ETV Bharat / bharat

బెయిల్​పై అరవింద్ కేజ్రీవాల్ రిలీజ్​- కానీ సీఎం ఆఫీస్​కు వెళ్లేందుకు నో ఛాన్స్​ - Arvind Kejriwal Case

author img

By ETV Bharat Telugu Team

Published : May 10, 2024, 2:18 PM IST

Updated : May 10, 2024, 8:21 PM IST

Arvind Kejriwal
Arvind Kejriwal (Source : ANI)

Arvind Kejriwal Bail : మద్యం కేసులో అరెస్టైన దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్‌ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడం వల్ల జైలు నుంచి బయటకు వచ్చారు.

Arvind Kejriwal Bail : మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో అరెస్టైన దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్‌ కేజ్రీవాల్‌ జైలు నుంచి విడుదలయ్యారు. లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో జూన్​ 1 వరకు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్​ మంజూరు చేయడం వల్ల జైలు నుంచి శుక్రవారం సాయంత్రం బయటకు వచ్చారు. జైలు నుంచి విడుదలైన ఆయనకు ఆప్​ పార్టీ నేతలు, విపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. జైలు నుంచి బయటకు కారులో వెళ్తూ ప్రజలకు ఆయన అభివాదం చేశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ వారికి అభివాదం చేస్తూ ప్రసంగించారు. కేజ్రీవాల్‌ ఇంటి వద్ద ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. దాదాపు 50 రోజుల తర్వాత విడుదలైన కేజ్రీవాల్‌ తన కాన్వాయ్‌లో ఇంటికి బయల్దేరారు. వాహనంలో ఆయన సతీమణి సునీత, కుమార్తె హర్షిత, ఆప్‌ రాజ్యసభ ఎంపీ సందీప్‌ పాఠక్‌ ఉన్నారు. మరోవైపు ఆయన విడుదల నేపథ్యంలో తిహాడ్​ జైలు వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

హనుమాన్‌ వల్లే బయటకు వచ్చా!
"హనుమాన్‌ దయ వల్లే బయటకు వచ్చాను. శనివారం ఉదయం 11గంటలకు హనుమాన్‌ ఆలయాన్ని దర్శిస్తా. మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన సుప్రీంకోర్టు జడ్జిలకు కృతజ్ఞతలు. వారి వల్లే ఈరోజు మీ ముందుకొచ్చాను. నన్ను ఆశీర్వదించిన కోట్లాది మంది ప్రజలకు కృతజ్ఞతలు. నియంతృత్వం నుంచి మన దేశాన్ని కాపాడుకోవాలి. నా శక్తిమేరకు పోరాడతాను. కానీ, 140 కోట్ల మంది ప్రజల మద్దతు కావాలి. శనివారం మధ్యాహ్నం 1గంటకు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహిస్తాం" అని కేజ్రీవాల్​ చెప్పారు.

అంతకుముందు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జూన్‌ 1 వరకు అరవింద్‌ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ బెయిల్‌ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఆయనకు జూన్‌ 1 వరకు బెయిల్‌ ఇస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. రూ.50వేల పూచీకత్తు, అంతే మొత్తానికి ఒకరి ష్యూరిటీపై ఈ బెయిలిచ్చింది.

కేజ్రీవాల్‌కు జూన్‌ 5వ తేదీ వరకు (ఎన్నికల ఫలితాల మరుసటిరోజు) మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలంటూ సీఎం తరఫు న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ చేసిన అభ్యర్థనను ధర్మాసనం తిరస్కరించింది. జూన్‌ 2న ఆయన లొంగిపోయి తిరిగి జైలుకు వెళ్లాలని స్పష్టం చేసింది. బెయిల్‌ నిబంధనలను కేజ్రీవాల్​ తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. సీఎం కార్యాలయానికి గానీ, దిల్లీ సచివాలయానికి గానీ వెళ్లొద్దని ఆదేశించింది. మద్యం కేసులో తనపై వచ్చిన అభియోగాల గురించి కూడా మాట్లాడొద్దని స్పష్టం చేసింది. కేసుకు సంబంధించిన అధికారిక ఫైళ్లను చూడొద్దని, సాక్షులతో మాట్లాడొద్దని తెలిపింది.

