తెలంగాణ

telangana

WEIGHT LOSS: నడవకుండా బరువు తగ్గేందుకు టిప్స్​

By

Published : Oct 8, 2021, 4:52 PM IST

నాకు 31 ఏళ్లు. పెళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు. రెండోసారి గర్భం ధరించినప్పుడు థైరాయిడ్‌ సమస్య మొదలైంది. దీంతో బరువు పెరిగి మోకాలి చిప్ప అరిగింది. ఇప్పుడు బరువు 68 కిలోలు. ఇటీవల మోకాలి నొప్పి ఎక్కువైంది. డాక్టర్‌ 15 కిలోల బరువు తగ్గాలని చెప్పారు. కానీ నడవొద్దన్నారు. మరి బరువు తగ్గేదెలా? - ఓ మహిళ

Tips For Weight Loss Without Exercise And Walking
WEIGHT LOSS: నడవకుండా బరువు తగ్గాలంటే ఏం చేయాలంటే?

వివరాలను బట్టి చూస్తుంటే మీరు 'కాండ్రోమలేషియా పటెల్లా' సమస్యతో బాధపడుతున్నారని తోస్తోంది. ఇది చిన్నవయసులోనే తలెత్తే మోకాలి చిప్ప అరుగుదల సమస్య. తరచూ చూస్తున్నదే. సాధారణంగా 30 ఏళ్లు దాటాక బరువు పెరుగుతూ వస్తుంటుంది. దీనికి తోడు మీరు థైరాయిడ్‌ సమస్యతో బాధపడుతున్నారు. ఫలితంగా బరువు బాగా పెరిగి, మోకాళ్ల మీద భారం పడి, చిప్పలు అరిగిపోయి ఉండొచ్చు. ఇలాంటి స్థితిలో 15 కిలోల బరువు తగ్గటమనేది పెద్ద లక్ష్యమనే అనుకోవచ్చు.

మిమ్మల్ని నడవొద్దని డాక్టరు ఎందుకు చెప్పారో అర్థం కావటం లేదు. మోకాలి చిప్ప అరిగినంత మాత్రాన నడవకూడదనేమీ లేదు. మెట్లు ఎక్కటం, దిగటం, పరుగెత్తటం, గెంతటం.. నేల మీద, తక్కువ ఎత్తు సోఫాల మీద కూర్చోవటం, లేవటం వంటివి చేస్తున్నప్పుడే చిప్ప పైన ఎక్కువ బరువు పడుతుంది. సమతులంగా ఉన్న నేల మీద నడిస్తే పెద్ద ఇబ్బందేమీ ఉండదు. కాకపోతే ముందుగా మీరు మోకాలికి దన్నుగా నిల్చే కండరాలను బలోపేతం చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు పడుకొని, కూర్చొని చేసే వ్యాయామాలు తోడ్పడతాయి. కండరాలు బలపడ్డాక నడవటం వంటివి చేయొచ్చు.

ఒకవేళ నడవకుండా బరువు తగ్గించుకోవాలనుకుంటే నీటిలో చేసే వ్యాయామాలు ఉపయోగపడతాయి. నీటిలో దిగినప్పుడు శరీరం మొత్తం బరువును నీరు తీసేసుకుంటుంది. దీంతో వ్యాయామాలు ఐదు రెట్లు ఎక్కువ ప్రభావం చూపుతాయి. త్వరగా బరువు తగ్గుతుంది. అదీ మోకాళ్ల మీద ఎలాంటి బరువు పడకుండానే. నీటి వ్యాయామాలకు వెసులుబాటు లేకపోతే ఇంట్లోనే కొన్ని వ్యాయామాలు ప్రయత్నించొచ్చు. ఒక్క నడకతోనే కాదు. మోకాళ్ల మీద ఒత్తిడి పడకుండా (నాన్‌ వెయిట్‌ బేరింగ్‌) తుంటి, పొట్ట, శరీర పైభాగాన్ని బలోపేతం చేసే వ్యాయామాలతోనూ బరువు తగ్గుతుంది. దగ్గర్లోని ఫిజియోథెరపిస్టును సంప్రదిస్తే మీకు వీటిని నేర్పిస్తారు. ఒకవేళ నొప్పి ఎక్కువగా ఉంటే మోకాలి చిప్పలో సమస్య ఉన్నచోటును గుర్తించి, కైనేజియో టేపింగ్‌ (స్పోర్ట్స్‌ టేపింగ్‌) ప్రక్రియను ప్రయత్నించొచ్చు. దీంతో వెంటనే చాలావరకు నొప్పి తగ్గుతుంది. అప్పుడు వ్యాయామాలు తేలికగా చేసుకోవటానికి వీలవుతుంది. స్పోర్ట్‌ టేపింగ్‌ ప్రక్రియ అందుబాటులో లేకపోతే మోకాలి క్యాప్‌ అయినా ధరించొచ్చు. నొప్పిని భరించేంతవరకు వ్యాయామాలు చేస్తూ.. అంచెలంచెలుగా పెంచుకుంటూ రావాలి. మూడు నెలలు కష్టపడితే ఫలితం కనిపిస్తుంది. వీటితో పాటు థైరాయిడ్‌ మందులు వేసుకోవటం, ఆహార పద్ధతులు పాటించటం కూడా ముఖ్యం.

.

ఇదీ చూడండి..బరువు తగ్గాలంటే.. తాగే నీటిలో ఇవి కలపాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details