ETV Bharat / state

తెలంగాణలో జీఎస్టీ రాబడులపై సర్కార్‌ ఫోకస్‌ - వివిధ మార్గాల్లో ఆదాయం పెంపునకు చర్యలు - TS GOVT on increasing GST revenue

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 29, 2024, 11:04 AM IST

Updated : Apr 29, 2024, 1:15 PM IST

Telangana Govt Focus on commercial taxes revenue
Telangana Govt Focus on commercial taxes revenue

Telangana Govt Focus on GST Revenue Increasing : తెలంగాణలో జీఎస్టీ రాబడులు ఆశించిన స్థాయిలో పెరగకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ జాతీయ సగటు పెరుగుదల 13 శాతం కాగా రాష్ట్రంలో మాత్రం ఏడు శాతంగా నమోదైంది. దీంతో వ్యాట్‌ రాబడి తగ్గడం, జీఎస్టీ పరిహారం లేకపోవడంతో మొత్తం మీద వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం తగ్గింది. వ్యాట్ ఆదాయం తగ్గడంపై లోతైన పరిశీలన చేసేందుకు సర్కార్ సిద్ధమైంది. జనంపై ఏలాంటి పన్నులు విధించకుండా రాబడులు పెంచుకునేందుకు అవకాశాలను అన్వేషిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే వాణిజ్య పన్నుల శాఖ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాలని భావిస్తోంది.

తెలంగాణలో జీఎస్టీ రాబడులపై సర్కార్‌ ఫోకస్‌

TS Govt on Concentration on GST Revenue : దేశంలో జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల పాటు, 14 శాతం కంటే తక్కువ వార్షిక వృద్ధి వచ్చిన రాష్ట్రాలకు కేంద్రం పరిహారం చెల్లించింది. ఈ విధంగా 2017 జులై నుంచి 2022 జూన్ వరకు పరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఐదేండ్లు గ్రేస్‌ పీరియడ్‌ పూర్తి కావడంతో అన్ని రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం ఆగిపోయింది. ఆ ఐదు సంవత్సరాల్లో పరిహారం పెండింగ్‌ ఉన్న రాష్ట్రాలకు చెల్లింపులు విడుదలవుతూ వస్తున్నాయి.

Telangana Govt on Commercial Taxes Dept : రాష్ట్రంలో 2022-23 ఆర్థిక ఏడాదిలో జీఎస్టీ పరిహారం కింద బకాయి ఉన్న మొత్తంలో, రూ.4,419 కోట్లు కేంద్రం నుంచి విడుదలైంది. 2023-24 సంవత్సరంలో కేవలం రూ.625 కోట్లు మాత్రమే వచ్చాయి. దీంతో గతేడాది కంటే తక్కువ జీఎస్టీ పరిహారం రావడం, జీఎస్టీ రాబడులు ఆశించిన మేరకు పెరగకపోవడం, వ్యాట్‌ రాబడి పెరగకుండా తగ్గింది. దీంతో మొత్తం వాణిజ్య పన్నుల రాబడి తగ్గింది.

తెలంగాణలో గడిచిన నాలుగేండ్లుగా వచ్చిన రాబడులను పరిశీలిస్తే 2020-21 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య పన్నుల వసూళ్లు రూ.52,436 కోట్లు కాగా, 2021-22లో రూ.65,021 కోట్లుగా ఉంది. ఇక 2022-23లో రూ.72,564 కోట్లుగా నమోదైంది. 2023-24 ఆర్థిక ఏడాదిలో వసూళ్లు స్వల్పంగా తగ్గి రూ.72,157 కోట్లకే పరిమితమైంది. అంతకు ముందు ఏడాది కంటే గత ఆర్థిక ఏడాదిలో కనీసం 14 శాతం ఆదాయం పెరగాల్సి ఉండగా మొత్తం మీద దాదాపు రూ.407 కోట్ల రాబడి తగ్గింది.