"ప్రతి కేసులోని వాస్తవాల ఆధారంగా మధ్యంతర బెయిల్ మంజూరు అవుతుంది. అరవింద్ కేజ్రీవాల్ అందుకు మినహాయింపు కాదు. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా సంపూర్ణ, స్వేచ్ఛావాద దృక్పథాన్ని సమర్థిస్తూ బెయిల్ ఇచ్చాం. కేజ్రీవాల్‌కు ఎలాంటి నేర చరిత్రలు లేవు. సమాజానికి ఆయన ప్రమాదకరం కాదు. కేజ్రీవాల్ ఈ కేసులో ఇంకా దోషిగా నిర్ధరణ కాలేదు" అంటూ బెయిల్ మంజూరు చేసే సమయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది.

'ఎన్నికల ప్రచారంపై ఎలాంటి ఆంక్షలు లేవ్​'
అయితే కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంపై ఎలాంటి ఆంక్షలు లేవని ఆయన తరఫున వాదిస్తున్న న్యాయవాది షాదన్ ఫారసత్ సుప్రీంకోర్టు తీర్పు అనంతరం తెలిపారు. శుక్రవారమే కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల అయ్యేలా ప్రయత్నిస్తామని చెప్పారు. మరోవైపు, తమ అభిమాన నాయకుడికి బెయిల్ మంజూరు కావడం వల్ల దిల్లీలోని ఆప్ కార్యాలయం ఎదుట కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కేజ్రీవాల్​కు అనుకూలంగా నినాదాలు చేశారు.

'పెద్దగా తేడా ఏం ఉండదు'
మరోవైపు, కేజ్రీవాల్‌ అభ్యర్థనను ఈడీ వ్యతిరేకించగా సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రచారం కారణంతో ఆయనను విడుదల చేయడం సరికాదని దర్యాప్తు సంస్థ కోర్టుకు విన్నవించింది. "ఏడాదిన్నర నుంచి ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నారు. కానీ మార్చిలో ఆయనను అరెస్టు చేశారు. ఇప్పుడు ఈ 21 రోజులు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసినంత మాత్రాన పెద్దగా తేడా ఏం ఉండదు" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

'ఇది ప్రజాస్వామ్య విజయం'
కేజ్రీవాల్​కు బెయిల్ మంజూరు అవ్వడాన్ని ప్రజాస్వామ్యంతోపాటు రాజ్యాంగ విజయంగా అభివర్ణించారు ఆప్ నాయకురాలు, దిల్లీ మంత్రి ఆతిశీ. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో సుప్రీంకోర్టు ప్రధాన పాత్ర పోషిస్తుందని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్​కు బెయిల్ మంజూరు చేసినందుకు అత్యున్నత న్యాయస్థానానికి దిల్లీ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారని మరో మంత్రి గోపాల్​ రాయ్ తెలిపారు. మరోవైపు, కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్​తోపాటు తృణామూల్ కాంగ్రెస్ స్వాగతించింది.

మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21వ తేదీన అరవింద్​ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అంతకుముందు ఈ కేసులో విచారణకు రావాలంటూ దర్యాప్తు సంస్థ తొమ్మిదిసార్లు సమన్లు జారీ చేసింది. వాటికి స్పందించకపోవడం వల్ల అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన తిహాడ్‌ జైలులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. తన అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటం వల్ల ఎన్నికల కోసం మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని అభ్యర్థించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.

'సీఎం విధులకు ఎవరైనా అంతకాలం దూరంగా ఉండొచ్చా?'- కేజ్రీవాల్ అరెస్టుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు - Arvind Kejriwal Delhi High Court

'కావాలనే కేజ్రీవాల్ అవన్నీ తింటున్నారు- అంతా బెయిల్ కోసమే!' - Kejriwal Arrest

Last Updated :May 10, 2024, 8:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.