ETV Bharat / bharat

బీజేపీ ఆకాశంలోకి- కాంగ్రెస్ పాతాళంలోకి! 40 ఏళ్లలో ఎంతో మార్పు

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 17, 2024, 7:22 AM IST

BJP Vs Congress Election History : 1984లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 400కుపైగా సీట్లు సాధించి స్వతంత్ర భారత చరిత్రలో రికార్డు సృష్టించింది. ఆ తర్వాత కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారిపోయింది. కనీసం ప్రతిపక్ష పార్టీ హోదాకు కూడా చేరుకులేకపోయింది. మరోవైపు 1984 నుంచి బరిలోకి దిగిన బీజేపీ 2 సీట్ల నుంచి 303 సీట్లు సాధించే స్థితికి చేరింది.

BJP Vs Congress Election History
BJP Vs Congress Election History

BJP Vs Congress Election History : ఇందిరా గాంధీ హత్యానంతరం 1984లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 400కుపైగా సీట్లు సాధించి స్వతంత్ర భారత చరిత్రలో రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేయాలన్న సంకల్పంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 'అబ్‌ కీ బార్‌ 400 పార్​' నినాదంతో ముందుకెళ్తున్నారు. కాంగ్రెస్‌ పూర్వ ప్రాభవాన్ని కోల్పోయి ఇప్పుడు ఉనికి కోసం కొట్టుమిట్టాడే పరిస్థితికి వచ్చింది. 1984లో కాంగ్రెస్‌ 49.10% ఓట్లతో 404 సీట్లు సాధించి రాజీవ్‌ గాంధీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పట్లో పంజాబ్‌, అసోంలకు ఎన్నికలు జరపలేదు. ఆ తర్వాత ఏడాది అంటే 1985లో ఈ రెండు రాష్ట్రాల్లోని 27 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్‌ మరో 10 సీట్లను గెలుచుకుంది. దీంతో కాంగ్రెస్‌ సీట్ల సంఖ్య 414కు చేరుకుంది. 1984 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తర్వాత అత్యధిక స్థానాలను టీడీపీ గెలుచుకుంది. లోక్‌సభలో తొలిసారిగా ఒక ప్రాంతీయ పార్టీ ప్రతిపక్ష హోదాను సంపాదించుకుంది.

కాంగ్రెస్ పతనం
కాంగ్రెస్‌ పార్టీ 2014లో 44 సీట్లకు పడిపోయి ఆకాశం నుంచి అగాధంలోకి జారిపోయింది. 1984లో తొలిసారి ఎన్నికల్లోకి దిగిన బీజేపీ కేవలం 2 సీట్లు గెలుచుకుంది. కానీ, 2019లో 303 సీట్లు సాధించి తిరుగులేని ఆధిపత్యం చెలాయించే స్థాయికి చేరింది. రాజీవ్‌గాంధీ హయాంలో బలంగా కనిపించిన కాంగ్రెస్‌ ఆయన హయాంలోనే బయటపడిన బోఫోర్స్‌ కుంభకోణంతో పతనానికి దగ్గరవుతూ వచ్చింది. దాని కారణంగా ఆ పార్టీ 1984లో గల 400పైచిలుకు స్థానాల నుంచి 1989లో 197 స్థానాలకు పడిపోయింది. కాంగ్రెస్‌ బలహీనతతో ఏర్పడిన రాజకీయ శూన్యతను నేషనల్‌ ఫ్రంట్‌ రూపంలో మిగిలిన రాజకీయ పార్టీలు ఉపయోగించుకుని కేంద్రంలో వీపీ సింగ్‌ హయాంలో కాంగ్రేసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కొత్త రాజకీయానికి తెరలేపాయి. ఒకవైపు కాంగ్రెస్‌ బోఫోర్స్‌ భారంతో ఉంటే మరోవైపు వీపీ సింగ్‌ ప్రభుత్వం మండల్‌ కమిషన్‌తో సరికొత్త సామాజిక రాజకీయాలను మొదలుపెట్టి ఓటర్ల ఆలోచనను మళ్లించే ప్రయత్నం చేసింది.

