తెలంగాణ

telangana

ఇవీ అస్తవ్యస్త రోగనిరోధక వ్యవస్థ లక్షణాలే!

By

Published : Apr 12, 2021, 10:30 AM IST

జబ్బులు రాకుండా చూడటంలోనైనా, జబ్బులు తగ్గటంలోనైనా రోగనిరోధక వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందన్నది తెలిసిందే. ఇది అన్నిసార్లూ ఒకేలా ఉండాలనేమీ లేదు. కొన్నిసార్లు బలహీనపడొచ్చు, మరి కొన్నిసార్లు మందకొడిగా పనిచేస్తుండొచ్చు. ఇంకొన్నిసార్లు అతిగా, అనవసరంగా ప్రేరేపితమై పొరపాటున మన శరీరం మీదే దాడి చేస్తుండొచ్చు. దీంతో అలర్జీ లక్షణాల దగ్గర్నుంచి దీర్ఘకాల సమస్యల వరకు రకరకాల ఇబ్బందులు తలెత్తుతాయి. రోగనిరోధక వ్యవస్థ పనితీరుతో ముడిపడిన అలాంటి సమస్యలు, లక్షణాల్లో కొన్ని ఇవీ..

Immunity issues
ఇవీ అస్తవ్యస్త రోగనిరోధక వ్యవస్థ లక్షణాలే!

వ్యాధి సోకకుండా చూడటంలోనూ లేదా వచ్చిన జబ్బులను తగ్గించడంలోనూ రోగనిరోధక వ్యవస్థది కీలక పాత్ర. అయితే.. ఇది ఎల్లవేళలా ఒకేలా ఉండదు. రోగ నిరోధక వ్యవస్థ పనితీరుతో ముడిపడిన అలాంటి సమస్యలు, లక్షణాలను ఓసారి పరిశీలిద్దాం..

కళ్లు పొడిబారటం

కళ్లు అదేపనిగా, అతిగా పొడిబారటం జాగ్రన్స్‌ సిండ్రోమ్‌ లక్షణం కావొచ్చు. కన్నీరు కళ్లను తేమగా ఉండేలా చేస్తుంది కదా. జాగ్రన్స్‌ సిండ్రోమ్‌ గలవారిలో రోగనిరోధక వ్యవస్థ దీన్నే దెబ్బతీస్తుంది. కన్నీరు ఎండిపోయేలా చేస్తుంది. ఫలితంగా కళ్లు పొడిబారటం, ఎర్రబడటం వంటివి వేధిస్తాయి. కళ్లలో ఇసుక పడ్డట్టుగానూ అనిపిస్తుంటుంది. చూపు, రెటీనా కూడా దెబ్బతినొచ్చు.

కుంగుబాటు

కుంగుబాటు

కుంగుబాటు (డిప్రెషన్‌) మానసిక జబ్బే అయినా రోగనిరోధక వ్యవస్థ కూడా దీనికి కారణం కావొచ్చు. గతి తప్పిన రోగనిరోధక వ్యవస్థ మూలంగా వాపు ప్రక్రియను (ఇన్‌ఫ్లమేషన్‌) ప్రేరేపించే సైటోకైన్లు మెదడులోకి చేరుకోవచ్చు. ఇవి మూడ్‌ను, ఉత్సాహాన్ని ఉత్తేజితం చేసే సెరటోనిన్‌ వంటి రసాయనాల మోతాదులను తగ్గించొచ్చు. దీంతో నిరుత్సాహం ఆవహిస్తుంది. మంచి విషయం ఏంటంటే- వ్యాయామంతో వాపు ప్రక్రియ తగ్గటం, సెరటోనిన్‌ స్థాయులు పుంజుకోవటం. ఇవి కుంగుబాటు తగ్గటానికి తోడ్పడతాయి.

చర్మం మీద దద్దు

ఎండుగజ్జిలో (ఎగ్జిమా) చర్మం మీద తలెత్తే దద్దుకూ రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించటమే కారణం. చర్మం మీద పొలుసులతో కూడిన సోరియాసిస్, సోరియాటిక్‌ ఆర్థ్రయిటిస్‌ సైతం దీంతో ముడిపడినవే. గతి తప్పిన రోగనిరోధక వ్యవస్థతో ప్రేరేపితమయ్యే వాపు ప్రక్రియ చర్మ కణాల మీద దాడి చేయటమే వీటికి మూలం. ఇలాంటి సమస్యల్లో చర్మం ఎర్రబడటం, పొలుసులు లేవటం, నొప్పితో కూడిన ఎర్రటి దద్దు వంటివి కనిపిస్తాయి.

జీర్ణ సమస్యలు

జీర్ణ సమస్యలు

కడుపుబ్బరం, కడుపునొప్పి, విరేచనాల వంటివి చాలావరకు మామూలు సమస్యలే కావొచ్చు. కొన్నిసార్లు పేగుపూత (క్రాన్స్‌), పెద్దపేగులో పుండ్లు (అల్సరేటివ్‌ కొలైటిస్‌), గోధుమల్లోని గ్లూటెన్‌ పడకపోవటం వల్ల తలెత్తే సీలియాక్‌ డిసీజ్‌ వంటి సమస్యల్లోనూ ఇలాంటివి వేధించొచ్చు. వీటికీ రోగనిరోధక వ్యవస్థ పనితీరే కారణం.

