ETV Bharat / state

ఆదాయం పెరిగినా రెవెన్యూ మిగులు సాధించడంలో రాష్ట్రం విఫలం - కాగ్​ రిపోర్టు

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 15, 2024, 3:55 PM IST

CAG Report on Telangana Financial Condition : రెవెన్యూ మిగులును సాధించడంలో రాష్ట్రం వరుసగా విఫలం అవుతోందని బడ్జెట్ వెలుపలి అప్పులను కూడా పరిగణనలోకి తీసుకుంటే రుణపరిమితి ఎఫ్ఆర్బీఎంను అధిగమిస్తోందని కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. రెవెన్యూ రాబడి ఎక్కువగా, రెవెన్యూ లోటు తక్కువగా చూపి ఇచ్చిన రుణాల రూపంలోని ఆస్తులను ఎక్కువగా చేసి చూపినట్లు నివేదికలో పేర్కొంది. విద్య, వైద్యానికి చేసిన ఖర్చు తక్కువగానే ఉంటోందని కానీ సంక్షేమ పథకాల కేటాయింపులతో పోలిస్తే వ్యయం తక్కువగా నమోదు అవుతోందని కాగ్ పేర్కొంది.

CAG Report on Telangana
CAG Report on Telangana Financial Condition

CAG Report on Telangana Financial Condition : 2022మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్​(కాగ్​) నివేదిక ఇచ్చింది. 2021-22లో తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి అధిక వృద్ధిరేటును నమోదు చేసిందని కాగ్ పేర్కొంది. 26శాతం మేర రెవెన్యూ రాబడి పెరిగినా, రెవెన్యూ మిగులును సాధించడంతో రాష్ట్రం వరుసగా మూడో ఏడాది విఫలమైందని పేర్కొంది. ద్రవ్యలోటు రుణ బాధ్యతల లక్ష్యాలను సాధించలేకపోయిందని వివిధ కారణాల దృష్ట్యా రెవెన్యూను రూ.1,157కోట్ల మేర తక్కువ చేసి చూపిందని తెలిపింది. వడ్డీ చెల్లింపు బాధ్యతలను నేరవేర్చకపోవడం వల్ల ద్రవ్యలోటు(Fiscal Deficit)ను కూడా రూ.182కోట్ల మేర తక్కువగా చూపినట్లు తెలిపింది.

రాష్ట్ర బడ్జెట్ నుంచి చెల్లిస్తున్న బడ్జెట్ వెలుపలి అప్పులు, ఇతర చెల్లింపు బాధ్యతలను కూడా పరిగణలోని తీసుకుంటే జీఎస్డీపీ(GSDP)లో అప్పుల నిష్పత్తి 37.77శాతంగా ఉంటుందని చట్టప్రకారం నిర్దేశించిన 25శాతం కంటే ఎక్కువగా ఉంటుందని కాగ్ తెలిపింది. 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన 29.30శాతం కన్నా కూడా ఎక్కువగా ఉందని పేర్కొంది. రెవెన్యూ రాబడి ఎక్కువ చూపి రెవెన్యూ లోటును తక్కువ చూపి ఇచ్చిన రుణాల రూపంలోని ఆస్తులను ఎక్కువగా చేసి చూపినట్లు అయిందని కాగ్(CAG) వ్యాఖ్యానించింది. మొత్తం వ్యయంలో తప్పనిసరి ఖర్చుల వాటా పెరిగిందని విద్యా, ఆరోగ్యం మీద వ్యయం విషయంలో రాష్ట్రం ఇతర రాష్ట్రాలతో వెనుకంజలోనే ఉందని కాగ్ తెలిపింది.