అందనంత ఎత్తులోకి బీజేపీ
1990 సెప్టెంబరు నుంచి ఆడ్వాణీ రామ జన్మభూమి రథయాత్రను మొదలుపెట్టి దేశ రాజకీయాలను మరో కోణానికి తీసుకెళ్లారు. ఈ రెండు అంశాలు కాంగ్రెస్‌ రాజకీయ భూమిని కంపింపజేస్తే, మిగిలిన పార్టీలు వాటిపై కొత్త సౌధాలు నిర్మించుకోవడానికి వీలుపడింది. బీజేపీ 1984 నుంచి 2019 వరకు ప్రతి ఎన్నికల్లో తన ప్రభావాన్ని పెంచుకుంటూ వచ్చింది. 1998, 1999ల్లో ఎన్​డీయే కూటమి పేరుతో వాజ్‌పేయీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. కాంగ్రెస్‌ పరిస్థితి మాత్రం దిగజారిపోయింది. ఆ కారణంగా పార్టీ 1996 నుంచి 2004 వరకు అధికారానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. బీజేపీ 40 ఏళ్లలో 1.82 కోట్ల ఓట్ల నుంచి 22.90 కోట్ల ఓట్లను సాధించే స్థాయికి చేరగా, కాంగ్రెస్‌ మాత్రం 11.54 కోట్ల ఓట్ల నుంచి 11.94 కోట్ల ఓట్లకే పరిమితమైంది. 1984లో తెచ్చుకున్న 11.88 కోట్ల ఓట్లతోనే కాంగ్రెస్‌ 404 సీట్లు గెలుచుకోగా 2019లో అంతకంటే ఎక్కువగా 11.94 కోట్ల ఓట్లు వచ్చినప్పటికీ దాని సీట్లు 52కే పరిమితమయ్యింది. ప్రత్యర్థి పార్టీ తనకంటే 91% ఓట్లు అధికంగా దక్కించుకుని అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ప్రధాన ప్రతిపక్ష హోదాకు అడుగు దూరంలో నిలిచిపోయింది.

మోదీతో బీజేపీకి కొత్త శిఖరాలు
2004 నుంచి 2014 వరకు ప్రాంతీయ పార్టీలు, వామపక్షాలతో కలిసి కాంగ్రెస్‌ పదేళ్లు అధికారం చెలాయించింది. దిల్లీలో జరిగిన నిర్భయ ఘటన, అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం, 2జీ, కామన్‌వెల్త్‌, బొగ్గు, ఆదర్శ్‌ కుంభకోణాలు ఆ పార్టీ కాళ్లకింద భూమిని కంపింపజేశాయి. కాంగ్రెస్‌ అత్యంత బలహీనమైన స్థితిలో ఉన్న తరుణంలో 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మోదీని ప్రధాన మంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. దీంతో ఆ పార్టీకి కొత్త తరం ఓటర్లను దగ్గరయ్యేలా చేసింది. 1996 నుంచి 2009 వరకు పెద్దగా ఎదుగూబొదుగు లేకుండా ఉన్న పార్టీని మోదీ కొత్త శిఖరాలకు తీసుకెళ్లగలిగారు. 2014లో దేశ ప్రజలు బీజేపీకి సంపూర్ణ మెజారిటీ కట్టబెట్టి కాంగ్రెస్‌పట్ల ఉన్న తమ వ్యతిరేకతను ఓటు రూపంలో ప్రదర్శించారు. ఆ ధాటికి కాంగ్రెస్‌ 44 సీట్లకు పడిపోయి నిస్పృహలో కూరుకుపోయింది. ఒకవైపు మోదీ బలమైన వాగ్ధాటి, ఆకర్షణీయమైన పథకాలు, హిందూభావ జాలాన్ని ఉత్తర భారతదేశంలోని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం చేశారు. అలాగే కాంగ్రెస్‌ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉండటం వల్ల 2019లో బీజేపీ ఏకంగా 303 సీట్లను సొంతం చేసుకుంది.

అభివృద్ధి పథకాలే ప్రచారాస్త్రాలు
బీజేపీ తరహాలో సూక్ష్మ ప్రణాళికలు తయారు చేసుకుని ఎన్నికలు నిర్వహించే శక్తి కాంగ్రెస్‌కు లేకపోవడం కమలదళానికి మరో ఆయుధంగా మారింది. దానివల్ల నెగెటివ్‌ అంశాలను కూడా తనకు అనుకూలంగా మలుచుకుని ప్రత్యర్థులపై పైచేయి సాధించేలా బీజేపీ నేర్చుకోగలిగింది. ఆర్టికల్‌ 370 రద్దు, ట్రిపుల్‌ తలాక్‌, అయోధ్యలో రామాలయ నిర్మాణం, సీఏఏ అమలు లాంటి తన రాజకీయపరమైన ఎజెండాలతో పాటు, ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ, ఇంటింటికీ కొళాయి నీరు, ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలాంటి సంక్షేమ పథకాల ద్వారా తనపట్టును బలంగా నిలుపుకొనే ప్రయత్నం చేస్తోంది. పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంటు వరకు ప్రతి ఎన్నికనూ సీరియస్‌గా తీసుకొని గెలుపే లక్ష్యంగా పని చేస్తోంది. దాని ఫలితంగానే ఉత్తర్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లాంటి హిందీ ప్రభావిత ప్రాంతాల్లో స్వీప్‌ చేయగలిగే స్థితికి చేరింది.

2024 ఎన్నికల సంగ్రామం- ప్రజల దృష్టంతా ఈ '10'మందిపైనే!

44 రోజుల ప్రక్రియ- తొలి లోక్​సభ ఎన్నికల తర్వాత ఇప్పుడే ఎక్కువ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.