ఇదీ చదవండి:రోజూ ఒక గుడ్డు ఎందుకు తినాలంటే.?

చేతులు, పాదాలు చల్లబడటం

చల్లటి వాతావరణంలో చేతులు, పాదాలు తెల్లగా లేదా నీలిరంగులోకి మారుతున్నాయా? ఇవి రేనాడ్స్‌ డిసీజ్‌ లక్షణాలు కావొచ్చు. ఇందులో చల్లటి వాతావరణంలో చేతులకు, పాదాలకు రక్తసరఫరా తగ్గుతుంది. దీంతో చేతులు, పాదాల చల్లగా అనిపిస్తాయి. రంగూ మారుతుంది. రేనాడ్స్‌ డిసీజ్‌ కూడా రోగనిరోధక నిరోధక వ్యవస్థ పొరపాటున మన మీదే దాడి చేయటం వల్ల తలెత్తేదే. రోగనిరోధక వ్యవస్థ మూలంగా థైరాయిడ్‌ గ్రంథి మందకొడిగా పనిచేయటం వల్ల.. చేతులు, పాదాలు చల్లగా అనిపించొచ్చు.

జుట్టు ఊడటం

జుట్టు ఊడటం

రోగనిరోధక వ్యవస్థ వెంట్రుకల కుదుళ్ల మీదా దాడి చేయొచ్చు. దీంతో జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఊడిపోవచ్చు. తల మీదే కాదు.. గడ్డం వంటి చోట్లా వెంట్రుకలు రాలిపోవచ్చు. మాడు మీద సోరియాసిస్‌ మూలంగానూ జుట్టు ఊడిపోవచ్చు.

ఎండ పడకపోవటం

రోగనిరోధక సమస్యలు ఎండ పడకపోవటానికీ దారితీయొచ్చు. ముఖ్యంగా ల్యూపస్‌తో బాధపడేవారికి ఏమాత్రం ఎండ తగిలినా చర్మం చురుక్కుమంటుంది. వీరి చర్మానికి ఎండ తగిలినప్పుడు రోగనిరోధక వ్యవస్థ ప్రేరేపితమై ఇబ్బందులు సృష్టిస్తుంది. అందువల్ల ల్యూపస్‌ గలవారు ఎండలోకి వెళ్లినప్పుడు టోపీ, చలువ అద్దాలు ధరించటం.. సన్‌స్క్రీన్‌ లోషన్లు రాసుకోవటం మంచిది.

పుండ్లు త్వరగా మానకపోవటం

గీసుకోవటం, కోసుకోవటం వంటి మామూలు గాయాలు సైతం త్వరగా మానకుండా వేధిస్తున్నాయా? ఇందుకు రోగనిరోధక వ్యవస్థ పనితీరు మందగించటం కూడా కారణమై ఉండొచ్చు. రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంటే గాయాలకు వేగంగా స్పందిస్తుంది. గాయం మానటానికి అవసరమైన పోషకాలను అక్కడికి చేరవేస్తుంది. అదే మందకొడిగా పనిచేస్తే గాయాలు మానకుండా దీర్ఘకాలం వేధిస్తుంటాయి.

మాటిమాటికీ జబ్బులు

మాటిమాటికీ జబ్బులు

తరచూ జలుబు, ఫ్లూ వంటి జబ్బుల బారినపడుతున్నా రోగనిరోధక వ్యవస్థ సరిగా పనిచేయటం లేదన్నమాటే. ఏడాదికి నాలుగు, అంతకన్నా ఎక్కువసార్లు చెవి, సైనస్‌ ఇన్‌ఫెక్షన్లు.. ఏడాదికి రెండు సార్లు న్యుమోనియా బారినపడుతుంటే లేదూ ఏటా రెండు, అంతకన్నా ఎక్కువసార్లు యాంటీబయోటిక్‌ మందులు వేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతున్నా రోగనిరోధక వ్యవస్థ బలహీనపడిందనే అనుకోవచ్చు.

నిస్సత్తువ, నీరసం

పనులు ఎక్కువైనప్పుడు అలసిపోవటం సహజమే. కానీ తరచూ అలసట, నీరసం ముంచుకొస్తుంటే.. అదీ కంటి నిండా నిద్రపోయినా ఇవి తలెత్తుతుంటే రోగనిరోధక వ్యవస్థ మందకొడిగా పనిచేస్తుందనే అర్థం. రోగనిరోధక వ్యవస్థ అతిగా ప్రేరేపితం కావటం వల్ల తలెత్తే వాపు ప్రక్రియ సైతం నిస్సత్తువకు దారితీయొచ్చు.

ఇదీ చదవండి:ప్రశాంతమైన నిద్రకు నాలుగు గ్యాడ్జెట్‌లు!

ABOUT THE AUTHOR

...view details