ETV Bharat / bharat

'కాంగ్రెస్​ మ్యానిఫెస్టోలో ఏముందో ప్రజలకు బాగా తెలుసు- అందుకే మీలో ఆందోళన!' - Kharge Letter To Modi

author img

By ETV Bharat Telugu Team

Published : May 2, 2024, 12:48 PM IST

Updated : May 2, 2024, 2:13 PM IST

Kharge Letter To Modi
Kharge Letter To Modi

Mallikarjuna Kharge Letter : ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. మోదీ ద్వేషపూరిత ప్రసంగాలకు బదులు గత పదేళ్లలో ఎన్ డీఏ సర్కార్ పనితీరుపై ఓట్లు అడగడం మంచిదని అన్నారు. ఈ మేరకు పలు ప్రశ్నలను సంధిస్తూ ప్రధాని మోదీకి ఖర్గే లేఖ రాశారు.

Mallikarjuna Kharge Letter : లోక్​సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ నిరాశతో ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ప్రధాని మోదీ ద్వేషపూరిత ప్రసంగాలకు బదులు గత పదేళ్లలో ఎన్​డీఏ సర్కార్ పనితీరు ఆధారంగా ఓట్లు అడగడం మంచిదని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. అందులో ప్రధానికి ఖర్గే పలు ప్రశ్నలు సంధించారు.

"మీ ఎన్నికల ప్రసంగాల్లో అబద్ధాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్​డీఏ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు లేఖ రాసి మీ అబద్ధాలను మరింత విస్తరించాలని కోరుకుంటున్నారు. ఒక అబద్ధాన్ని వెయ్యి సార్లు పునరావృతం చేసినా అది నిజం అయిపోదు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఏ హామీలిచ్చిందో చదివి ఓటర్లు అర్థం చేసుకోగలరు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు తొలగించి మా ఓటు బ్యాంకుకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్​డీఏ అభ్యర్థులకు మీరు లేఖ రాశారు. ప్రతీ భారతీయుడు మా ఓటు బ్యాంకే. ఓటింగ్ శాతం తక్కువగా ఉండటం వల్ల మీరు ఆందోళన చెందుతున్నారు. మీ విధానాల పట్ల ప్రజలు ఆసక్తిగా లేరు. ఎన్నికలు ముగిశాక ప్రజలు మిమ్నల్ని విభజన, మతతత్వ ప్రసంగాలు చేసిన ప్రధానిగా మాత్రమే గుర్తుంచుకుంటారు."

-- మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు

'వాటి గురించి మాట్లాడడానికి ఆసక్తి చూపరు'
దేశంలో ఉన్న అసమానతలు, నిరుద్యోగం, ధరల పెరుగుదల గురించి మాట్లాడటానికి ప్రధాని మోదీ ఆసక్తి చూపడం లేదని ఖర్గే ప్రశ్నించారు. 1947 నుంచి ప్రతి దశలోనూ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నారని ఎవరో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. "కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా చెబుతున్నారు. గత పదేళ్లలో మేం చూసిన ఒకే ఒక్క బుజ్జగింపు విధానం చైనాను ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు బుజ్జగించడమే. పదేపదే చైనా అతిక్రమణలు, అరుణాచల్ ప్రదేశ్, లద్ధాఖ్, ఉత్తరాఖండ్‌లోని ఎల్​ఏసీ సమీపంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నప్పటికీ, చైనా వస్తువుల దిగుమతులు గత ఐదేళ్లలో 54.76 శాతం ఎగబాకాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 16 ప్రకారం జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లను మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలి. రాజ్యాంగ విరుద్ధమైన ఎలక్టోరల్ బాండ్ల పథకం ద్వారా బీజేపీ అన్యాయంగా రూ.8,250 కోట్లు కూడబెట్టింది" అని ఖర్గే మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఎన్​డీఏ అభ్యర్థులకు ప్రధాని మోదీ లేఖ
మరోవైపు, రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్​పై ప్రధాని మోదీ విమర్శలు తీవ్రతరం చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోటాను లాక్కుని తన ఓటుబ్యాంకు వర్గానికి కట్టబెట్టాలని హస్తం పార్టీ చూస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ వైఖరిని ప్రజల్లో ఎండగట్టాలని సూచిస్తూ లోక్‌సభ ఎన్నికల్లో పోటీపడుతున్న ఎన్​డీఏ అభ్యర్థులకు ఇటీవల ప్రధాని మోదీ వ్యక్తిగత లేఖలు రాశారు. ఆ లేఖలపై ప్రశ్నలు సంధిస్తూ ప్రధాని మోదీకి లేఖ రాశారు ఖర్గే.

బీజేపీపై రాహుల్ ఫైర్
ప్రైవేటీకరణను గుడ్డిగా అమలు చేస్తూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను మోదీ ప్రభుత్వం రహస్యంగా లాక్కుంటోందని ఆరోపించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీ, ప్రభుత్వ రంగ సంస్థలను తమ పార్టీ బలోపేతం చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్​లో పోస్ట్ చేసారు. "2013లో ప్రభుత్వ రంగంలో 14 లక్షల శాశ్వత పోస్టులు ఉండగా అవి 2023 నాటికి 8.4 లక్షలకు చేరాయి. బీఎస్​ఎన్​ఎల్, సెయిల్, బీహెచ్​ఈఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రంలోని బీజేపీ సర్కార్ నాశనం చేసింది. మోదీ మోడల్‌ ప్రైవేటీకరణ దేశ వనరులను కొల్లగొట్టడమే. దీని ద్వారా అణగారిన వర్గాల రిజర్వేషన్లు లాగేసుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలో వస్తే ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేస్తాం. వాటిల్లో ఖాళీగా ఉన్న 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం" అని రాహుల్ ట్వీట్​లో హామీ ఇచ్చారు.

మీసం, గడ్డం ఫుల్​గా పెంచారని 80మందిని తీసేసిన కంపెనీ- వాళ్లు చెప్పినట్లు చేసినా!! - Beard Moustache Controversy

దిల్లీలో కాంగ్రెస్‌ 'ఆప్‌'సోపాలు- ఒకరి తర్వాత మరొకరు జంప్- పెద్ద తలనొప్పే! - Lok Sabha Elections 2024

Last Updated :May 2, 2024, 2:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.