తెలంగాణ

telangana

Ethanol industries: రూ.4,018 కోట్లతో... 250 ఎకరాల్లో... 4 పరిశ్రమలు

By

Published : Aug 31, 2021, 7:05 AM IST

Ethanol industries
ఇథనాల్​ పరిశ్రమలు ()

ప్రస్తుతం పెట్రోలు, డీజిల్‌ ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. ఈ తరుణంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు తెరమీదికి వచ్చినా ధరలు, ఛార్జింగ్‌ వంటి సమస్యలు అడ్డంకిగా ఉన్నాయి. వాటికి పరిష్కారంగా దేశీయ పంట ఉత్పత్తులతో ప్రత్యామ్నాయ ఇంధనమైన ఇథనాల్‌ తయారీని ప్రోత్సాహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో 250 ఎకరాల్లో నాలుగు ఇథనాల్​ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది.

తెలంగాణలో రూ.4,018 కోట్ల పెట్టుబడులతో 250 ఎకరాల్లో నాలుగు ఇథనాల్‌ పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఇందులో ఒకటి ప్రైవేటు సంస్థ ధాత్రి కాగా, మరో మూడు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(బీపీసీఎల్‌), ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఐఓసీఎల్‌), హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌). వీటి ద్వారా 1,700 మందికి ప్రత్యక్షంగా, మరో అయిదువేల మందికి పరోక్షంగా ఉపాధి కలగనుంది. సహజ వనరులతో ఇథనాల్‌ తయారుచేసే పరిశ్రమలు రాష్ట్రంలో ఏర్పాటుకావడం ఇదే ప్రథమం. ‘హైదరాబాద్‌కు చెందిన ధాత్రి సంస్థ రెండోతరం సాంకేతిక పరిజ్ఞానం (2జీ)తో వరిగడ్డి నుంచి ఇంధనాన్ని తయారుచేస్తుంది. మిగిలిన మూడు ప్రభుత్వ రంగ సంస్థలు మొదటి తరం సాంకేతిక పరిజ్ఞానం (1జీ)తో ఆయా వనరుల్లో ఉండే ఇథైల్‌ ఆల్కహాల్‌ను వెలికితీసి, రసాయనిక చర్యలతో ఇంధనంగా మారుస్తాయి’ అని పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి.

దేశవ్యాప్తంగా ఇథనాల్ తయారీ కోసం 100 ప్లాంట్లను స్థాపించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చమురు సంస్థలను ఇటీవల ఆదేశించారు. ఈ నేపథ్యంలో బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, ఐవోసీఎల్‌ సంస్థలు తమ ప్లాంట్ల స్థాపన కోసం తెలంగాణ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. ఫిన్‌లాండ్‌లో టూజీ సాంకేతిక పరిజ్ఞానంతో ఇథనాల్‌ తయారుచేస్తున్న ధాత్రి సంస్థ కూడా తెలంగాణలో పరిశ్రమ ఏర్పాటు చేస్తామంటూ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. మరో పది సంస్థలు కూడా పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తూ..దరఖాస్తు చేసుకున్నాయి. 14 సంస్థల ప్రతిపాదనలను శుక్రవారం పరిశ్రమల మంత్రి కేటీ రామారావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించింది. తొలి విడతగా నాలుగు సంస్థలకు భూకేటాయింపులు, రాయితీలు, ప్రోత్సాహకాలకు సిఫార్సు చేసింది. మిగిలిన పది సంస్థల దరఖాస్తులను పరిశీలించిన మీదట, వాటి నుంచి మరికొంత సమాచారం కోరింది.

రాష్ట్రంలో అనుకూలతలు

విదేశాల్లో గోధుమలు, మొక్కజొన్న, వరి ధాన్యాల నుంచి ఇథనాల్‌ తయారీకి అవసరమైన ముడి పదార్థాలను తయారుచేస్తున్నారు. తెలంగాణలో ధాన్యం, మొక్కజొన్న పంటలు పెద్దఎత్తున సాగవుతున్నాయి. చెరకు కూడా కొన్ని జిల్లాల్లో సాగుతుండటంతో భారీ మొత్తంలో ఇథనాల్‌ తయారీకి ఇక్కడ అవకాశాలున్నాయి. ‘‘వరికోత యంత్రాలు వచ్చాక గడ్డి వృథా అవుతోంది. ఇథనాల్‌ తయారీలో దీన్ని ఉపయోగించే వీలుండటంతో గడ్డిని విక్రయించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం చేకూరుతుంది. ధాన్యం మిల్లింగ్‌ తర్వాత వచ్చే నూకలనూ అధిక ధరలకు విక్రయించవచ్చు. తయారీ సంస్థల పోటీ వల్ల మొక్కజొన్నలకూ అధిక ధర లభిస్తుంది. అందుకే ఈ రంగంలో పెట్టుబడులకు ఎన్ని సంస్థలు దరఖాస్తు చేసుకున్నా అర్హతలుంటే అనుమతులు ఇస్తాం’ అని పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ తెలిపారు.

భూకేటాయింపులు ఇలా

మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ధాత్రికి నల్గొండ జిల్లాలో 70 ఎకరాలు, బీపీసీఎల్‌కు అదే జిల్లాలో 60, హెచ్‌పీసీఎల్‌, ఐవోసీఎల్‌కు సిద్దిపేట జిల్లాలో 60 ఎకరాల చొప్పున కేటాయించింది. మూడు ప్రభుత్వరంగ సంస్థలకు కేంద్రం నుంచి రాయితీలు, ప్రోత్సాహకాలు లభించనున్నందున అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి రాయితీలు ఇవ్వదు. ధాత్రికి టీఎస్‌ఐపాస్‌, రాష్ట్ర పారిశ్రామిక విధానం కింద రాయితీలు ఇవ్వాలని నిర్ణయించింది.

ఇదీ చూడండి:M.Venkaiah Naidu: 'వైరస్​ల కట్టడికి పరిశోధనలు ముమ్మరం చేయాలి'

ABOUT THE AUTHOR

...view details