తెలంగాణ

telangana

Errabelli meet Rakesh family: చేతులెత్తి మొక్కుతున్నా.. రాజకీయం చేయకుండ్రి: ఎర్రబెల్లి

By

Published : Jun 27, 2022, 5:15 PM IST

Errabelli meet Rakesh family: రాకేశ్ మరణాన్ని రాజకీయం చేయొద్దని ప్రతిపక్షాలకు రాష్ట్రమంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు విజ్ఞప్తి చేశారు. ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం డబీర్ పేటలో నిర్వహించిన రాకేశ్​ సంతాపసభకు ఆయన హాజరయ్యారు.

Errabelli meet Rakesh family
ఎర్రబెల్లి దయాకర్​ రావు

Errabelli meet Rakesh family: సికింద్రాబాద్‌ అల్లర్లలో చనిపోయిన రాకేశ్‌ కుటుంబాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి పరామర్శించారు. వరంగల్‌ జిల్లా ఖానాపురం డబీర్‌పేటలో రాకేశ్‌ చిత్రపటానికి పూలమాల వేసి మంత్రి నివాళులర్పించారు. అనంతరం రాకేష్ తండ్రి కుమారస్వామికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల చెక్కు అందించారు. రాకేశ్‌ సోదరుడు రామరాజుకు నర్సంపేట ఆర్డీవో కార్యాలయంలో ఉద్యోగం ఇస్తున్నట్లు వెల్లడించారు. రామరాజుకు నియామక పత్రం మంత్రి చేతులమీదుగా అందజేశారు.

రాకేశ్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. మనం పంజాబ్​ రైతుల కోసం డబ్బులు ఇచ్చినం. దేశం కోసం చనిపోయిన యువకుడి కుటుంబాన్ని కేంద్రం ఆదుకోవాలి. దయచేసి ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దు. కేసీఆర్​లాగా మీరు సాయం చేయండి. మీ పార్టీల తరఫున రాకేశ్​ కుటుంబాన్ని ఆదుకోండి. త్వరలోనే ఆ కుటుంబాన్ని ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్తాం. ఈ ఊరిని దత్తత తీసుకుంటా. సీసీ రోడ్ల కోసం రూ.50 లక్షలు ప్రకటిస్తున్నా.

- ఎర్రబెల్లి దయాకర్​రావు, రాష్ట్ర పంచాయతీరాజ్​ శాఖ మంత్రి

ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దు:రాకేశ్ మరణాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దని మంత్రి ఎర్రబెల్లి హితవు పలికారు. దేశ సేవ చేయాలనే సంకల్పంతో ఉన్న యువకుడి మరణం తీరని లోటు అన్నారు. కేంద్రం, ఇతర పార్టీలు ఆ కుటుంబానికి సాయం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాకేశ్ ఆత్మ శాంతించాలంటే కేంద్రం అగ్నిపథ్​ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. డబీర్​ పేటను దత్తత తీసుకుంటున్నట్లు ఎర్రబెల్లి ప్రకటించారు. సీసీ రోడ్ల నిర్మాణాలకు తక్షణమే రూ.50 లక్షల రూపాయలు అందజేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

చేతులెత్తి మొక్కుతున్నా.. రాజకీయం చేయకుండ్రి: ఎర్రబెల్లి

ABOUT THE AUTHOR

...view details