తెలంగాణ

telangana

Delhi High Court Issues Notices to AP CM Jagan Couple: పత్రిక కొనడానికి నెలకు రూ.200 ఇస్తున్న ప్రభుత్వం.. ఏపీ సీఎం దంపతులకు దిల్లీ హైకోర్టు కోర్టు నోటీసులు

By ETV Bharat Telugu Team

Published : Sep 15, 2023, 8:41 AM IST

Delhi_High_Court_Issues_Notices_to_AP_CM_Jagan_Couple

Delhi High Court Issues Notices to AP CM Jagan Couple :గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా "సాక్షి పత్రిక" కొనుగోలు చేయడానికి వీలుగా ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను సవాలు చేస్తూ దాఖలైన కేసులో దిల్లీ హైకోర్టు జారీ చేసిన నోటీసులను.. మంగళగిరి కోర్టు సిబ్బంది గురువారం సీఎం జగన్‌, సాక్షి ఛైర్‌పర్సన్‌ భారతీరెడ్డిలకు అందజేశారు. దిల్లీ హైకోర్టు వీరికి గత నెల 14న నోటీసులు జారీ చేసింది. సీఎం జగన్‌, భారతీరెడ్డి నివాసం ఉంటున్న తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మంగళగిరి కోర్టు పరిధిలోకి రావడంతో.. ఈ కోర్టు తన సిబ్బంది ద్వారా దిల్లీ హైకోర్టు నోటీసులను అందజేసింది. అవి వారికి అందినట్లు ఎక్‌నాలెడ్జ్‌మెంట్‌ కూడా తీసుకున్నట్లు తెలిసింది. 

వార్తా పత్రికల కొనుగోలు కోసం వాలంటీర్లు, ఇతర ఉద్యోగులకు నెలకు 200 రూపాయలు చొప్పున కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను సవాల్‌ చేస్తూ ఉషోదయా పబ్లికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ దాఖలు చేసిన కేసుల విచారణను ఏపీ హైకోర్టు నుంచి దిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఏప్రిల్‌ 17న ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసుపై దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్రశర్మ, జస్టిస్‌ సంజీవ్‌ నరులాలతో కూడిన ధర్మాసనం ఆగస్టు 14న విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సీఎం జగన్‌, భారతీరెడ్డి, ఆడిట్‌ బ్యూరో ఆఫ్‌ సర్క్యులేషన్‌కు నోటీసులు ఇస్తూ ఉత్తర్వులిచ్చింది. నాలుగు వారాల్లోపు సమాధానం ఇవ్వాలని పేర్కొంటూ, తదుపరి విచారణ సెప్టెంబరు 22కి వాయిదా వేసింది

ABOUT THE AUTHOR

...view details