హెల్త్ చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్తున్న నిండు గర్భిణి వాహనాన్ని (police stopped pregnant women vehicle)నిలిపేసిన పోలీసులు ఆమెను అవస్థలకు గురిచేశారు. ఈ ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన గర్భిణి శిల్ప.. కుటుంబ సభ్యులతో కలిసి మెదక్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి కారులో బయలుదేరారు. నాందేడ్ అకొల జాతీయ రహదారిపై వాహన తనిఖీలు చేస్తున్న అల్లాదుర్గం పోలీసులు వారి కారును ఆపారు. సదరు వాహనంపైన రూ.2700 పెండింగ్ చలానాలు ఉన్నాయని.. వాటిని చెల్లించి వెళ్లాలని స్పష్టం చేశారు. కారులో గర్భిణి ఉందని.. హెల్త్ చెకప్ కోసం వెళ్తున్నామని పోలీసులకు చెప్పినట్లు బాధితులు చెప్పారు. ప్రస్తుతం తమ వద్ద చలానా చెల్లించేందుకు సరిపడా నగదు లేవని చెప్పినా వినలేదని... ఇంటికి వెళ్లాక ఆన్లైన్ చెల్లింపులు చేస్తామన్నా... పోలీసులు వినిపించుకోలేదని కారు డ్రైవర్ తెలిపాడు. సుమారు అరగంటకు పైగా కారును ఆపారన్నారు. ఈ సమయంలో గర్భిణి ఇబ్బంది పడ్డారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. చివరకు ఉన్నతాధికారులకు ఫోన్ చేసి చెప్పాక.. పోలీసులు విడిచిపెట్టారని గర్భిణి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.