తెలంగాణ

telangana

భాజపా, తెరాస ఒక్కటై కలిసి పనిచేస్తున్నాయి: రాహుల్ గాంధీ

By

Published : Nov 2, 2022, 8:47 PM IST

Bharat Jodo Yatra in Hyderabad: భాజపా, తెరాస ఒక్కటై కలిసి పనిచేస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. మోదీ సర్కార్‌ విధానాల వల్ల దేశంలోని అన్నివర్గాల ప్రజలు సమస్యలతో అల్లాడిపోతున్నారని ఆయన ఆక్షేపించారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్న భాజపా సర్కార్‌ వారి మిత్రులకు కారుచౌకగా కట్టబెడుతోందని ఆరోపించారు. ఒకవైపు భారత్‌ జోడోయాత్ర ఉత్సాహంగా సాగుతుండగా.. మరో వైపు నగర శివారులో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది.

Rahul gandhi
Rahul gandhi

భాజపా, తెరాస ఒక్కటై కలిసి పనిచేస్తున్నాయి: రాహుల్ గాంధీ

Bharat Jodo Yatra in Hyderabad: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడోయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. యాత్రలో భాగంగా ఈరోజు సాయంత్రం లింగంపల్లి చౌరస్తా నుంచి ముత్తంగి వరకు భారీ కాన్వాయ్‌ ఓవైపు ప్రయాణిస్తుండగా.. మరో వైపు సాధారణ వాహనాలను దారి మళ్లించి వన్‌వేలో రెండు వైపులా వెళ్లే విధంగా ట్రాఫిక్‌ పోలీసులు ఏర్పాటు చేశారు. ఇక్రిశాట్‌ దాటిన తర్వాత సాయంత్ర వేళ బాలుడితో రాహుల్‌గాంధీ క్రికెట్‌ ఆడారు. ఆ సందర్భంలో కొంత సమయం ట్రాఫిక్‌ ఆగింది. అనంతరం పటాన్‌చెరు ఆనంద్‌భవన్‌ హోటల్లో 20 నిమిషాల పాటు రాహుల్‌ సేద తీరారు.

అప్పుడు కూడా కార్యకర్తల రద్దీతో రెండు వైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అనంతరం రాహుల్‌గాంధీ యాత్ర మొదలు పెట్టినప్పటికీ రహదారికి రెండు వైపులా రద్దీ కొనసాగింది. అనంతరం ముత్తంగిలో రాహుల్‌ కార్నర్‌ మీటింగ్‌ నిర్వహించడంతో ముత్తంగి నుంచి పటాన్‌చెరు వైపు దాదాపు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను నియంత్రించలేక పోలీసులు కూడా చేతులెత్తేశారు. ఇవాళ సాయంత్రం శేరిలింగంపల్లి కూడలి నుంచి ప్రారంభమైన యాత్ర రామచంద్రాపురం, పటాన్‌చెరుల మీదుగా సంగారెడ్డి జిల్లాలోని ముత్తంగి చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ భాజపా, తెరాసలపై విమర్శనాస్త్రాలు సంధించారు.

యువతకు ఉద్యోగాల్లేకుండా చేసిన పాపం మోదీది.. భాజపా, తెరాస ఒక్కటై కలిసి పనిచేస్తున్నాయని రాహుల్‌ గాంధీ విమర్శించారు. మోదీ సర్కార్‌ విధానాల వల్ల దేశంలోని అన్నివర్గాల ప్రజలు సమస్యలతో అల్లాడిపోతున్నారని ఆయన ఆక్షేపించారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్న భాజపా సర్కార్‌ వారి మిత్రులకు కారుచౌకగా కట్టబెడుతోందని ఆరోపించారు. యువతకు ఉద్యోగాల్లేకుండా చేసిన పాపం మోదీకే తగలుతుందన్నారు. పెట్రో ధరల పెంపుతో పేద, మధ్య తరగతి వర్గాలపై భారం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేసిన రాహుల్‌.. నిత్యావసరాల ధరలు పెంచి వంటింట్లో మంటలు పెట్టారన్నారు.

ప్రభుత్వాలను మోదీ ప్రభుత్వం కూలదోస్తోంది.. యూపీఏ పాలనలో సిలిండర్‌ ధర రూ.400 మాత్రమే ఉండేదన్న రాహుల్.. మోదీ పాలనలో సిలిండర్‌ ధర రూ.1100కు పైగా చేశారని మండిపడ్డారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను భారీగా పెంచారని వ్యాఖ్యానించారు. సాగు చట్టాల వేళ విపక్షాలన్నీ ఒకవైపు ఉంటే.. భాజపా-తెరాస మరోవైపు ఉన్నాయని ఆయన ఆరోపించారు. వ్యవసాయ చట్టాలకు పార్లమెంటులో తెరాస మద్దతిచ్చిందని విమర్శించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను మోదీ ప్రభుత్వం కూలదోస్తోందని రాహుల్‌ ధ్వజమెత్తారు. వందల కోట్ల ప్రజాధనంతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారన్నారు. భాజపా, తెరాస ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ భారత్‌ జోడో యాత్ర సాగుతుందని అన్నారు.

భారత్ జోడో యాత్రతో భాగ్యనగర వీధుల్లో కోలాహలం నెలకొంది. అడుగడుగునా అభిమానం పోటెత్తుతోంది. రాహుల్ రాకతో రహదారులు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో 65 వ జాతీయ రహదారిపై భారీగా రాకపోకలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం నెలకొంది రాష్ట్రంలో ఎనిమిదో రోజు బాలానగర్ నుంచి జోడో యాత్ర ప్రారంభమైంది. ఉదయం న్యూ బోయిన్ పల్లి, బాలానగర్ మెయిన్ రోడ్డు, సుమిత్రా నగర్, ఐడీపీఎల్ కాలనీ మీదుగా మదీనాగూడ వరకు సాగింది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం సాయంత్రం బీహెచ్​ఈఎల్​లో ప్రారంభమైన యాత్ర ముత్తంగి వద్ద ముగిసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details