ETV Bharat / bharat

'ఆర్టికల్ 370 తర్వాత అభివృద్ధిలో కొత్త శిఖరాలకు జమ్ముకశ్మీర్'

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 7, 2024, 3:59 PM IST

Updated : Mar 7, 2024, 5:38 PM IST

PM Modi Kashmir
PM Modi Kashmir

PM Modi Kashmir : జమ్ముకశ్మీర్‌లో అధికరణ 370రద్దు తర్వాత అనేక ఆంక్షల నుంచి స్వేచ్ఛ లభించిందని ప్రధాని మోదీ తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌, ఆ పార్టీ మిత్రులు అధికారణ 370 పేరుతో జమ్ముకశ్మీర్‌ ప్రజలతోపాటు దేశాన్ని తప్పుదోవ పట్టించారని ధ్వజమెత్తారు. వివిధ రంగాలకు సంబంధించి వేల కోట్లతో చేపట్టిన ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ- జమ్ముకశ్మీర్‌లో ఉద్యోగాలు పొందిన వెయ్యి మందికి నియామక పత్రాలు పంపిణీ చేశారు

PM Modi Kashmir : 2019లో 370 అధికరణ రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌ అభివృద్ధిలో నూతన శిఖరాలను తాకి, స్వేచ్ఛగా ఊపిరి తీసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేకాధికారాలు కల్పించే 370 అధికరణ రద్దు తర్వాత తొలిసారి ప్రధాని మోదీ కశ్మీర్‌లో పర్యటించారు. కేంద్ర పాలిత ప్రాంతంలో వ్యవసాయ రంగం పుంజుకోవడానికి దోహదం చేసే 5వేల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు.

వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం శ్రీనగర్‌లోని బక్షీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. అధికరణ 370పై చాలా కాలంపాటు జమ్ముకశ్మీర్‌ ప్రజలనే కాదు దేశాన్ని కూడా కాంగ్రెస్‌ పార్టీ తప్పుదారి పట్టించిందని ప్రధాని మోదీ ఆరోపించారు. జమ్ముకశ్మీర్‌ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. వికసిత భారత్‌కు వికసిత జమ్ముకశ్మీర్‌ ప్రాధాన్యమని తెలిపారు. జమ్ముకశ్మీర్‌ దేశానికి కిరీటమని ప్రశంసించారు.

"కొన్ని దశాబ్దాలపాటు రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌, దాని మిత్రులు అధికరణ 370 పేరుతో జమ్ముకశ్మీర్‌ ప్రజలను మభ్యపెట్టారు. అధికరణ 370 వల్ల ఉపయోగం జమ్ముకశ్మీర్‌కా లేదా కొన్ని రాజకీయ కుటుంబాలకా? కొన్ని రాజకీయ కుటుంబాలే ప్రయోజనం పొందాయి. జమ్ముకశ్మీర్‌ ప్రజలు ఈ వాస్తవాన్ని గ్రహించారు. కొన్ని కుటుంబాల ప్రయోజనం కోసం సంకేళ్లతో బంధించారు. ఇప్పుడు అధికరణ 370 లేదు. అందువల్ల జమ్ముకశ్మీర్‌ యువత ప్రతిభకు గుర్తింపు లభిస్తోంది. వారికి కొత్త అవకాశాలు లభిస్తున్నాయి. అందరికీ సమాన అధికారాలు, అవకాశాలు లభిస్తున్నాయి."

-- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

'యాదృచ్చికమా లేక ప్రకృతి సంకేతమా?'
'భవిష్యత్తులో జమ్ముకశ్మీర్ విజయగాథ ప్రపంచానికి కేంద్రంగా నిలుస్తుంది. జమ్ముకశ్మీర్​లోని సరస్సుల్లో ఎక్కడ చూసినా కమలం కనిపిస్తుంది. జమ్ముకశ్మీర్ క్రికెట్ లోగోపై కూడా కమలం గుర్తు ఉంది. బీజేపీ గుర్తు కూడా కమలమే. జమ్ముకశ్మీర్‌కు కమలంతో లోతైన అనుబంధం ఉండడం యాదృచ్చికమా లేక ప్రకృతి సంకేతమా?' అని మోదీ ప్రశ్నించారు.

"జమ్ముకశ్మీర్‌ యువత అన్ని రంగాల్లో ముందడుగు వేయటానికి మా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోంది. యువత నైపుణ్యాభివృద్ధి నుంచి మొదలు క్రీడల్లో నూతన అవకాశాలు కల్పిస్తున్నాం. జమ్ముకశ్మీర్‌లోని అన్ని జిల్లాల్లో ఆధునిక క్రీడా సదుపాయాలు కల్పిస్తున్నాం. 17 జిల్లాల్లో బహుళ వినియోగ ఇండోర్‌ స్పోర్ట్స్‌ కేంద్రాలు నిర్మించాం. గత కొన్నేళ్లలో జమ్ముకశ్మీర్‌ అనేక జాతీయ క్రీడా టోర్నమెంట్లకు ఆతిథ్యం ఇచ్చింది. ఇప్పుడు జమ్ముకశ్మీర్‌ దేశానికి శీతాకాల క్రీడల రాజధానిగా ఎదుగుతోంది. హాలిమేలో జరిగిన ఖేలో ఇండియా శీతాకాల క్రీడల్లో దేశం నలుమూలల నుంచి వచ్చిన వెయ్యి మంది క్రీడాకారులు పాల్గొన్నారు"

- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

నజీమ్​తో మోదీ సెల్ఫీ
మరోవైపు, కశ్మీర్​లో నజీమ్​ అనే యువకుడితో మోదీ సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. "నా స్నేహితుడు నజీమ్‌తో ఒక చిరస్మరణీయ సెల్ఫీ. అతడు చేస్తున్న మంచి పనికి నేను ముగ్ధుడయ్యాను. బహిరంగ సభలో అతడు సెల్ఫీ తీసుకుందామని అడిగాడు. అతడిని కలవడం సంతోషంగా ఉంది" అని ఎక్స్​లో పోస్ట్ చేశారు మోదీ. ప్రస్తుతం అతడు తేనె వ్యాపారం చేస్తున్నాడు. వంద మందికిపైగా ఉపాధి కల్పిస్తున్నాడు.

మరోవైపు, దేఖో అప్నా దేశ్ పీపుల్స్ ఛాయిస్ టూరిస్ట్ డెస్టినేషన్ పోల్, చలో ఇండియా గ్లోబల్ డయాస్పోరా ప్రచారాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రవాస భారతీయులు అపూర్వ భారత్‌ అంబాసిడర్‌లుగా మారి, దేశంలో పర్యటకాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

జమ్ముకశ్మీర్​ అభివృద్ధికి హామీ ఇస్తున్నా- ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు ఆగవ్​: ప్రధాని మోదీ

'బంగాల్​లోని ప్రతి ప్రాంతానికీ సందేశ్​ఖాలీ తుపాను'- టీఎంసీపై మోదీ ఫైర్

Last Updated :Mar 7, 2024, 5:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.