తెలంగాణ

telangana

BANDI SANJAY: 'ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే ఆ మాస్టారు వల్లే..'

By

Published : Sep 5, 2021, 1:36 PM IST

Updated : Sep 5, 2021, 2:18 PM IST

bjp leader bandi sanjay participated in teachers day

భాజపా ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులను బండి సత్కరించారు. ఉపాధ్యాయులతో తనకున్న అనుబంధాన్ని బండి గుర్తు చేసుకున్నారు. తన నాన్న ఉపాధ్యాయుడు కావటం వల్లే.. తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని స్పష్టం చేశారు.

'ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే ఆ మాస్టారు వల్లే..'

రాష్ట్రంలో బడులను పక్కనబెట్టి కిలోమీటరుకు ఓ బారును తెరిచారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వికారాబాద్​ జిల్లా నవాబ్​పేట మండలం మమ్మదాన్​పల్లిలో​ నిర్వహించిన కార్యక్రమంలో భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో కలిసి పాల్గొన్నారు. రాజకీయ లబ్ధి కోసం సీఎం ద్వంద్వ వైఖరిని అవలంభిస్తున్నారని విమర్శించారు. కరోనా వ్యాప్తి పేరిట హుజూరాబాద్ ఎన్నికలు వాయిదా వేసి... పాఠశాలలు మాత్రం తెరిచారని విమర్శించారు. ఉపాధ్యాయులు ఐక్యమై అరాచక పాలనకు చరమగీతం పాడాలని బండిసంజయ్‌ పిలుపునిచ్చారు.

మా నాన్న పెంపకం వల్లే..

"ఎంతో మంది విద్యార్థులను క్రమశిక్షణ కలిగిన పౌరులుగా తీర్చిదిద్దేందుకు అనునిత్యం కృషి చేసే గొప్ప వృత్తి ఉపాధ్యాయులది. నాకు ఉపాధ్యాయులంటే అమితమైన ప్రేమ, గౌరవం. మా నాన్న కూడా ఓ ఉపాధ్యాయుడే. ఈ రోజు ఓ సామాన్య కార్యకర్త నుంచి జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షునిగా ఎదిగానంటే.. దాని వెనుక మా నాన్న పెంపకం ఘనతే. ఉపాధ్యాయునిగా ఎంతో క్షమశిక్షణగా నన్ను పెంచాడు కాబట్టే.. ఇప్పుడు ఇలా అన్ని విషయాలను అవగాహన చేసుకుని... ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచించగలుగుతున్నాను. ఇప్పుడున్న ఉపాధ్యాయులు తలుచుకుంటే.. ఎంపీలు కాగలరు.. కానీ నేను తలుచుకుంటే ఉపాధ్యాయున్ని కాలేను. తమ పిల్లలను పక్కనున్నా... తాము బోధించే విద్యార్థులకు ర్యాంకులు రావాలని తపనపడే గొప్ప మనసులు ఉపాధ్యాయులు." -బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 9వ రోజుకు చేరుకుంది. మోమిన్‌పేట్‌లో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌, ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పాల్గొంటారు. రేపు సదాశివపేటలో మహారాష్ట్ర మాజీ మంత్రి వినోద్‌ తవ్‌డే, 7న సంగారెడ్డిలో బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య, 9న ఆందోల్‌ జోగిపేట్‌లో పార్టీ జాతీయ అధికారి ప్రతినిధి విజయ్‌ సోంకర్ శాస్త్రి, మెదక్‌ నర్సాపూర్‌లో జరిగే పాదయాత్రలో ఛత్తీస్‌గడ్‌ మాజీ ముఖ్యమంత్రి రమణ్​సింగ్‌ తదితరులు పాల్గొననున్నారు.

ఇదీ చూడండి:

Venkaiah naidu : 'నన్ను ఈ స్థాయికి చేర్చింది గురువులే'

Last Updated :Sep 5, 2021, 2:18 PM IST

ABOUT THE AUTHOR

...view details