస్​తో వచ్చిన పెద్ద సమస్య. సానుకూలమైన విధానాలు తీసుకురావడం కాంగ్రెస్​కు సాధ్యం కాదు. భవిష్యత్ గురించి కాంగ్రెస్ ఆలోచించేది కాదు.

ఇప్పుడు కాంగ్రెస్​కు ఉన్న ఏకైక అజెండా మోదీని వ్యతిరేకించడమే. వికసిత్ భారత్, మేడ్ ఇన్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్​కు కాంగ్రెస్ మద్దతు ఇవ్వదు. ఎందుకంటే వాటికి మోదీ మద్దతు ఇస్తున్నారు కాబట్టి. కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలనే విషవలయంలో చిక్కుకుంది. ఇప్పుడు అంతా కాంగ్రెస్​ను వీడుతున్నారు. ఆ పార్టీలు ప్రస్తుతం ఒక్క కుటుంబమే కనిపిస్తోంది."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఈ కార్యక్రమంలో రాజస్థాన్​లో రూ.17 వేల కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మోదీ. రోడ్ల నిర్మాణం, రైల్వేల అభివృద్ధి, సోలార్ ఎనర్జీ, తాగునీరు, పెట్రోలియం సహజ వాయువు వంటి వివిధ రంగాలకు చెందిన అభివృద్ధి పనులు ఇందులో ఉన్నాయని పీఎంఓ తెలిపింది.

'లోక్​సభ ఎన్నికల్లో ఒక్క బీజేపీకే 370 సీట్లు- కాంగ్రెస్​ తుడిచిపెట్టుకుపోవడం పక్కా!'

'సవాళ్లున్నా ఆగని అభివృద్ధి- ఐదేళ్లలో ఎన్నో సంస్కరణలు- ప్రజల ఆశీర్వాదం మళ్లీ మాకే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.