తెలంగాణ

telangana

Edible Oil Prices: అసలు రూ.157.. అతికించింది రూ.211

By

Published : Mar 16, 2022, 10:06 AM IST

Edible Oil Prices: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం సాకుతో కొందరు వ్యాపారులు వంటనూనెల ధరలు పెంచేస్తున్నారు. ​నూనెల కొరత ఉందంటూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఇందేంటని అడిగిన వారిని.. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. డీలర్లే ఎక్కువ ధరకు అమ్ముతున్నారని చెబుతున్నారు.

Edible Oil Prices in sangareddy
Edible Oil Prices in sangareddy

Edible Oil Prices: రష్యా-ఉక్రెయిన్‌ మధ్య సాగుతున్న యుద్ధాన్నీ సంగారెడ్డి జిల్లాలోని దుకాణదారులు సొమ్ము చేసుకుంటున్నారు. నూనెల కొరత పేరు చెప్పి ప్రజల నుంచి దోచుకుంటున్నారు. ప్యాకెట్‌ మీద ముద్రించిన గరిష్ఠ చిల్లర ధర కంటే ఒక్క పైసా ఎక్కువ తీసుకోవద్దనే నిబంధనను దర్జాగా విస్మరిస్తున్నారు. వారికి నచ్చిన ధరలకు నూనె పొట్లాలు అమ్మేస్తున్నారు. అదేంటని ఎవరైనా అడిగితే... మీ ఇష్టముంటేనే తీసుకోండి... ఎక్కువ మాట్లాడొద్దు... ఏం చేసుకుంటారో చేసుకోండి... ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. మాకేం తెల్వదు... డీలర్లే ఎక్కువ ధరకు ఇస్తున్నారు.. మేం కొంచెం లాభం చూసుకొని అమ్ముతున్నాం.. మీరు ఎవరికైనా చెప్పుకోండి.. అంటూ వినియోగదారులనే తిరిగి బెదిరిస్తున్న పరిస్థితి. ఇంత జరుగుతున్నా తూనికలు, కొలతల శాఖ అధికారులు తమకేం పట్టన్నట్లు వ్యవహరిస్తున్నారు. దాదాపు 90శాతానికి పైగా దుకాణాల్లో దందా దర్జాగా సాగుతుంటే.. అలా ఏం లేదన్న రీతిలో వారు సమాధానం ఇస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. వినియోగదారుల హక్కుల విషయమై అవగాహన పెంచేలా వారోత్సవాలు నిర్వహిస్తున్న సమయంలో... వారు ఇంత ఉదాసీనంగా వ్యవహరించడం విమర్శలపాలవుతోంది. ఈ విషయమై సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కొన్ని దుకాణాల్లో ‘ఈనాడు’ పరిశీలన చేపట్టగా.. గరిష్ఠ చిల్లర ధర కంటే అదనంగా దాదాపు వసూలు చేస్తున్నట్లు బహిర్గతమైంది.

కనిపించకుండా చేసి..

సంగారెడ్డి కలెక్టరేట్‌ నుంచి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వైపు మార్గంలోని జిమ్‌ పక్కనే ఉన్న కిరాణా దుకాణంలో ప్రముఖ సంస్థకు చెందిన లీటరు నూనె ప్యాకెట్‌ను కొనేందుకు ప్రయత్నించగా... ఆ ప్యాకెట్‌ మీద రూ.211 అంటూ స్టిక్కర్‌ను అంటించారు. దానిని తొలగించి చూడగా.. కంపెనీ ముద్రించిన రూ.157 ధర అలాగే ఉంది. ఇదేంటని దుకాణదారును అడగ్గా... నాకేం తెలీదు.. డీలరు మాకు ఇలాగే అమ్ముతున్నారు.. మేం ఈ ప్యాకెట్‌ను రూ.195కి విక్రయిస్తున్నామని సమాధానమిచ్చారు. స్టిక్కర్‌ సంస్థ వాళ్లు వేయలేదు కదా అని అడిగితే.... ఆ విషయం తనకు తెలియదన్నారు. చివరికి రూ.195 చెల్లిస్తేనే ఆ ప్యాకెట్‌ను ఇచ్చారు. ఇలా సంస్థ ముద్రించిన ధరతో పోల్చితే రూ.38 అదనంగా వసూలు చేశారు. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని, తాము తగిన చర్యలు తీసుకుంటామని తూనికలు, కొలతల శాఖ అధికారులు చెబుతున్నారు.

సంగారెడ్డి పట్టణం నుంచి కల్వకుంట వైపు వెళ్లే దారిలో రెండు కిరాణా దుకాణాల్లో పరిశీలించగా.. ఎమ్మార్పీ కంటే రూ.20 అదనంగా అడిగారు. వాస్తవానికి ఆ నూనె ప్యాకెట్ల మీద రూ.155 అని ముద్రించి ఉంది. రూ.20 ఎక్కువగా ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తే.. ఇష్టం లేకుంటే తీసుకోకండి అంటూ.. రుసరుసలాడుతూ సమాధానమిచ్చారు.

కళ్లెదుటే జరుగుతున్నా.. చర్యలేవి?

ఎవరైనా వస్తువులపై ముద్రించిన గరిష్ఠ చిల్లర ధర కంటే ఎక్కువకు వస్తువులు అమ్మితే తూనికలు, కొలతల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. సంబంధిత దుకాణాదారులపై కేసు నమోదు చేయాలి. వినియోగదారులకు ఊరట దక్కేలా చొరవ చూపాలి. జిల్లాలో ఇందుకు పూర్తిగా భిన్నమైన పరిస్థితి. ఆ శాఖ అధికారులకు తమకేం పట్టనట్లు ఉండిపోయారు. విధిగా నెరవేర్చాల్సిన బాధ్యతలనూ విస్మరిస్తున్నారు. ఈ విషయమై తూనికలు, కొలతల శాఖ జిల్లా అధికారి ప్రవీణ్‌ను అడగ్గా... ఒకరిద్దరు దుకాణదారులు రూ.5 అదనంగా వసూలు చేసినట్లు తాము గుర్తించామని చెప్పడం గమనార్హం. దర్జాగా చాలా దుకాణాల్లో దోపిడీ పర్వం కొనసాగుతున్నా కనీస తనిఖీలు లేవు. వినియోగదారుల్లో అవగాహన పెంచే చర్యలు కానరావడం లేదు.

ఇదీచూడండి:Love Medicine : ప్రేమను పుట్టించడానికీ మందులా...? వాడితే....

ABOUT THE AUTHOR

...view details