Gandhi Jayanti: 'సాయుధ ఉద్యమాల కంటే గాంధీ అహింసా సిద్ధాంతమే ప్రభావవంతం'

author img

By

Published : Oct 2, 2021, 4:22 AM IST

Gandhi

సాయుధ ఉద్యమాల కంటే గాంధీ అహింసా సిద్ధాంతమే ప్రభావవంతమైనదని, ప్రపంచవ్యాప్తంగా అనేక నిరసనోద్యమాలు ఇప్పుడు ఇదే మార్గంలో నడుస్తున్నాయని, గాంధీ గురించి భారతదేశంలో కంటే వెలుపలి దేశాల్లోనే లోతైన అధ్యయనం జరుగుతోందని అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ కరుణ మంతెన అభిప్రాయపడ్డారు.

‘‘ప్రస్తుతం భారత రాజకీయ నాయకులు అధికారం దక్కించుకోవడానికి, దాన్ని ప్రదర్శించడానికి పడుతున్న తాపత్రయం, బాగా వెనుకబడిన వారిపేరుతో చేస్తున్న పనుల్ని చూస్తే గాంధీ ఆందోళన చెందేవారని నేను భావిస్తున్నాను.’’

‘‘చౌరీ చౌరా ఘటన తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీ నిలిపివేయాలనుకోవడానికి కారణం.. అది హింసాత్మకం కావడం ఒక్కటే కాదు. ఆ హింసలో ఆయన.. భారతీయులు స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని అర్థం చేసుకోవడంలో గందరగోళంలో ఉన్నారని గమనించారు. స్వాతంత్య్రం అంటే యజమాని హోదా పొందడమని వారు భావిస్తున్నట్లు గుర్తించారు. ఇతరులపై పెత్తనం చేయడాన్ని ఒక హక్కుగా మార్చుకోవచ్చని వారు అనుకుంటున్నట్లు ఆయన గమనించారు.’’

జాతిపిత

సాయుధ ఉద్యమాల కంటే గాంధీ అహింసా సిద్ధాంతమే ప్రభావవంతమైనదని, ప్రపంచవ్యాప్తంగా అనేక నిరసనోద్యమాలు ఇప్పుడు ఇదే మార్గంలో నడుస్తున్నాయని, గాంధీ గురించి భారతదేశంలో కంటే వెలుపలి దేశాల్లోనే లోతైన అధ్యయనం జరుగుతోందని అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ కరుణ మంతెన అభిప్రాయపడ్డారు. భారతదేశ పయనం గాంధీ ఆకాంక్షలకు అనుగుణంగా లేదని ఆమె చెబుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఈమె లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌లోనూ, హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలోనూ పరిశోధన చేశారు. యేల్‌ విశ్వవిద్యాలయంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా చేసి ప్రస్తుతం కొలంబియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ‘గాంధీ-పాలిటిక్స్‌ అఫ్‌ నాన్‌ వయలెన్స్‌’ పేరుతో పుస్తకం రాశారు. స్వాతంత్య్ర అమృతోత్సవం సందర్భంగా ‘ఈనాడు- ఈటీవీభారత్​’కు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలివి..

ప్రొఫెసర్‌ కరుణ మంతెన

మనదేశానికి స్వాతంత్య్రం వచ్చి వచ్చే ఏడాదికి 75 సంవత్సరాలు. ప్రస్తుత ప్రపంచంలో మహాత్మాగాంధీ ఆలోచనకు ఉన్న స్థానం ఏంటి?

నిరసనకు గాంధీ అనుసరించిన అహింసా సిద్ధాంతం అంతర్జాతీయ రాజకీయాల్లో నేటికీ కేంద్రబిందువు. కొన్ని సంశయాలున్నప్పటికీ, ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ ఉద్యమకారుల్లోనూ, నిరసనోద్యమాల్లోనూ ఈ విధానానికి ఆదరణ పెరుగుతోంది. అనేక అధ్యయనాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. అహింసా విధానం మరింత ఎక్కువగా ప్రాచుర్యంలోకి, ఆచరణలోకి రావడమే కాదు సాయుధ పోరాటం కంటే మరింత ప్రభావవంతమవుతోంది.

అహింసా సిద్ధాంతం గురించి, గాంధీ ఆలోచనల గురించి వాస్తవానికి భారతదేశంలో కంటే బయటే ఎక్కువ అధ్యయనాలు జరుగుతున్నాయి. ఆయన రాజకీయ ఆలోచనను, అహింసా సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని దాని ఔన్నత్యాన్ని గుర్తించడం చాలా సంక్లిష్టమైంది. దీనికితోడు భారతదేశంలో ప్రజలు జాతీయవాదం, కులం, హిందూ-ముస్లిం సంబంధాలు తదితరాలపై గాంధీ అభిప్రాయాలపైనే ఆసక్తి చూపుతున్నారు. వాటి చుట్టూనే వారు కేంద్రీకృతమవుతున్నారు. దీంతో సత్యాగ్రహాన్ని ఒక రాజకీయ ప్రక్రియగానే భావించడం మొదలైంది.

