తెలంగాణ

telangana

Mahatma Gandhi Temple: ఆ ఊరోళ్లకు గాంధీనే నిజమైన దేవుడు.. అందుకే ప్రత్యేక పూజలు!

By

Published : Oct 2, 2021, 10:18 AM IST

Updated : Oct 2, 2021, 11:55 AM IST

Mahatma Gandhi Temple

అహింస.. శాంతి.. ఇవే ఆయుధాలు.. వీటితోనే ఉద్యమాన్ని నడిపారు. భారతావనిని ఏకం చేశారు. దేశ ప్రజల స్వాతంత్య్ర ఆకాంక్షను నెరవేర్చారు. ప్రపంచానికే శాంతి సందేశాన్ని అందించి మహాత్ముడిగా మారారు. స్వాతంత్య్ర భారతదేశ అభివృద్ధిపై ఆ మహనీయుడు ఎన్నో కలలుగన్నారు. ఆ కలల్ని సాకారం చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపైనా ఉంది. మహాత్ముడు చూపిన మార్గంలో పయనించడం ద్వారానే ఇది సాధ్యమవుతుంది. ఇంతటి స్ఫూర్తి నింపిన గాంధీ అంటే అక్కడి ప్రజలకు మక్కువ ఎక్కువ. అందుకే గుడి కట్టేశారు.

మనం స్వామీజీలకు, బాబాలకు గుడి కట్టడం చూశాం.. చివరకు రాజకీయ నాయకులకు, సినీ తారలకు మందిరాలు నిర్మించి.. పూజలు చేయడం విన్నాం. అలాంటిది మనకు స్వాతంత్రాన్ని అందించిన గాంధీజీని మాత్రం.. జయంతి నాడో లేదా వర్థంతి రోజో.. అది కాక సాంతంత్య్ర, గణతంత్రదినోత్సవం రోజునో గుర్తు చేసుకుని ఉపన్యాసాలు ఇస్తాం. మిగితా రోజుల్లో అంతగా పట్టించుకోము. కానీ ఆ గ్రామం మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. అక్కడ మాహాత్మున్ని దేవుడులా కొలుస్తారు. అభిషేకాలు, పూజలతో భగవంతునిలా ప్రార్థిస్తారు. బానిస సంకెళ్ల నుంచి దేశానికి విముక్తి చేసిన ఆయన్ని దేవుడిలా కొలుస్తున్నారు.

ఆ ఊరోళ్లకు గాంధీనే నిజమైన దేవుడు.. అందుకే ప్రత్యేక పూజలు!

సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ గ్రామస్థులకు గాంధీయే నిజమైన దేవుడు. 1973వ సంవత్సరంలో అప్పటి సర్పంచి వెంకట్ రెడ్డి గ్రామంలో గాంధీ విగ్రహాన్నీ ఏర్పాటు చేశారు. గాంధీ త్యాగాన్ని, గొప్పతనాన్ని ఊరివాళ్లకు వివరించాడు. దాంతో అప్పటి నుంచి గాంధీని భగవంతుడిగా కొలవడం మొదలు పెట్టారు. ప్రతి శుక్రవారం పూజలు చేస్తారు. పూజారి ఆలయంలో మాదిరే విగ్రహ పరిసరాలను శుభ్రం చేస్తారు. విభూది రాసి, గంధం, కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరిస్తారు. హారతి ఇచ్చి.. కొబ్బరికాయలు కొట్టి.. దండాలు పెట్టుకుంటారు. అంతే కాదు గాంధీ జయంతి, స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గ్రామస్థులంతా సామూహిక పూజాదికాల్లో పాల్గొంటారు.

గాంధీకి ఆలయం

48 సంవత్సరాలుగా..

గత 48 సంవత్సరాలుగా ఇదే తరహాలో వారు పూజలు చేస్తున్నారు. 1973లో విగ్రహం ఏర్పాటు చేసిన నాటి నుంచి పూజా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతూనే ఉన్నాయి. అప్పట్లో ఈ కార్యక్రమాలు నిర్వహించడం కోసం ప్రత్యేకంగా లింగస్వామి అనే వ్యక్తిని పూజారిగా నియమించారు. ప్రస్తుతం 18 సంవత్సరాలుగా లింగస్వామి కొడుకు ఆడివయ్య ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలా గాంధీని పూజించడం తమకు గర్వంగా ఉందని గ్రామస్థులు పేర్కొంటున్నారు.

విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు వేదిక ఏర్పాటు చేసి దానిపై గద్దే నిర్మించి గాంధీ శిల్పం పెట్టారు. నాటి నుంచి ఇతర అభివృద్ధి పనులేవి జరగలేదు. పూజ కార్యక్రమాలు నిర్వహించే పురోహితునికి సైతం ఎలాంటి భృతి లభించడం లేదు. ప్రతి ఫలం లేకున్నా.. తమ తండ్రి నుంచి వచ్చిన ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. విగ్రహానికి ఎండ, వానల నుంచి రక్షణ లభించేలా పైన కప్పు నిర్మించడంతో పాటు.. పూజారికి గౌరవ వేతనం ఇవ్వాలని గ్రామస్థులు కోరుతున్నారు. కరెన్సీ నోటు మీద ఉన్న గాంధీకి మాత్రమే విలువనిచ్చే ప్రస్తుత రోజుల్లో... దశాబ్దాలుగా గాంధీని దేవుడిలా పూజిస్తున్న ఈ గ్రామస్థులు అందరికి ఆదర్శం.

ఇదీ చూడండి:Gandhi Jayanti: 'సాయుధ ఉద్యమాల కంటే గాంధీ అహింసా సిద్ధాంతమే ప్రభావవంతం'

Last Updated :Oct 2, 2021, 11:55 AM IST

ABOUT THE AUTHOR

...view details