ETV Bharat / bharat

నోటాకు ఓటేస్తే ఏమవుతుంది? ఈ ఆప్షన్ హిస్టరీ తెలుసా? - NOTA Option In Elections

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 30, 2024, 6:14 PM IST

NOTA Option In Elections : పోలింగ్‌లో ఏ అభ్యర్థి నచ్చకపోయినప్పుడు ఓటర్ ఎంచుకునే ఆప్షన్ నోటా. తమకు ఏ అభ్యర్థిపై విశ్వాసం లేదని చెప్తూ ఓటర్లు నోటాకు ఓటు వేస్తారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి 1961 రూల్ 49(ఓ) కింద ఈ హక్కును ఓటర్లు వినియోగించుకోవచ్చు. దీని గురించి పూర్తి వివరాలు మీకోసం.

NOTA Option In Elections
NOTA Option In Elections

NOTA Option In Elections : ఓటు, భారతీయ పౌరుడి అస్తిత్వానికి ప్రతీక. ఎన్నికల్లో సరైన ప్రజాప్రతినిధిని ఎన్నుకునే అవకాశం రాజ్యాంగం కల్పించింది. లోక్‌సభ, శాసనసభతోపాటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపడుతోంది. ఏటా నూతన ఓటర్లు నమోదవుతూనే ఉన్నారు. అయితే కొన్నిసార్లు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పట్ల ప్రజలకు అసంతృప్తి ఉంటుంది. అందులో నచ్చని వారుంటే తిరస్కరించే అధికారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. నోటా(నన్ ఆఫ్ ది ఎబోవ్)తో మనం మన ఓటును తిరస్కరించవచ్చు.

ఏమిటీ సెక్షన్ 49(ఓ)?
వాస్తవానికి అభ్యర్థులు ఎవరూ నచ్చకుంటే తిరస్కరణ ఓటు వేసే హక్కును భారత రాజ్యాంగం ఎప్పుడో కల్పించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1961లోని సెక్షన్‌ 49(ఓ) కింద ఓటర్లు ఈ హక్కును వినియోగించుకునే వీలుంది. పోలింగ్‌ బూత్‌లోని ప్రిసైడింగ్‌ అధికారి దగ్గరికి వెళ్లి దీని కోసం 17-ఎ ఫారం తీసుకుని ఫలానా అభ్యర్థిని తిరస్కరిస్తున్నానని పేర్కొంటూ సంతకం లేదా వేలిముద్ర వేసి బ్యాలెట్‌ పెట్టెలో వేయవచ్చు. రహస్య బ్యాలెట్‌ విధానానికి ఇది విరుద్ధమని, ఓటరు భద్రత దృష్ట్యా ఇది సరైన పద్దతి కాదని వ్యతిరేకత ఉండేది. ఈవీఎంలు అందుబాటులోకి రావడం వల్ల నోటా మీటను ఎన్నికల సంఘం తీసుకొచ్చింది.

2014లో ప్రారంభం
ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్​ (ఈవీఎం)లో అభ్యర్థుల గుర్తుతో పాటు నోటాను ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు ప్రతి ఓటు విలువైనదే. గతంలో అభ్యర్థులు నచ్చకుంటే మిన్నకుండేవారు. 2014లో ఎన్నికల సంఘం 'నోటా'ను ప్రవేశపెట్టింది. పోటీచేసే అభ్యర్థులు నచ్చకుంటే దీనిని వినియోగించుకునే అవకాశమిచ్చారు. దీంతో చాలా మంది పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు.

అయితే అభ్యర్థులు నచ్చకపోతే తిరస్కరించే అవకాశం ఓటరుకు ఉండాలని పలు స్వచ్ఛందసంస్థలు, సామాజిక సేవా విభాగాలు సంత్సరాలుగా తమ డిమాండ్‌ను వినిపించాయి. ఈ క్రమంలో నోటాను అందుబాటులోకి తీసుకురావాలని ఎన్నికల సంఘం 2009లో తొలిసారిగా సుప్రీంకోర్టుకు వివరించింది. ప్రభుత్వం దీనిని వ్యతిరేకించినా, పలు సంస్థలు, ప్రజాసంఘాలు మద్దతు పలికాయి. దీంతో నోటాను అమల్లోకి తీసుకురావాలని సుప్రీంకోర్టు 2013 సెప్టెంబరు 27న తీర్పు వెలువరించింది.

2014లో జరిగిన శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో, 2018 శాసనసభ, 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఈ 2023లో జరిగిన 5రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో, త్వరలో జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో 'ఇప్పుడు పోటీలో ఉన్న వాళ్లెవరికీ నేను ఓటు వేయడం లేదు(నన్​ ఆఫ్​ ది ఎబోవ్)' అనే ఆప్షన్‌ను ఈవీఎంలో పొందుపర్చారు. ఆ బటన్‌ నొక్కితే సదరు ఓటు ఎవరికీ పడదు. ఓటు హక్కుగా నోటా వినియోగించుకున్నట్లే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.