ETV Bharat / bharat

ఎస్​పీ, కాంగ్రెస్ మధ్య కుదిరిన పొత్తు- ఆప్​తో మరో 2రోజుల్లో ఫైనల్​! మరిన్ని రాష్ట్రాలపై ఫోకస్

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 21, 2024, 8:53 PM IST

Congress SP Alliance : దెబ్బ మీద దెబ్బ తగిలిన ఇండియా కూటమికి కాస్త ఉపశమనం లభించింది. ఉత్తర్​ప్రదేశ్​లో ఎస్​పీ- కాంగ్రెస్ మధ్య పొత్తు పొడిచింది. అలాగే దిల్లీ, హరియాణా, గోవా, గుజరాత్, అసోంలో సీట్ల పంపకంపై ఆప్​తో చర్చిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మరోవైపు దిల్లీలో కాంగ్రెస్​తో సీట్ల పంపకంపై చర్చలు చివరి దశలో ఉన్నాయని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. త్వరలో పొత్తుపై ప్రకటన చేస్తామని అన్నారు.

Congress SP Alliance
Congress SP Alliance

Congress SP Alliance : వరుస షాక్​లు తగులుతున్న ఇండియా కూటమికి ఊరట లభించింది. ఎట్టకేలకు ఉత్తర్​ప్రదేశ్​లో ఎస్​పీ, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరింది. ఉత్తర్​ప్రదేశ్​లో కాంగ్రెస్ పార్టీ 17 సీట్లలో పోటీ చేయనుంది. మిగతా స్థానాల్లో ఎస్​పీ, భాగస్వామ్య పక్షాలు బరిలో దిగనున్నాయి. ఈ పొత్తు వరుస దెబ్బల తర్వాత ఇండియా కూటమికి కాస్త ఊరట అని చెప్పాలి. అలాగే దిల్లీలోనూ ఆప్​- కాంగ్రెస్​ మధ్య పొత్తు పొడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దిల్లీలో సీట్ల పంపకంపై ఆప్, కాంగ్రెస్ మధ్య చర్చలు చాలా ఆలస్యమయ్యాయని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆప్​-కాంగ్రెస్ మధ్య చర్చలు చివరి దశలో ఉన్నాయని, త్వరలోనే పొత్తు గురించి ప్రకటిస్తామని చెప్పారు. 'వచ్చే 2-3 రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పటికే పొత్తుల ఖరారు చాలా ఆలస్యమైంది.' దిల్లీ సీఎం కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు.

యూపీలో కుదిరిన పొత్తు
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్​లో ఎస్​పీ- కాంగ్రెస్ కలిసి పోటీ చేయనున్నట్లు బుధవారం ప్రకటించాయి. యూపీలోని మొత్తం 80 స్థానాల్లో 17 సీట్లలో కాంగ్రెస్​ పోటీ చేస్తుందని, మిగతా స్థానాల్లో ఎస్​పీ, ఇతర భాగస్వామ్య పక్షాలు పోటీచేస్తాయని వెల్లడించాయి. ఈ మేరకు ఉత్తర్​ప్రదేశ్ ఎస్​పీ చీఫ్​ నరేశ్ ఉత్తమ్ పటేల్​, ఎస్​పీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర చౌదరి, యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్​ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. రాయ్‌బరేలీ, అమేఠి, వారణాసి, కాన్పుర్ సిటీ, ఫతేపుర్ సిక్రీ సహా కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు చెప్పారు. మధ్యప్రదేశ్​లో సమాజ్​వాదీ పార్టీ ఖజురహో లోక్​సభ స్థానంలో పోటీ చేస్తుందని, మిగతా స్థానాల్లో కాంగ్రెస్​క మద్దతిస్తుందని తెలిపారు.

తొలి నుంచి సమాజ్‌వాదీ పార్టీ కాంగ్రెస్​తో పొత్తును కోరుకుంటుందని ఎంపీ డింపుల్ యాదవ్ అన్నారు. కూటమిగా ఏర్పడినందుకు ఎస్​పీ- కాంగ్రెస్ పార్టీలకు ఆమె అభినందించారు.' ప్రజలు ఉత్తర్​ప్రదేశ్​లో ఇండియా కూటమికి మద్దతు ఇస్తారు. ఎందుకంటే యువత, మహిళలు, రైతులు అందరూ బీజేపీ సర్కార్​పై కోపంగా ఉన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇండియా కూటమికే ఓటేస్తారు' అని డింపుల్ యాదవ్ అన్నారు.

మరోవైపు, దిల్లీ, హరియాణా, అసోం, గుజరాత్, గోవా రాష్ట్రాల్లో ఆప్​తో సీట్ల పంపకంపై చర్చించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. హరియాణా, గోవా, అసోం, గుజరాత్‌లో ఆప్​నకు ఒక్కో సీటును ఇస్తామని, అందుకు బదులుగా దిల్లీలో కాంగ్రెస్​కు మూడు సీట్లు ఇవ్వాలని కోరుతున్నామని వెల్లడించాయి. అదే విధంగా మహారాష్ట్ర, తమిళనాడులో సీట్ల పంపకాలపై చర్చలు చివరి దశలో ఉన్నాయని, త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నాయి. సీట్ల సర్దుబాటు అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ జోడో యాత్రకు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1వరకు విరామం ఇస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

'అసోంలో ఆప్‌నకు పెద్దగా ఉనికి లేదు. 2022లో గువహటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వారు కొన్ని సీట్లు గెలుచుకున్నారు. అసోంలో ఎక్కువ స్థానాలను గెలుచుకోవడానికి కాంగ్రెస్ సిద్ధమవుతోంది' అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జితేంద్ర సింగ్ ఈటీవీ భారత్‌తో అన్నారు. 'బంగాల్‌లో టీఎంసీతో పొత్తుపై ఆశ ఉంది. మమతా బెనర్జీతో చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆమె ఇప్పటికీ ఇండియా కూటమిలో భాగమే.' అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్‌ మీర్‌ తెలిపారు.

భారత సైన్యంలో కీలక మార్పులు- డ్రాగన్​ దూకుడుకు చెక్​ పెట్టడమే లక్ష్యం!

'కాంగ్రెస్ ఖాతాల నుంచి అక్రమంగా రూ.65కోట్లు విత్​డ్రా'- ఐటీ శాఖపై హస్తం పార్టీ ఫైర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.