తెలంగాణ

telangana

'రూ2వేల నోట్లు మార్చి ఇస్తే రూ.300 కూలీ'- RBI కౌంటర్ల వద్ద భారీగా క్యూ, వారిపై అధికారుల నిఘా

By ETV Bharat Telugu Team

Published : Nov 2, 2023, 2:38 PM IST

Money For Exchanging 2000 Notes

Money For Exchanging 2000 Notes :రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కౌంటర్​లలో రూ.2వేల నోట్లను మార్చుకునేందుకు వచ్చినవారిపై ఎకనామిక్ అఫెన్స్ వింగ్(ఈఓడబ్ల్యూ) అధికారులు నిఘా పెట్టారు. ఒడిశాలోని భువనేశ్వర్​లో ఆర్​బీఐ కౌంటర్ వద్ద క్యూలో నిల్చున్నవారిని ప్రశ్నించారు. ఇతరుల డబ్బును మార్చేందుకు వచ్చారా అని ఆరా తీశారు. కూలీ తీసుకొని రూ.2వేల నోట్లను మార్చుకునేందుకు వస్తున్నారని మీడియా కథనాల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఈఓడబ్ల్యూ అధికారులు తెలిపారు. రూ.20వేలు డిపాజిట్ చేసిన వారికి రూ.300 కూలీగా చెల్లిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.

"పెద్ద నోట్ల మార్పిడికి వచ్చినవారి ఆధార్ కార్డులను పరిశీలిస్తున్నాం. వారు చేసే పని ఏంటో అడుగుతున్నాం. క్యూలో నిల్చున్నవారిలో చాలా మంది వద్ద సరిగ్గా 10 నోట్లే ఉన్నాయి. అందరి దగ్గర ఒకే రకంగా అలా ఎలా ఉంటాయి? వారు నిజంగానే తమ కోసం మార్చుకునేందుకు వచ్చారా లేదా అని అనుమానించేందుకు కారణాలు ఉన్నాయి" అని ఈఓడబ్ల్యూ అధికారులు పేర్కొన్నారు. క్యూలో ఉన్నవారిని ప్రశ్నించడమే కాకుండా.. ఆర్​బీఐ కౌంటర్ ప్రాంగణంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని వారు పరిశీలిస్తున్నారు.

'రెండు ఆప్షన్స్ ఉన్నాయ్..'
మరోవైపు, తమను ఈఓడబ్ల్యూ అధికారులు కలవలేదని ఆర్​బీఐ ప్రాంతీయ డైరెక్టర్ ఎస్​పీ మొహంతి పేర్కొన్నారు. క్యూలో ఉన్నవారిని వారు ప్రశ్నలు అడుగుతుండొచ్చని అన్నారు. ఏదైనా వివరణ కోరేందుకు వస్తే పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు. ఇదివరకు బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు అవకాశం ఉండగా.. ఆర్​బీఐ కౌంటర్​కు వీరంతా ఎందుకు వచ్చారని ప్రశ్నించగా.. వారికి రెండు ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయని బదులిచ్చారు మొహంతి.

ఆర్​బీఐ శాఖల వద్ద రద్దీ..
కాగా, బ్యాంకుల్లో రూ.2వేల రూపాయల నోట్ల మార్పిడికి గడువు ముగిసిపోవడం వల్ల రిజర్వు బ్యాంక్ శాఖల వద్ద.. రద్దీ భారీగా పెరిగింది. తమ దగ్గర మిగిలిపోయిన రూ.2వేల నోట్లు మార్చుకునేందుకు దేశంలోని 19 రిజర్వ్ బ్యాంక్ శాఖల వద్ద ప్రజలు క్యూ కడుతున్నారు. ఆయా శాఖల వద్ద ఆర్​బీఐ కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. ఎండ తగలకుండా టెంట్లు, తాగునీరు అందుబాటులో ఉంచింది. ప్రజలు భారీగా వస్తుండడం వల్ల క్యూలో 2 నుంచి 3 గంటల వరకు వారు వేచి చూడాల్సి వస్తోంది. ఒక రోజు 10 నోట్లను మాత్రమే మార్చుకోవడానికి వీలుంది. ఇందుకు ఏదైనా గుర్తింపు కార్డును బ్యాంకు సిబ్బందికి చూపించాల్సి ఉంటుంది.

మే 19న రూ.2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ఆర్​బీఐ ప్రకటించింది. బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయాలని లేదా మార్చుకోవాలని తొలుత సెప్టెంబరు చివరి వరకు గడువు విధించింది. ఆ తర్వాత దాన్ని అక్టోబర్‌ 7 వరకు పొడిగించింది. ఆ గడువు కూడా తీరిన నేపథ్యంలో ఇప్పుడు దేశంలోని ఆర్​బీఐ శాఖల వద్దే నోట్లను మార్చుకోవాలని స్పష్టం చేసింది. ఇప్పటివరకు 97 శాతం రూ.2వేల నోట్లు తిరిగి వచ్చినట్లు ఆర్​బీఐ పేర్కొంది. ఇంకా 10 వేల కోట్ల రూపాయల విలువ చేసే రూ.2 వేల నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని ఆర్​బీఐ వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details