CAG report on Telangana state taxes : రాష్ట్ర ఖజానాకు కాసుల పంట.. కాగ్ నివేదిక విడుదల

CAG Audit Report of Telangana : మొత్తం వ్యయంలో విద్య మీద 8శాతం ఖర్చు కాగా ఆరోగ్యం మీద 4శాతం ఖర్చయిందని కాగ్​ పేర్కొంది. రాష్ట్ర వనరుల నుంచి అప్పులకు సంబంధించి చెల్లిస్తున్న రూ.1,18,955 కోట్ల మేర రుణాలను కూడా ప్రభుత్వం వెల్లడించలేదని జీఎస్డీపీ, అప్పుల నిష్పత్తిపై ఈ ప్రభావం ఉంటుందని వ్యాఖ్యానించింది. రెవెన్యూ లోటు (Revenue Deficit) నమోదు చేసినందున ఆ లోటును మార్కెట్ నుంచి తీసుకున్న అప్పుల ద్వారానే భర్తీ చేయాల్సి వస్తుందని తెలిపింది. రుణాల మీద వడ్డీ, అసలు కోసం 2032-33నాటికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2,52,048 కోట్లను తీసుకోవాల్సి వస్తుందని ఇది ప్రభుత్వ ఆర్థికాన్ని గణనీయమైన ఒత్తిడికి గురిచేస్తుందని వ్యాఖ్యానించింది.

"2018-19 తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఆస్తులు అప్పుల పంపకం పురోగతి లేదు. విభజన పంపకాల సమయంలో దీనిపై తగినంత దృష్టి పెట్టలేదు. బడ్జెట్​ అంచనాలలో వాస్తవంగా అయిన ఖర్చు 77 శాతం మాత్రమే. బడ్జెట్​ కేటాయింపులతో పోల్చితే సంక్షేమ పథకాల మీద ఖర్చులు తగ్గుదలలో ఉన్నాయి. రుణమాఫీ, రెండు పడక గదుల నిర్మాణం, ప్రత్యేక అభివృద్ధి నిధి తదితరాలకు సంబంధించి కేటాయింపులు ఎక్కువగా ఉన్నప్పటికీ ఖర్చు తగ్గింది. నీటి పారుదల ప్రాజెక్టుల మీద నిర్వహణ వ్యయం తరచూ తక్కువగానే ఉంటుందని" కాగ్​ తన నివేదికలో వెల్లడించింది.

39 ప్రభుత్వ రంగ సంస్థల నష్టం రూ.56,613 కోట్లు : హరిత నిధి పేరిట ఏర్పాటు చేసిన కొత్త నిధి శాసనసభ పర్యవేక్షణ లేని పరిస్థితికి దారి తీయవచ్చని కాగ్​ పేర్కొంది. వివిధ పథకాల కోసం విడుదల చేసిన గ్రాంటులకు సంబంధించి పురపాలక శాఖ రూ.3,313కోట్ల వినియోగ ధ్రువపత్రాలు సమర్పించలేదని తెలిపింది. 39 ప్రభుత్వ రంగ సంస్థల్లో 17 సంస్థలు రూ.1,955 కోట్ల లాభాలు ఆర్జించగా 18 సంస్థలు రూ.4,065 కోట్ల నష్టాలు చెందాయని తెలిపింది. సింగరేణి, జెన్‌ కో, ట్రాన్స్‌ కో, గిడ్డంగుల సంస్థ లాభాలను పొందగా రెండు డిస్కంలు, ఆర్టీసీ గృహ నిర్మాణ సంస్థ, రాజీవ్ గృహ సంస్థ నష్టాలు పొందినట్లు పేర్కొంది. 2022 మార్చి 31నాటికి 39ప్రభుత్వ రంగ సంస్థల నష్టాల విలువ రూ.56,613 కోట్లు కాగా నికర విలువ మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని కాగ్ వ్యాఖ్యానించింది.

కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినా - ప్రయోజనాల్లో మాత్రం అదనపు పెరుగుదల లేదు : కాగ్ నివేదిక

రాష్ట్ర ఖజానాకు లక్ష కోట్ల ఆదాయం - కాగ్‌ నివేదికలో వెల్లడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.