2023-24 ఆర్థిక ఏడాదిలో వాణిజ్య పన్నుల శాఖ నుంచి రూ.83,500 కోట్లు రాబడి రావాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. కానీ కేవలం రూ.72,157 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యంలో రూ.11,343 కోట్ల మేర ఆదాయం తగ్గింది. ఇందులో జీఎస్టీ కింద రూ.44,000ల కోట్లు వస్తుందని అంచనా వేయగా, రూ.40,650 కోట్లు మాత్రమే వచ్చింది. మద్యం, పెట్రోల్, డీజిల్‌ విక్రయాలపై రూ.39,500 కోట్ల వ్యాట్ రాబడి వస్తుందని అంచనా వేయగా, రూ. 29,985 కోట్లు మాత్రమే వచ్చాయి.

స్టాంపులు - రిజిస్ట్రేషన్ శాఖపై ఎన్నికల ఎఫెక్ట్ - లక్ష్యంలో 80 శాతానికి మించి వచ్చేలా లేదుగా!

ఆదాయాన్ని పెంచుకోవడంపై ప్రభుత్వం ఫోకస్ : కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు రూ.19,069 కోట్ల ఆదాయం వచ్చింది. జనవరిలో రూ.6,076 కోట్లు, ఫిబ్రవరిలో రూ.6,240 కోట్లు, మార్చిలో రూ.6,753 కోట్లుగా ఉన్నాయి. గతంలో సక్రమంగా ఆదాయం రాకపోవడంతో తెలంగాణ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. జీఎస్టీ రాబడులు తగ్గడానికి కారణలపై అన్వేషిస్తున్న ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునేందుకు అవసరమైన చర్యలకు ఉపక్రమించింది.

ప్రధానంగా జీఎస్టీ ఎగవేతదారులను గుర్తించడం, నకిలీ ఇన్‌వాయిస్‌లు పెట్టి రీఫండ్‌లు తీసుకోనేవారిపై ప్రభుత్వం దృష్టి సారించింది. అదేవిధంగా జీఎస్టీ చెల్లించకుండా జీరో వ్యాపారం చేస్తుండడం, తెలంగాణాలో పెట్రోల్‌ డీజిల్‌ ధరలు అధికంగా ఉండడంతో కర్ణాటక నుంచి అక్రమంగా పెట్రోల్, డీజిల్‌ రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకోవడంపై తెలంగాణ సర్కార్ ఫోకస్‌ పెట్టింది. మరోవైపు వార్షిక టర్నోవర్‌ రూ.5 కోట్లుగా ఉండే దాదాపు 15,000ల అసెస్‌మెంట్లను పునఃపరిశీలన చేయడం, మద్యం విక్రయాల్లో అనధికారిక మద్యం సరఫరా జరిగినట్లు వస్తున్న సమాచారంపై లోతైన అధ్యయనం చేయడం లాంటి చర్యలకు శ్రీకారం చుట్టింది. తద్వారా ప్రతి నెల రూ.500ల కోట్లకు తక్కువ లేకుండా పెరుగుదల ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. అదేవిధంగా పన్నుల ఎగవేతదారులపై కఠిన చర్యలకు పూనుకోనుంది.

వాణిజ్య పన్నుల శాఖపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక దృష్టి : ఇప్పటికే వాణిజ్య పన్నుల శాఖపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఏరోజుకారోజు రాబడులకు సంబంధించిన నివేదికలు తెప్పించుకుంటుంది. దీంతో పాటు అంతకు ముందు ఏడాది ఇదే నెలలో ఎంత వచ్చిందో బేరీజు వేసి చూస్తున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు కాగానే వాణిజ్య పన్నుల శాఖలో మామూళ్లకు అలవాటు పడి, పన్నుల ఎగవేతను ప్రోత్సహిస్తున్న కొందరు అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే నకిలీ ఇన్‌వాయిస్‌లుపెట్టిన బోగస్ సంస్థలకు కోట్లాది రూపాయిలు రీఫండ్‌లు ఇచ్చిన దాదాపు పది మంది అధికారులపై వేటు వేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

అప్పుల్లో మరింత దూకుడు - జనవరి నెలాఖరుకు నమోదైన రాష్ట్ర ఆదాయ, అప్పుల పూర్తి వివరాలివే

ఆదాయం పెరిగినా రెవెన్యూ మిగులు సాధించడంలో రాష్ట్రం విఫలం - కాగ్​ రిపోర్టు

Last Updated :Apr 29, 2024, 1:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.