ETV Bharat / bharat

కన్నౌజ్‌పైనే అందరి ఫోకస్​- భార్య ఓటమికి అఖిలేశ్​ యాదవ్ రివెంజ్ తీర్చుకునేనా? - Lok Sabha Elections 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 11, 2024, 8:50 AM IST

Updated : May 11, 2024, 9:15 AM IST

Akhilesh Yadav Lok Sabha Polls : సార్వత్రిక ఎన్నికల నాలుగో విడతలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని కన్నౌజ్‌ లోక్‌సభ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ ఇక్కడ నుంచి బరిలో ఉండటమే అందుకు కారణం. సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటగా ఉన్న కన్నౌజ్‌లో 2019 సార్వత్రిక ఎన్నికల్లో అఖిలేశ్‌ భార్య డింపుల్‌ యాదవ్‌ బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. ఈసారి భార్య ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని అఖిలేశే స్వయంగా పోటీకి దిగారు.

Dimple Yadav, Akhilesh Yadav
Dimple Yadav, Akhilesh Yadav (Source : ETV)

Akhilesh Yadav Lok Sabha Polls : దేశంలో అత్యధిక లోక్‌సభ స్థానాలున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో తొలి మూడు విడతల్లో 26 సీట్లకు పోలింగ్‌ పూర్తైంది. నాలుగో విడతలో భాగంగా 13 స్థానాలకు మే 13న పోలింగ్ జరగనుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఈ 13 స్థానాలను కూడా క్లీన్‌స్వీప్ చేసింది. వీటిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న స్థానం కన్నౌజ్‌. సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ ఇక్కడ నుంచి బరిలోకి దిగడమే అందుకు కారణం.

తొలుత ఇక్కడ అఖిలేశ్‌ యాదవ్‌ మేనల్లుడు తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ను కన్నౌజ్‌లో తమ అభ్యర్థిగా ఎస్పీ ప్రకటించింది. తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్‌ యాదవ్‌కు అల్లుడు కూడా అవుతారు. లాలూ కుమార్తె రాజ్‌ లక్ష్మీ యాదవ్‌ను ఆయన వివాహం చేసుకున్నారు. తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ అభ్యర్థిత్వంపై సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు, పలువురు నేతల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో మనసు మార్చుకున్న అఖిలేశ్‌ స్వయంగా తానే కన్నౌజ్‌ బరిలో దిగాలని నిర్ణయం తీసుకున్నారు.

1998 నుంచి 2014 వరకు కన్నౌజ్‌ లోక్‌సభ నియోజకవర్గం సమాజ్‌వాదీ పార్టీ చేతిలోనే ఉండేది. కన్నౌజ్‌లో అఖిలేశ్ యాదవ్ మూడు సార్లు ఎంపీగా గెలుపొందారు. తొలిసారి 2000 సంవత్సరంలో విజయం సాధించిన ఆయన ఆ తర్వాత 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లోనూ గెలుపొందారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ గెలుపొందడం వల్ల కన్నౌజ్ లోక్‌సభ స్థానానికి అఖిలేశ్ రాజీనామా చేశారు. ఆ సమయంలో ఈ స్థానాన్ని అఖిలేశ్‌ తన భార్య డింపుల్ యాదవ్‌కు అప్పగించారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికలో అఖిలేశ్‌ భార్య డింపుల్‌ యాదవ్‌ కన్నౌజ్‌లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

2014 సార్వత్రిక ఎన్నికల్లో కూడా కన్నౌజ్‌లో గెలిచిన డింపుల్‌ యాదవ్‌ 2019లో మాత్రం అభ్యర్థి సుబ్రత్‌ పాఠక్‌ చేతిలో ఓడిపోయారు. సుబ్రత్ పాఠక్ 12,353 ఓట్ల తేడాతో డింపుల్ యాదవ్‌పై గెలుపొందారు. ఈసారి డింపుల్‌ సమాజ్‌వాదీ పార్టీకి మరొక కంచుకోట అయిన మైన్‌పురి బరిలో నిలవగా.. అఖిలేశ్‌ కన్నౌజ్‌లో పోటీ చేస్తున్నారు. ఇక్కడ సిటింగ్‌ ఎంపీ సుబ్రత్‌ పాఠక్‌కు మరోసారి టికెట్‌ ఇచ్చింది. అయిదేళ్ల కిందట తన భార్యను ఓడించిన సుబ్రత్‌పై బదులు తీర్చుకోవాలని అఖిలేశ్‌ ప్రణాళికలు రచిస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటలుగా భావించే కన్నౌజ్‌లో అఖిలేశ్‌ రాకతో పోరు రసవత్తరంగా మారింది. బీఎస్​పీ నుంచి ఇమ్రాన్‌ బిన్ జాఫర్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు సమాజ్‌వాదీ పార్టీకి కలిసొచ్చే అంశమని తెలుస్తోంది.

కన్నౌజ్‌లో ముస్లింలు, యాదవ్‌లు, దళిత ఓటర్లు సమాన సంఖ్యలో ఉంటారు. వీరి ఓట్ల సంఖ్య రెండున్నర లక్షల నుంచి 3 లక్షల చొప్పున ఉంటుంది. రాజ్‌పుత్‌, లోథీ వర్గాలకు చెందిన ఓటర్లు రెండు లక్షల చొప్పున ఉంటారు. దళితుల్లో బలమైన మద్దతు కలిగిన బీఎస్పీ ఇక్కడ ముస్లిం అభ్యర్థి ఇమ్రాన్‌ బిన్‌ జాఫర్‌ను బరిలో దింపింది. తద్వారా మైనార్టీ ఓట్లను తమవైపు తిప్పుకోవాలని బీఎస్పీ అభ్యర్థి మాయావతి భావిస్తున్నారు. యాదవ కుటుంబాన్ని దాటి అఖిలేశ్‌ ఆలోచించలేకపోతున్నారని కన్నౌజ్‌లో పోటీకి దింపేందుకు ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా దొరకలేదా అంటూ అఖిలేశ్‌పై మాయావతి విమర్శలు గుప్పించారు.

అయితే మైనార్టీలో ఎక్కువ శాతం అఖిలేశ్‌ పక్షానే ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అభ్యర్థి సుబ్రత్‌ పాఠక్‌ ఎక్కువగా ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ చరిష్మాపైనే ఆధారపడ్డారు. ప్రస్తుతానికి అఖిలేశ్‌ది కాస్త పైచేయిలా కనిపిస్తున్నా, సమాజ్‌వాదీ పార్టీకి మధ్య ఓట్ల తేడా పెద్ద ఎక్కువగా లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అఖిలేశ్‌తో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ఈసారి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు. వారంతా ఓటమి చెందడం ఖాయమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

బెయిల్​పై అరవింద్ కేజ్రీవాల్ రిలీజ్​- కానీ సీఎం ఆఫీస్​కు వెళ్లేందుకు నో ఛాన్స్​ - Arvind Kejriwal Case

రాష్ట్రపతికి రాజ్​భవన్ మహిళా ఉద్యోగి లేఖ- గవర్నర్ అలా చేయడంపై అభ్యంతరం! - West Bengal Governor Case

Last Updated : May 11, 2024, 9:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.