సమరయోధులు ఆశించినట్లుగా భారత్‌ అభివృద్ధి బాటలో నడుస్తుందంటారా?

భారతదేశ పయనం గాంధీ ఆకాంక్షలకు అనుగుణంగా లేదు. నిజానికి 1920ల నుంచే జాతీయోద్యమ దిశపై గాంధీ కలత చెందేవారు. హిందు-ముస్లిం ఐక్యత, కుల సమస్య, గ్రామీణ పేదరికం, అట్టడుగున ఉన్న వారికి సంబంధించిన సమస్యలను జాతీయోద్యమం పరిష్కరించకుంటే.. స్వాతంత్య్రం తర్వాత ఇవి మరింత జటిలమవుతాయని స్పష్టం చేసేవారు. అందువల్లే ఆయన ఈ అంశాల ఆధారంగా ఒక నిర్మాణాత్మక కార్యక్రమాన్ని రూపొందించారు.

ప్రొఫెసర్‌ కరుణ మంతెన

ప్రపంచవ్యాప్తంగా నియంతృత్వ ధోరణులపై నిరసనలకు గాంధీయిజం ప్రధాన భూమిక కానుందా?

వును.. అహింసా పద్ధతుల్లో నిరసన తెలపడం, ఉద్యమించడం, ప్రత్యేకించి సామూహిక సహాయ నిరాకరణ ఉద్యమాలు పెరిగాయి. నియంతృత్వ పాలకులను కూలదోయడంలో సాయుధ పోరాటాల కంటే అవిధేయత, సహాయ నిరాకరణ ఉద్యమాలే రెండింతలు విజయవంతమయ్యాయి. ప్రజాస్వామ్య ప్రభుత్వాలున్న చోట కంటే నియంతృత్వ ధోరణులతో ఉండేవారికి వ్యతిరేకంగా అహింసా పద్ధతులు మరింత ఎక్కువగా విజయవంతమయ్యాయి. భారతదేశంలో పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా జరిగిన నిరసననల సందర్భంగా.. గాంధీమార్గాలను అనుసరించినట్లుగా కనిపిస్తోంది. గాంధీ దృష్టిలో అహింసా పద్ధతిలో ఉద్యమించడమంటే ఎక్కువమంది జనాన్ని వీధుల్లోకి వచ్చేలా చేయడమే కాదు, అసమ్మతిని ఎంత తీవ్రంగా చెప్పామన్నది ముఖ్యం. సీఏఏ వ్యతిరేక ఉద్యమకారులు కూడా రాజ్యాంగ పీఠికను చదవడం, తాము చెప్పేది వినేలా ప్రజలను నిశ్శబ్దంగానే ఆకర్షించారు.

గాంధీ లేదా గాంధీయిజం గురించి మీరు కొత్తగా పరిశీలించిందేంటి?

అహింస గురించి, రాజకీయాల గురించి గాంధీ ఎలా ఆలోచించారో తెలుసుకోవడం నాకు ఎక్కువ ఆసక్తి. ఆయన తాను ఎదుర్కొన్న సవాళ్ల నుంచే రాజకీయాల స్వభావంపై అనేక కొత్త ఆలోచనలకు రూపమిచ్చారు. సత్యాగ్రహం గురించి గాంధీ పిడివాదంతో ఉండేవారు కాదు. గతంలో జరిగిన పొరపాట్లు, ఎదురుదెబ్బల నుంచి ఎంతో నేర్చుకున్నారు. సర్దుబాటు ధోరణితో ఉంటూ మార్పులు చేసుకున్నారు. ఆయన దైనందిన జీవితం సహా అన్ని విషయాల్లోనూ ఆదర్శంగా ఉండేవారు. తను స్వయంగా చేయలేనివి ఇతరులను చేయమని ఎప్పుడూ అడిగేవారు కాదు. ఇది రాజకీయ నాయకత్వంలో చాలా అరుదు.

గాంధీ దృష్టిలో మంచి ప్రజాస్వామ్యం అంటే ఏమిటని అనుకుంటున్నారు?

అత్యంత దారుణ పరిస్థితుల్లో ఉండే వారి ప్రయోజనాలకు తగ్గట్లుగా పాలించడం. 1920ల తర్వాత ఇలాంటి ప్రజాస్వామ్య ప్రభుత్వం గురించే గాంధీ మనసులో ఉంది. ఈ కారణంగానే ఖాదీ గురించి గట్టిగా ప్రచారం ప్రారంభించారు. ధనికులు, పట్టణవాసులు కూడా గ్రామీణ పేదలతో కలిసి ఈ పని చేయడం వల్ల వారికి సంఘీభావంగా ఉంటుందని భావించారు. సాధారణ ప్రజలను అధికారంలో భాగం చేయడానికి ఇది ఉపయోగపడుతుందనుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.