ETV Bharat / bharat

'మోదీ అలా ఎందుకు మాట్లాడారు?'- సమాధానం చెప్పాలని బీజేపీకి ఈసీ ఆదేశం - Lok Sabha elections 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 25, 2024, 1:18 PM IST

Updated : Apr 25, 2024, 2:36 PM IST

EC on Modi MCC Violation : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని విపక్షాలు చేసిన ఫిర్యాదును భారత ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకుంది. రాజస్థాన్​లో ప్రధాని మోదీ ప్రసంగంపై ఏప్రిల్ 29లోగా సమాధానం చెప్పాలని బీజేపీని ఈసీ ఆదేశించింది.

EC on Modi MCC Violation
EC on Modi MCC Violation

EC on Modi MCC Violation : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని విపక్షాలు చేసిన ఫిర్యాదును భారత ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకుంది. రాజస్థాన్‌‌లోని జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంపై ఈసీ స్పందించింది. ప్రధాని మోదీ ప్రసంగంపై ఏప్రిల్ 29లోగా సమాధానం చెప్పాలని బీజేపీని ఆదేశించింది. ప్రధాని మోదీతో పాటు కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈసీ చర్యలకు దిగింది. ఏప్రిల్ 29లోపు వీరందరూ సమాధానం చెప్పాలని సూచించింది.

ఒకరిపై ఒకరు ఫిర్యాదు
రాజస్థాన్​లోని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీపై మోదీ ఏప్రిల్ 21న తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల సంపదను మైనార్టీలకు పంచి పెడుతుందని, మహిళల మంగళసూత్రాలనూ వదిలిపెట్టదని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ విమర్శించారు. మొదటి దశ ఓటింగ్‌తో నిరాశకు గురైన మోదీ, దిగజారి అబద్ధాలు చెప్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీకి ప్రజల నుంచి అపారమైన మద్దతు లభిస్తుందన్న వార్తలతోనే ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని రాహుల్‌ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈసీ దృష్టికి తీసుకెళ్లింది.

మరోవైపు రాహుల్ గాంధీ తన ప్రసంగాలతో దేశాన్ని విభజించాలని చూస్తున్నారని, పేదరికంపైనా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. దళితుడిననే కారణంతో తనను అయోధ్య ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానించలేదంటూ ఖర్గే ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని బీజేపీ వీరిద్దరిపై ఫిర్యాదు చేసింది.

ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే : సీపీఎం
ప్రధాని మోదీ వివాదాస్పద ప్రసంగంపై సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మోదీ వ్యాఖ్యలపై వెంటనే చర్యలు చేపట్టాలని ఈసీని డిమాండ్ చేశారు. ఓ వర్గం మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు, విద్వేషాలను రెచ్చగొట్టినందుకు ప్రధానిపై తప్పకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఈసీని కోరారు.

లోక్‌సభ ఎన్నికల బరిలో ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్! జైలు నుంచే పోటీ! - Lok Sabha Elections 2024

ఇళయరాజా కేసులో ట్విస్ట్​- 'రైటర్స్ కూడా పాటలపై హక్కు కోరితే ఏమవుతుంది?'- హైకోర్టు సూటి ప్రశ్న - Ilaiyaraaja Songs Controversy

Last Updated :Apr 25, 2024, 2:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.