ETV Bharat / state

మునుగోడు వార్​కు అంతా సిద్ధం.. ఇక ఓటేద్దాం రండి

author img

By

Published : Nov 2, 2022, 8:04 PM IST

Arrangements completed for munugode by-election 2022
Arrangements completed for munugode by-election 2022

Munugode Bypoll Arrangements: మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. గురువారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు 298 కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. అన్ని కేంద్రాల్లో వెబ్‌క్యాస్టింగ్‌ ద్వారా ఈసీ పోలింగ్ సరళిని పర్యవేక్షించనుంది. ఇప్పటికే ఎన్నికల సంఘం.. సామాగ్రిని పంపిణీ చేయగా... వాటిని తీసుకుని సిబ్బంది పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లారు.

మునుగోడులో పోలింగ్‌కు అంతా సిద్ధం

Munugode Bypoll Arrangements: మునుగోడులో పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. గురువారం రోజు పోలింగ్‌కు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. నియోజకవర్గంలో మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల్లో వెబ్‌క్యాస్టింగ్‌ ద్వారా ఈసీ పర్యవేక్షించనుంది. ఎక్కడైనా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే స్పందించి సరిదిద్దేందుకు అనువుగా పెద్దసంఖ్యలో ఇంజినీర్లను అందుబాటులో ఉంచుతున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ స్పష్టం చేశారు. సీఈఓ కార్యాలయంతోపాటు ఈసీ నుంచి పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.

కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన జాబితా ప్రకారం నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2 లక్షల 41 వేల 855 మంది ఉండగా.. అందులో పురుషులు లక్షా 21 వేల 662 మంది.. మహిళలు లక్షా 20 వేల 126 మంది ఉన్నారు. ఓటర్ల వర్గీకరణ చూస్తే అత్యధికంగా 31 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వారున్నారు. 31 నుంచి 40 ఏళ్ల మధ్య 64 వేల 721 మంది ఉండగా.. 41 నుంచి 50 ఏళ్ల మధ్యలో 47,430 ఓటర్లున్నారు. 51 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు వారు 32,120 మంది.. 26 నుంచి 30 ఏళ్ల మధ్యలో 28,204 మంది ఓటర్లు ఉన్నారు. 20,472 మంది 22 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు వారు కాగా.. 61 నుంచి 70 ఏళ్ల మధ్య 19,655 మంది ఉన్నారు. ఓటర్ల జాబితాలో దివ్యాంగులు 5,686 మంది ఉన్నారు. 80 ఏళ్లు పైబడినవారికి, దివ్యాంగులకు ఈసీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించింది. 798 మంది ఈ సదుపాయాన్ని ఎంచుకోగా.. అందులో 685 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.

47 మంది అభ్యర్థులు.. 298 పోలింగ్ కేంద్రాలు..: గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. నియోజకవర్గంలో మొత్తం 298 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఉపఎన్నిక బరిలో 47 మంది అభ్యర్థులు నిలిచారు. నోటా కలిపి ఒక్కో ఈవీఎంలో మూడు బ్యాలెట్ యూనిట్లు అవసరం. ఇందుకోసం 1,192 బ్యాలెట్ యూనిట్లను సిద్ధం చేశారు. కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లను 596 చొప్పున అందుబాటులో ఉంచారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఉండే అవసరాలతో పాటు 10 శాతం అదనంగా సిద్ధం చేసి ఉంచారు.

చండూరులో ఎన్నికల సామగ్రి పంపిణీ జరిగింది. పోలింగ్‌ సిబ్బంది వచ్చి సామాగ్రి తీసుకుని పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లారు. మునుగోడు ఉపఎన్నిక వేళ ఓటర్లు ఎవరూ ప్రలోభాలకు గురికాకుండా ఓటుహక్కు వినియోగించుకోవాలని నల్గొండ కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి వినయ్ కృష్ణారెడ్డి కోరారు. చండూరులో ఎన్నికల సామగ్రి పంపిణీని పర్యవేక్షించిన ఆయన... నియోజకవర్గవ్యాప్తంగా ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ఠ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

చండూరు మండలం కోటయగూడెంలో మోడల్‌ పోలింగ్‌ నిర్వహించారు. పోలింగ్‌ కేంద్రంలో సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. పోలీసు బందోబస్తు కల్పించారు. గురువారం జరిగే పోలింగ్‌లో ఓటర్లంతా తరలివచ్చి ఓటుహక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం కోరింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.